Wednesday, December 21, 2011

దయ్యంతో నా అనుభవం

దయ్యంతో నా అనుభవం


కొంచెం పెద్ద అనుభవమే.... తీరికున్నప్పుడు చదవండేం.....


అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. వేసవి సెలవలకి అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళాను.
ఆట పాటలతో , పుస్తకాలు చదవడంతో కాలక్షేపం అయిపోయేది.
ఇది ఇలా ఉండగా ఒక రోజు అందరి భోజనాలయ్యాక ఆరుబయట మంచాలేసుకుని చుక్కలని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ( ఆ మరే నేనో పెద్దనాపసానినని నేను చెప్పింది అందరూ వింటారా ఏంటి... అమ్మా వాళ్ళేదో మాట్లాడుతుంటే మనం కిక్కురుమనకుండా పక్కన కూర్చుని వినడమే....)

ఈలోగా మావయ్య వచ్చాడు. హమ్మయ్య మావయ్యైతే కాసేపు మాతో ఆడుకుంటాడూ , బోలెడు కథలు చెప్తాడని.... ఇక ఇక్కడ మనకేమి పని అనుకొని నేనూ మా అక్కా మావయ్య దగ్గరికి పరుగెత్తుకెళ్ళాం.
 మావయ్య తింటూ మాకూ చెరో ఆవకాయ ముద్దా, పెరుగన్నం ముద్దా పెడితే ఎంచక్కా వద్దనకుండా తినేసాం.

ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉండేది "మావయ్య తినే రెండు ముద్దలన్నా తిననియ్యండే... !" అని.
దానికి నేనేదో పెద్ద గొప్ప పండితురాలిలాగా ఒక రోజు మావయ్య తినే ముద్దలన్నీ లెక్కపెట్టి "మావయ్యా..! నువ్వు తినేది 23 ముద్దలైతే అమ్మేంటి 2అని అంటుంది" అని అడిగాను.(అమ్మని అడగాలంటే చచ్చేంత ధైర్యం కావాలి తెలుసా..)

సరే ఇక  విషయానికి వస్తే మావయ్య భోజనం చేసాక "కథలు చెప్పూ..! కథలు చెప్పూ...! " అంటూ ఇద్దరం గోల చేసేసరికి , మావయ్య అరుగెక్కి కూర్చుని మమ్మల్ని చెరో పక్క కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలెట్టాడు.

పాపం మా మావయ్య తన మానాన తను చందమామ కథలు చెప్తుంటే నేనే ఆపి  "మావయ్యా ! నువ్వు నిజంగా దయ్యాన్ని చూసావంట కదా.... మరి ఆ కథ మాకెప్పుడూ చెప్పలేదేంటి?" అని ఏదో గొప్ప రహస్యం బయట పెట్టినదానిలాగా నడుమ్మీద చెయ్యేసుకుని నిలదీసినట్టుగా అడిగాను.

దానికి మా మావయ్య "నీకెవరు చెప్పారే.... అన్నీ ఇట్టే తెలుసుకుంటావ్.... అయినా అది చిన్నపిల్లలు వినే కథ కాదులే" అని మమ్మల్ని శాంతిపచూసాడు.

ఈ చిన్నపిల్లలు చూడకూడదు/వినకూడదు/మాట్లాడకూడదు అనే మాటలున్నాయి చూసారాండీ అవి మహా చెడ్డవి.
ఎక్కడ లేని రోషాన్ని తెచ్చిపెడతాయి. అన్ని లాజిక్కులనీ గుర్తుచేస్తాయి...

పొగిడినట్టే పొగిడి మా మవయ్య వేసిన చురకకి మన బుర్ర పాదరసంలాగా పని చేసి 'ఏ అర్థరాత్రి ఫోను వచ్చిందని చిన్న తాతయ్య ఇంటికి పంపినప్పుడు చిన్నపిల్లలము కామా.... ? బావినుంచి నీళ్ళు తెచ్చేటప్పుడు (చిన్న బిందెడు - తిప్పి కొడితే లీటరు నీళ్ళు ఉండవు - పూజకని మాచేత స్నానమవగానే తెప్పించేవాళ్ళు)  చిన్నపిల్లలము కామా....?' ఇలా నిలదీసేసరికి మావయ్యకి ఏమిచేయాలో పాలుపోక సరే చెప్తాను కానీ 'నిద్రలో భయపడి లేస్తే మావయ్యే దయ్యం కథ చెప్పాడని మీ అమ్మకి చెప్పొదని మా ఇద్దరి దగ్గర మాట తీసుకున్నాడు.

సరే నీకెందుకు ప్రాణం పోయినా మాట తప్పం అన్న రేంజ్లో మొహాలు పెట్టి చెప్పమన్నట్టుగా సైగ చేసాం.

మా మావయ్య చెప్పిన నిజం దయ్యం కథ :

ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి పొలంలో పడుకోవటానికి వెళ్ళాను. (అంటే జీతగాళ్ళు ఊరికెళ్ళినప్పుడో , ఏదైనా దొంగల భయం ఉన్నప్పుడో మావయ్య కూడా వెళుతుండేవాడు). సరే అందరం ఇంట్లో భోజనాలు చేసే వచ్చాము కదా అని వస్తూ వస్తూ కొట్లో కూల్ డ్రింకులు తెచ్చుకున్నాం (నేనైతే అస్సలు నమ్మలేదండీ....)

 అందరం ముచ్చట్లు పెట్టుకోవడం మొదలెట్టాము మధ్య మధ్యలో కూల్ డ్రింకు తాగుతూ పిచ్చా పాటీ మాట్లాడుకుని, కాసేపు అంత్యాక్షరీ అని గుర్తొచ్చిన పాటలన్నీ పాడుకొన్నాము. అర్థరాత్రైంది పడుకుందాం అనుకొని  అందరం బాత్రూం కి వెళ్ళి వచ్చాము.

పడుకోబోతుండగా ఒక నిప్పు రవ్వ (మంట లాంటిదంట)  మాకు దూరంగా కనబడింది.
 ఈ టైములో ఎవరుంటారా అని ఏవో తెలిసిన 2,3 పేర్లు పిలిస్తే ఎవరూ పలకలేదు. అది చూస్తూ చూస్తూ దగ్గరయ్యి మా పక్కగా మన పొలంలోని బావి దగ్గరకి వెళ్ళి 3 సార్లు బావి చుట్టూ తిరిగి బావిలో పడిపోయింది.

 అప్పటి వరకు ధైర్యంగా కబుర్లు చెప్పుకున్న మేము ఏమీ అర్థం కాక బిక్కచచ్చి పోయాము. అంతలో నా మిత్రుడొకడు అరేయ్ వారం రోజుల క్రితం మన ఊరి XXX ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కదా.... కొంపదీసి అదే దయ్యమయి ఇలా తిరుగుతుందేమోరా ....! అన్నాడు.

 అంతే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్కరికి నిద్రపడితే ఒట్టు.
ఇంక ఒకరి తరువాత ఒకరు వాళ్ళకు తెలిసిన దెయ్యజ్ఞానం పంచడం మొదలెట్టారు.

 అరే ఇలా నిప్పురూపంలో తిరిగే దయ్యాలని "కొరివి దయ్యం" అంటారంటరా....."XX దెయ్యం' (పేరు మర్చిపోయాను) ఎప్పుడూ కట్టెలు విరుస్తూ ఉంటుందంటరా..... ఫలానా దెయ్యం ఇష్టమైన వాళ్ళతొనే మాట్లడుతుందంటరా...... అరే ఎవరూ కనబడకపోయినా రాయి విసిరితే అది ఎవరికైనా తగిలినట్టుగా కిందపడితే (డైరెక్టుగా కిందపడకుండా అని అర్థం లేండి) ఖచితంగా దయ్యమే అంటరా..... కోరికలు తీరక చనిపోయినవారు ఆత్మలయి ఎదో ఒక దానిలోకి దూరి వారి కోరికలను తీర్చుకుంటాయంటరా...... ఇలా నోటికొచ్చినవన్నీ చెబుతుంటే ఒక్కొకరికీ భయం పెరిగిపొయింది....

ఇంతలో తెల్లవారుతుందగా ఇటుగా ఎవరో వస్తున్నట్టు అలికిడికాగానే అందరం తలా ఒక రాయి ఏరి విసిరికొట్టాము. దానికి భయపడ్డ మన జీతగాడు (అదృష్టవశాత్తు ఒక్క రాయీ తగల్లేదు)  "అబ్బో..! అమ్మో...!" అంటూ మొత్తుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. జీతగాడి గొంతు గుర్తుపట్టగానే అందరూ ఊపిరి పీల్చుకుని, వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్ళకి పరిగెత్తాము.

ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ ఎవ్వరూ దయ్యాల మాట మాత్రం ఎత్తలేదు.

---------------------------------------------------------------------------------

నాకెందుకో మా మావయ్య సగం కథ ఎగరగొట్టేసాడని గట్టి నమ్మకం. సరే కానిమ్మని మావయ్యను కాసేపు ఆటపట్టించి నిద్రపోదామని అమ్మ దగ్గరకు వెళ్ళాము. లోలోపల మాకు కొంచం భయంభయంగానే ఉంది.

ఇంతలో మా చినతాతగారికి అర్జెంటు  ఫోను.  మామూలుగానైతే ఏ భయం లేకుండా పరుగెత్తుకెళ్ళి
పిలుచుకొచ్చేదాన్నీ....... కానీ కాస్త భయం కూడా తోడయ్యేసరికి  నిద్రముంచుకొచ్చినట్టు నటించాను.

కానీ అమ్మ ఊరుకోదు కదా "అందరూ పడుకున్నారు ఇద్దరూ ఇప్పటిదాకా కబుర్లాడారు కదా అంతలోనే నిద్ర ముంచుకొచ్చిందా" అని కోప్పడుతూ వెళ్ళి రమ్మంది........

సరే దేవుడి మీద భారమేసి గేటు దాటి కొంచం దూరం వెళ్ళాను.
నాకక్కడ ఏదో ఆకారం ఉనట్టుగా కనిపిస్తుంది ఎందుకైనా మంచిదని వెనక్కి వెళ్ళి 'అక్కను కూడా రమ్మను.... ఇప్పటిదాకా అది కూడా కబుర్లాడిందిగా మరీ' అన్నాను. సరే అక్క కూడా నా వెంట వచ్చింది. అక్కడి దాకా వచ్చాక
 అక్కని ఆపి 'అక్కా...! అక్కా....!  అక్కడేదో ఉంది చూడు గాడిదలాగనో / గుర్రంలాగానో ఉంది కదా ' అన్నాను.

 ఈ భయం మహ చెడ్డదండి ఉన్నది లేనట్టుగాను , లేనిది ఉన్నట్టుగాను , వినపడకపోయినా వినిపించినట్టుగాను ఉంటుంది. పాపం మా అక్క నా మాటల ప్రభావం వల్ల అది గాడిద అని నిర్ధారణ చేసింది. ఇక అంతే వెనక్కి
చూడకుండా పరిగెత్తి చిన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఫోను వచ్చిందని చెప్పి... అలాగే గాడిద సంగతి చెప్పాము.....  తాతగారికి ఏమీ అర్థంకాక పనివారిని వెంటబెట్టుకు వచ్చి.... ఇంట్లో అందరినీ లేపేసి హడవిడీ చేసేసి అక్కడ ఏమి లేదు చెట్టుకొమ్మ విరిగిపడిందని తేల్చేసారు.

కానీ అమ్మ ఊరుకుంటుందా " ఫోనొచ్చింది పిలుచుకురమ్మంటే ఇంత రాద్ధాంతం చేస్తారా" అని తిట్ల వర్షం కురిపించడం మొదలెట్టింది..... వెంటనే నేనందుకుని 'అక్కడేదో ఉన్నట్టుంది కదక్కా అంటే అక్కే అది గాడిదే అని చెప్పిందీ' అన్నాను.

దానికి పాపం అందరి నుంచి తిట్లు 'చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపొతే నీకేమయ్యింది..... XXXX.....XXX ' అంటూ.

ఇప్పటికీ ఎప్పుడైన మా అక్కకి ఆ విషయం గుర్తుకు వస్తే మాత్రం ఛాన్స్ వదలకుండా తిడుతుంది....

Thursday, December 15, 2011

నాకే నవ్వొచ్చింది

నాకే నవ్వొచ్చింది

నేను చదువుకునే రోజుల్లో ఒక కథ రాసాను... అది అంతగా హాస్యం పండించకపోయినా ఎందుకో చదువుకుంటే నాకే నవ్వొచ్చింది...

బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో పోస్టు చేసిన ఆ కథ లింకు ఇక్కడ

Wednesday, December 14, 2011

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

మల్లెకన్నా తెల్లనైన అమ్మ మనసుకు వందనం
మంచుకన్న చల్లనైన అమ్మ చూపొక నందనం
ముత్యాలమూటలైన మాటలకు , రత్నాలరాశులైన అండదండలకు అభివందనం
అమృతమయ చేతులకు , అనంతమైన ఆశీర్వచనములకు పాదాభివందనం
అన్నిటికన్నా మిన్నైన అమ్మ ఒడిలోని వెచ్చందనానికి
అమ్మ చూపులోని కరుణకు , అమ్మ చూపించే ప్రేమకు ఆనందమయ జన్మదినం

అమ్మ ఇలాగే కలకాలం సంతోషంగా,ఆనందంగా,  ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటూ
 హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు