Tuesday, January 31, 2012

వీరికి మీ వంతు సహాయం చేయండీ ప్లీజ్......

మొన్న జనవరి 26వ తారిఖు,గణతంత్ర దినోత్సవాన అమ్మను ఒక స్కూలు వారు జెండా ఎగరవేయటానికి చీఫ్ గెస్టుగా పిలిచారు.



అది అంగ వైకల్యములు గల పిల్లల స్కూలు.....
అక్కడ ఎంతోమంది చిన్న పిల్లలకు కళ్ళు కనబడవు , చెవులు వినబడవు , మాటలు రావు.
చూడటానికి 40 ఏళ్ళున్నా ఎదగని మెదడుతో ఉన్నారొకరు. మొత్తం వంద మంది దాకా ఉంటారు....

ఇక్కడ ఇచ్చిన పికాసా అల్బం లింకులో వారికి వచ్చిన విధంగా చేసిన ఆసనాలు, యోగా మొదలగునవి చూడొచ్చు..... కొంత మంది 'మౌనంగానే ఎదగమని..." లాంటి కొన్ని పాటలు కూడా పాడారంట......

Shanthi Welfare Association for Deaf, Blind and handicapped

ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే ఆ పిల్లలు ఎవరూ లేక , తల్లిదంద్రులు తమకు వద్దనుకున్న వారు. వీరందరినీ ఒక వృద్ధ దంపతులు చేరదీసి ఇన్నేళ్ళుగా వారి బాగోగులు చూసుకుంటున్నారు.

కానీ ఏ ఒక్కరు వీరికి సహాయం చేయడానికి ముందుకు రాక ఉన్న ఆస్థులు ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ నెట్టుకొస్తున్నారు.

ప్రస్తుతానికి పిల్లలకి తరగతి గదులు, హాస్టలు రూములు అవీ మటుకు ఉన్నాయి.... ఆ పక్కన ఉన్నవన్నీ అమ్మేసారు. ఇప్పుడు ఆ పెద్దాయనకి కూడా ఒంట్లో బాగోలేక పూర్తిగా మంచం మీదే అన్నీ అనే స్థితికి వచ్చారు.

ఆ దంపతుల కూతురు , అల్లుడు ఆ స్కూలుని నడుపుతున్నారు.....
కూతురే పిల్లలకి అన్నీ చేస్తున్నారు.... స్నానాలు పోయడం, భోజనం పెట్టడం మరియు మిగితా కార్యక్రమములు కూడా....

నేను ఇదంతా చెప్తున్నది ఎందుకంటే వీరికి తినడానికి కూడా సరి అయిన భోజనం లేక ఉన్న కొద్దిపాటి లోనే నెట్టుకొస్తున్నారు

మనం పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ , ప్రేమికుల రోజు అంటూ ఎన్నో జరుపుకుంటాము కదా...... ఆ ఏదో ఒక రోజుని ఎంచుకొని ఈ పిల్లల కోసం ఒక 100 రూపాయలో లేక మీరు నిజంగా అక్కడి దాకా వెళ్ళగలిగితే ఏ పండ్లో , బట్టలో తెసుకువెళ్ళగలిగితే చాలా సంతోషం....

అమెరికాలో ఉన్నవారు మీరు సహాయం చేయదలిస్తే నా అకౌంట్ నెంబరు మీకు మెయిలు చేస్తాను... మీరు ఇచ్చిన $1 ఐనా సరే నేను వారికి పంపి ఆ స్క్రీనుషాట్ మీకు పంపిస్థాను.

ఇండియా వారైతే మీకు వారి అకౌంట్ నెంబరు మెయిలు లో ఇస్తాను..

అంతే కాదు మీకు వారి పూర్తి వివరాలు ఇదే బ్లాగులో చివరన ఇస్తాను.....
మీరు ముందుగా వారికి కాల్ చేసి మీకు నమ్మకం కుదిరాకే ఏ సహాయం అయినా చేయండి...

మీరు ఇచ్చే 10 రూపాయలతో వారికి 10 పెన్సిళ్ళు వస్తాయి....
మీరు ఇచ్చే ఒక్క డాలరుతో వారికి కొన్ని పుస్తకాలు వస్తాయి......

అలోచించండి....... సహాయం చేయదలిచిన వారు నాకు మెయిలు చేసినా, ఇక్కడ కామెంటు పెట్టినా సరిపోతుంది....


Address : 


Shanthi Welfare Association for Deaf, Blind and handicapped
D.No 20-5-116
Contractors Colony
Dhyana Ashram
New Palvancha
507115
Khammam A.P

Contact :

K. Chrysolite  --  9346465642
SSV Sagar  -- 9346376707 (Manager)


Sunday, January 22, 2012

ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?

ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?

ఏది బాధా........? ఎందుకా బాధా.....? అంటారా..? అదే చెబుతాను చదవండి....

మొన్న నేను వంట చేసాక అమ్మతో మాట్లాడుతున్నానా.......నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది......
అమ్మతో అనలేదు లెండి కానీ మీతో పంచుకుంటున్నాను....

ఆలోచన అంటావు..... బాధ అంటావు ... ఏంటో చెప్పొచ్చు కదా అంటారా ....... అలాగే ఐతే మీరే చదవండి......

తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసి పంపుతారు కదా........ అదే ఆడపిల్లలకే లెండి ........
అలా పంపాక ఆడపిల్లలు ముందు నేర్చుకున్నా నేర్చుకోపోయినా............
ఎంతో కష్టపడి వంట చేస్తూ కొద్దిరోజుల్లోనే అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు...

అది కొత్తగా చెప్పాలా... మాకు తెలియదా అనకండి.... విషయములోకి వస్తున్నా....

ఒకవేళ ఆ తల్లిదండ్రులకి ఆడపిల్లలు మాత్రమే ఉన్నారనుకోండి......... పిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపేసాక వారికి పెద్దతనం వల్ల ఏ జ్వరమో , వంట్లో బాగోలేకపోవడమో వచ్చిందనుకోండి .... (రావాలని నా ఉద్దేశ్యం కాదు...) నాన్నకా... పొయ్యి వెలిగించి టీ పెట్టడం కూడా రాదు......... ఎంత ఓపిక లేకపోయినా అమ్మకు లేచి వంట చేయడం తప్పదు........

ఎంతో బాగా వంట చేయడం వచ్చి పాట్లక్కులకి (PotLucks/Get-togethers ki) వాటికి వంట బ్రహ్మాండంగా చేసి అందరి మన్ననలు అందుకొని అమ్మకి ఫోను చేసి మరీ "అమ్మా....! ఇవాళ నేను చేసిన గుత్తొంకాయ ఎంత బాగా కుదిరిందో ...... అందరూ చాలా మెచ్చుకున్నారు" అని చెప్పే కూతురికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో కదండీ....

"నువ్వు నేర్పిన వంటనే నేను రకరకాలుగా చేయగలిగినా ఒక్క రకం కూడా నీకు చేసి పెట్టలేని నా ఈ స్థితిని ఎలా వివరించాలో తెలియడంలేదని " ఆ అమ్మడి గుండె ఎంత విలవిలలాడుతుందో కదా....

అంటే ఆడవారికేనా బాధ మాకు ఉండదా అంటూ గొడవకి రాకండి...... మీ గురించి కూడా చెబుతున్నాను.....

కూతురిని అత్తారింటికి పంపాక, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండీ...............??

కొడుకులకు కూడా ఆ బాధ ఉంటుందండి........ (ఏదీ ...? వంట చేసి పెట్టడమా అనకండి....!)


అమ్మ ఎప్పుడైనా "నాన్నకి బాగాలేదురా ....! ఆస్పత్రి కి ఒక్కరే వెళ్లి వచ్చారు" అన్నప్పుడో........!

"ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందిరా నాన్నకి బాగోలేదని నేనే ఎలాగోలా కట్టేసి వచ్చాను " అన్నప్పుడో.......!!

లేక

"పండక్కి వంటలేమి చేసావు అమ్మా............?" అని కొడుకడిగితే

"ఉన్నది మేమిద్దరమే కదరా... ఏమి వండినా తినేది ఎవరు.... అందుకే కాస్త పులిహోర కలిపి నైవేద్యం పెట్టేసా" అని చెప్పే అమ్మ మాటలు విన్నప్పుడు.....

అబ్బాయిలకి కూడా బాధగా ఉంటుందండీ....

మరి ఇంత బాధ పడేవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి .....? విదేశాలకెందుకు వెళ్ళాలి.........? అని అడుగుతారేమో........!!

ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి ......?

ఏదో బలీయమైన కారణం లేనిదే ఏ కొడుకైనా తన తల్లిదండ్రులను వదిలి దేశాలు పట్టుకు వెళ్ళిపోతాడా చెప్పండి........??

అవి ఎటువంటి కారణాలైనా కావచ్చు......... కానీ ఇవి కూడా బాధలేనండీ........ మరి మీరేమంటారు........?

Friday, January 20, 2012

విధి వంచితుడు - కథ (కొండపల్లి జోగారావుగారు)

మా తాతగారైన కొండపల్లి జోగారావుగారు రాసిన కథల కాపీని నేను నా బ్లాగులో జతపరుస్తున్నాను.

నేనడిగినదే తడువుగా నాకు కథలను పంపిన తాతగారికి నా సవినయ నమస్కారములు తెలియజేసుకుంటూ.....

మొదటి కథ --- విధి వంచితుడు

కింద Scribd టూల్ యొక్క మొదటి బటన్ 'View in Full Screen' క్లిక్ చేసి Full Screen లో చదవండి....


విధి వంచితుడు











Friday, January 13, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు



అసలు సంక్రాంతి అంటే... అంటూ మీకు లెక్చర్లు దంచకుండా
క్లుప్తంగా దాని విశిష్టత చెప్తాను

సూర్యుడు వెలుగునిచ్చెవాడే కాదండోయ్ మనం కొలిచే దైవం కుడా ....

సూర్యభగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

ఆ సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి తిరిగడాన్ని " సంక్రమణం" అంటారు ..........పూర్తిగా చదవండి





Wednesday, January 4, 2012

జున్నుకై కట్టిన పన్ను - ఒక చిన్న కథ

జున్నుకై కట్టిన పన్ను - ఒక చిన్న కథ

శ్రీనివాస్ అమెరికాలోని పెద్ద సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అతడికి ఎంతసేపు పని మీద ధ్యాస తప్ప ఇంకో మాట లేదు.

శ్రీనివాస్ బామ్మేమో వాడు ఈ పండక్కి వస్తాడు ఆ పండక్కి వస్తాడనుకొని పిండి వంటలన్నీ చేసి ఉంచేది. వాడేమో ఫోనులోనే శుభాకాంక్షలు, స్కైపులో (Skypeలో)  ఆశీర్వచనాలతో కాలం గడిపేస్తున్నాడు.

"ఎందుకురా వాసూ...!!  అంత సంపాదన ఏం చేసుకుంటావ్" అని బామ్మ అడిగితే
"ఇంకో రెండేళ్ళు ఉంటే పచ్చ కార్డు వస్తుందే బామ్మ" అన్నాడు.
"ఓసి పిచ్చి వెదవా అందుకా....! మరి ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగా...... అయినా చక్కగా మన ప్రభుత్వం వారిచ్చిన తెల్లకార్డు నా దగ్గర ఉందిగా ...... అది నీ పేర మార్పిస్తాలే నువ్వొచ్చెయ్యి" అంది గ్రీన్ కార్డ్ అంటే తెలియని బామ్మ.

"నీకు చెప్పినా అర్థం కాదులేవే బామ్మా...!!" అంటూ ఫోను పెట్టేసాడు.

ఇది ఇలా ఉండగా మన బామ్మ గారికి ఇక విసుగొచ్చేసింది , ఇహ వీడు రాడనుకొని వంటలు చేయటం, ఎదురు చూడ్డం రెండూ మానేసింది.

ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ మన వాడికి తానెప్పుడో చిన్నప్పుడు తిన్న ' జున్ను ' గుర్తుకొచ్చింది.

ఇంక ఒక్క క్షణం ఆలోచించకుండా దొరికిన విమానం ఎక్కి ఇంటి దారి పట్టాడు.
నేను వస్తున్నానే బామ్మా అని నెత్తీ నోరూ బాదుకున్నా 'నేను చచ్చినా నమ్మను , ఇంక ఎప్పుడూ నీతో మాట్లాడను పోరా' అంటూ బామ్మ ఫోను పెట్టేసింది.

బామ్మకు విషయం చెప్పి  ఎయిర్ పోర్టు  కి జున్ను తెప్పించుకుందాం అనుకున్న వాడి ఆశ అడియాశే అయ్యింది.

సరే చేసేది లేక ఆ కొన్ని గంటలు ఎలాగోలా గడిపేసాడు...

విమానం దిగీ దిగగానే ఏ షాపులోనైనా జున్ను కనబడుతుందేమో అని ఆత్రంగా వెదకసాగాడు....

అదేమైనా పాల దుకాణమా... ఎయిర్ పోర్టు ..... అక్కడెందుకుంటుందీ .....

కానీ తాను లేని ఈ 10 సం||లలో వచ్చిన మార్పుని పెద్దగా గమనించలేకపోయాడు ఈ హడావిడిలో....

సరే బ్యాగులందుకొని టాక్సీ ఎక్కి , ఒక రైలు, ఒక బస్సు మారి ఊరు చేరాడు......

ఊర్లోకొచ్చిన తర్వాత అందరూ తనని వింతగా చూస్తుంటే ఒక్క మాటా మాట్లాడకుండా ఇల్లు చేరాడు.....

బియ్యం కడిగిన నీళ్ళు ఇంటి ముందు చెట్లో పోద్దామని వచ్చిన బామ్మ ఒక్కసారిగా వీడిని చూసి ఆనందం పట్టలేక

"ఒరే వాసూ! నువ్వు వస్తున్నా వస్తున్నా అంటే నమ్మకుండా పోరా అని ఫోను పెట్టేసానని,ఇంక ఎప్పుడూ నీతో మాట్లాడను అన్నానని రెక్కలు కట్టుకుని వచ్చేసావా నాయనా......!! మా నాయనే.... మా తండ్రే ..... మా బాబే " అంటూ దగ్గరకు తీసుకొని ముద్దుచేయసాగింది.

వీడి జున్ను ఆత్రంతో 'అవును ' అని అబద్దమైనా ఆడలేక "కాదే బామ్మ జున్ను తినాలనిపించి వచ్చాను"  అన్నాడు.

బామ్మ ఒక్క క్షణం బిత్తరపోయి పిచ్చి వాడిని చూసినట్టు చూసి "జున్ను తినడానికి వచ్చావా ఇన్ని సంవత్సరాల నుంచి నీకిష్టమని ప్రతి పండక్కి అరిశెలు, సున్నుండలు , చక్రాలు , చెక్కలు చేసి ఉంచుతుంటే ఒక్క నాడైనా ఏం చేసావే బామ్మా అని అడగలేదుగానీ జున్ను కోసం వచ్చాడట...... జున్ను కోసం" అంటూ  కొంగు ముడేసుకుంటూ బియ్యం కడిగిన నీళ్ళు చెట్లో పోసి లోపలికి వెళ్ళిపోయింది.

వెళ్ళనైతే వెళ్ళింది కానీ ' ఇప్పటికిప్పుడు జున్నంటే ఎక్కడ నుంచి వస్తుంది.. అదేమైనా పిండి రుబ్బి దోశలేయడమా క్షణాల్లో అయిపోవడానికి , అయినా వీడికీ వేవిళ్ళ కోరికేంటో ' అని మనసులో అనుకుంది...

ఇటు మన శ్రీనివాసుడు మాత్రం నివాసనికి చేరినా వాసాలు లెక్కపెడుతూ కూర్చోవల్సి వస్తుంది..... బయట ఊరి జనం ఏదో కొత్త జంతువుని చూసినట్టు చూస్తున్నారే....... అని బాధపడసాగాడు.

ఇంతలో స్నానానికి పనివారి చేత నీళ్ళు తోడించి , అవి కాగి వాడు స్నానం చేసే లోపు భోజనం తయారు చేయసాగింది బామ్మ...

మరి ఒకటా రెండా 10ఏళ్ళ తర్వాత మనవడు ఇంటికి వస్తే ఒక్క పప్పు, చారు వేసి పెడుతుందా .......!!

స్నానం చేసి బట్టలు మార్చుకునే లోపు మనవడికి ఇష్టమని చింతచిగురు పప్పు, దోసకాయ పచ్చడి, కొబ్బరిమావిడికాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర, పనస పొట్టు ఆవ పెట్టిన కూర, చుక్క కూర పులుసుకూరా, మావిడికాయ పులుసు, మజ్జిగ పులుసు, గడ్డ పెరుగు, పెరుగులోకి మాగాయ, నిమ్మకాయ అప్పుడే జాడీలోంచి తీసి అలాగే  పప్పులోకి, పులుసు లోకి తింటాడని గుమ్మడొడియాలు, చల్ల మిరపకాయలు వేయించి , అప్పుడే తీసిన వెన్నతో నెయ్యి కాచి పొయ్యి దగ్గర నుంచి లేచి వచ్చింది.

ఇన్నీ అయితే చెయ్యగలిగింది కానీ వాడడిగిన జున్ను మాత్రం తెప్పించలేకపోయింది.

ఇంతలో స్నానం చేసి వచ్చి ఆత్రంగా వంటింట్లో వెతకసాగాడు, ఖచ్చితంగా బామ్మ తనకోసం జున్ను తెప్పించి ఉంటుందనే నమ్మకంతో...... వాడు రావటం గమనించిన బామ్మ వంటింట్లోకి వచ్చి " ఒరేయ్...! ముందు భోజనం చెయ్యరా జున్ను పక్కూరిలో దొరుకుంతుందేమో తెమ్మని మనిషిని పంపాను వాడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది " అని చెప్పి పీట వేసి అరిటాకులో భోజనం పెట్టడం మొదలుపెట్టింది.

ఏవి చూసిన రెండు, రెండు ఉండటంతో "అన్నీ ఒక రొజే చెయ్యాలా బామ్మా...!! రోజుకో రకం చేసిపెట్టొచ్చు కదా..... నీకు మరీ ఆత్రం ఎక్కువ..." అన్నాడు.

దానికి బామ్మ వస్తున్న నవ్వు ఆపుకుంటూ "నీ జున్ను పై కన్ను చూస్తుంటే అది దొరక్కపొతే ఒక్క క్షణం కూడా ఆగేటట్టు లేవు  అందునా అమెరికాలో 10ఏళ్ళు ఉన్నాక నీ కోరికలు ఎలా మారాయో తెలుసుకోవడం కష్టమని నిన్ను చూస్తే అర్థం అయింది. అందుకే నీకు నచ్చింది వేసుక తింటావని అన్నీ రెండు రకాలు చేసాను లేరా" అంది.

ఆశ్చర్యపోవడం మన శ్రీనివాసు వంతయ్యింది.........

బామ్మ అన్నట్టుగానే ఎక్కడా జున్ను దొరకలేదు...... సరే హైదరాబాదులో దొరుకుతుందేమో వెతుక్కుంటానంటూ రెండో రొజే పట్నం బయలుదేరాడు..... సరే కానిమ్మని అమెరికా వెళ్ళేలోపు ఒకసారి వచ్చి కనబడిపొమ్మని చెప్పింది బామ్మ.

హైదరాబాదులో అడుగుపెట్టాక అర్థం అయ్యింది దేశం తను వదిలి వెళ్ళినప్పటిలాగా లేదని.......

రోడ్డు పక్క బండి మీద సాదా దోశ తిని , టీ తాగితే 70రూపాయలు...
10 రూపాయలు తీసి ఇవ్వబొతే "నాకు టిప్పక్కర్లేదు మీ బిల్ 70/- అవి ఇవ్వండి చాలన్నాడు" బండివాడు.......

మిరపకాయ బజ్జీలు 10 కి 2 , చాట్ తింటే 30 రూపాయలు.....

ఒక్కసారి తన చుట్టూ ప్రపంచం గిర్రున తిరగసాగింది..... ఇక జున్ను పరిస్థితేంటో అనుకుంటూ వెదకసాగాడు..........

ఆఖరున ఒక చోట ' ఇచ్చట జున్ను అమ్మబడును ' అన్న బోర్డు కనబడింది.
ఆత్రంగా అందులోకి దూరి అర్జెంటుగా 100రూపాయల జున్ను ఇమ్మన్నాడు.....

కొట్టువాడు పిచ్చివాడిని చూసినట్టు చూసి " 100కి జున్ను వేసే పేపర్ కప్పు కూడా రాదు , 1000 రూపాయలు మినిమం కొనాల్సిందే..... అయినా అది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు ... మీ ఫోను నెంబరు , 500 అడ్వాన్సు ఇచ్చి వెళితే సరుకు వచ్చినప్పుడు కాల్ చేస్తాం...... మేము ఫోను చేసి మీరు వచ్చే లోపు జున్ను అయిపొతే మాత్రం మీ డబ్బు తిరిగి ఇవ్వబడదు" అని చెప్పి పనిలో మునిగిపోయాడు.

అమితాశ్చర్యానికి లోనయ్యి గొంతు పెగుల్చుకొని "ఎన్ని రోజులు పట్టొచ్చు?" అని అడిగాడు.

దానికి వాడు "చెప్పలేము వారం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు" అన్నాడు

అమెరికాలో పచ్చకార్డ్ కోసం కూడా ఇంత ఆత్రంగా వెయిట్ చేసి ఉండడు......
పాపం.......!!  ఏంచేస్తాం కాలం అటువంటి మార్పులు తెచ్చిపెడుతుంది.

"మరి నేను అమెరికాలో ఉంటాను, కొద్ది రోజులకోసమే ఇక్కడికి వచ్చాను. ఎలా" అని కొట్టు వాడిని అడిగాడు  శ్రీనివాసు.

దానికి వాడు "ఒహొ అలాగా....!!  ఏం ఫర్వాలేదు మా బ్రాంచ్ అక్కడ కూడా ఉంది కాకపొతే అక్కడికి జున్ను పంపడానికి అయ్యే ఖర్చు , కస్టంస్ క్లియర్ అవ్వడానికి అయ్యే ఖర్చు, షిప్పింగు , హాండ్లింగు చార్జీలు మొదలగునవి అన్నీ మీరే కట్టాలి. ఒకవేళ అమెరికా వారు దీని మీద పన్ను విధిస్తే అది కూడా మీరే కట్టాల్సి ఉంటుందని" తాపీగా చెప్పుకొచ్చాడు.

విధిలేక డబ్బు కట్టి , వివరాలవీ ఇచ్చి , ఊరికెళ్ళి బామ్మ చేసిన పిండివంటలు పట్టుకుని తిరుగు ప్రయాణం కట్టాడు మన శ్రీనివాసు......

అమెరికాలోనైనా జున్ను దొరికేనా.......?? ఎప్పటికైనా శ్రీనివాసు బామ్మ దగ్గరికి తిరిగొచ్చేనా .....?? కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది......