Showing posts with label mom. Show all posts
Showing posts with label mom. Show all posts

Sunday, September 18, 2011

అమ్మ చిలిపితనం - 3 ఆరుద్ర పురుగు

అమ్మ చిలిపితనం - 1
అమ్మ చిలిపితనం - 2

అమ్మ స్కూలుకెళ్ళే రోజుల్లో ఎన్ని కోతి వేషాలు వేసేదో చెప్పాలంటే.... నిజంగా నేను ఒక స్నేహితురాలి గురించి చెప్పినట్టు చెప్తేనే... చాలా బాగా చెప్పగలుగుతానేమో.....

అది వర్షాకాలం. రాత్రి బాగా వర్షం పడి పొద్దున్నే ఆగిపోయింది.
అమ్మకి బడి ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. (ఎవరికైనా చిన్నప్పుడు అదే ఆలోచన ఉంటుంది కదా)

వర్షాకాలం వస్తే బడి ఎక్కువసార్లే ఎగ్గొట్టొచ్చు అని ఆశ. కానీ ఇలా రాత్రి పడి, పొద్దుటికల్లా ఆగిపోయే వర్షం అంటే చచ్చేంత కోపం.బడి ఎగ్గొట్టే వీలుండదు కదా...

అలా ఆ వర్షాన్ని తనివితీరా తిట్టుకుంటూ స్కూలికి వెళ్ళింది అమ్మ. స్కూల్లో ప్రేయర్ అవుతుంది. అందరూ లైనులో నిల్చుని ఉన్నారు. మైకులోంచి శబ్దం వినిపిస్తుంది "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్ ...స్టాండెటీజ్.... అట్టేన్షన్........స్టాండెటీజ్.... అట్టేన్షన్..... ప్రేయర్ పొజిషన్" అని.

వర్షా కాలంలో ఆరుద్ర పురుగులు చాలా కనబడేవి. మా చిన్నప్పుడు కూడా వర్షం రాగానే ఎక్కడినుంచి వచ్చేవో తెలీదు కాని ఎర్రెర్రగా సిల్కు చర్మంతో....పట్టు పురుగులలాగా........ ముట్టుకుంటే మెత్తగా......చిన్న చిన్నగా పాకుతూ........ అసలు భలే ఉండేవి....... వాటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని.... చేతి మీద కాసేపు పాకుతుంటే మురిపెంగా చూసుకుంటూ......... జాగ్రత్తగా అగ్గి పెట్టెల్లో దాచిపెట్టుకునే వాళ్ళం. ఒకటి రెండు రోజులు బాగానే చూసుకునే వాళ్ళం.......... తర్వాత మరి ఆ పురుగులు ఎలా పోయేవో తెలియదు...... చిన్నపిల్లలం కదా..... వాటి గురించి గుర్తు కూడా ఉండేది కాదు....

ఇక అసలు విషయానికి వస్తే ఈ "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్" హడావిడిలో ఆ ఆరుద్ర పురుగులు తొక్కిళ్ళలో పడి చనిపోయాయంట.
ఇంక మా అమ్మ తన బుద్ధి బలం ఉపయోగించి వాటిని జాగ్రత్తగా ఏరి దాచి పెట్టి...... స్కూల్ ఇంటెర్వెల్ లో ఆ తొక్కిన తన స్నేహితులందరినీ తీసుకొని ఒక మూలకు వెళ్ళి గొయ్యి తవ్వి........ ఈ చనిపోయిన ఆరుద్ర పురుగులను ఆ గోతి లో పాతిపెట్టి...... మట్టి కప్పిందంట.

అంతటితో ఆగక....... తన స్నేహితులతో "ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే కాసేపు గట్టిగా ఏడవాలబ్బా...... (ఇది సొంత తెలివి లేండి......మామూలుగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా...! అది ఆత్మ శాంతి కొరకు చేసే పని అని అమ్మ ఆలోచన) పాపం ఆ ఆరుద్ర పురుగులు చచ్చిపోయాయి కదా..... వాటి ఆత్మ శాంతించాలంటే మనం కాసేపు గట్టిగా ఏడవాలి" అని చెప్పిందంట.

ఇక చూస్కోండి ఆ స్నేహితులందరూ, అమ్మ కూడా గట్టిగా ఆ ప్రదేశం దద్ధరిల్లేలా ఏడ్చారంట...... అంతటితో ఆగితే సరా........
అమ్మ ఆ స్నేహితులందరినీ తీస్కెళ్ళి ఆ స్కూల్లో ఉన్న జామచెట్ల జామకాయలను కోసి (పిందెలనే లెండి) నాలుగు ముక్కలు చేసి........ ఆ ఆరుద్ర పురుగులకు పిండం పెట్టిందంట.........  అయ్యో రామా.... అదేమి చోద్యం అనుకునేరు.... అక్కడితో కూడా ఆగకుండా..... దానికి 3వ రోజు కర్మలు, 5వ రోజు కర్మలు...... పెద్ద కర్మ అన్నీ చేసి....ఆ జామ పిందెలన్నీ అయిపోయేదాకా పిండాలనీ... తద్దినాలనీ.... తనకు తెలిసిన విజ్ఞానమంతా ప్రదర్శించి..... అనకూడదు కానీ..... నానా యాగీ చేసిందంట.........

నిజంగా దేవుడేగనక ఇదంతా చూసి ఉంటే అమ్మ దెబ్బకు ఆ ఆరుద్ర పురుగులకి ఖచ్చితంగా "చిరంజీవులు కమ్మని" వరమిచ్చేవాడేమో..................

ఇదండీ.... అమ్మ ఆరుద్ర పురుగులకి ఏర్పాటు చేసిన సంతాప సభ.......

ఇంకా మరెన్నో తప్పులు, ఒప్పులు, మిడి మిడి జ్ఞానంతో చేసిన పనులన్నిటినీ రాబొయే పోస్టుల్లో తెలుసుకుందాం.......

Friday, September 16, 2011

అమ్మ చిలిపితనం - 2

అమ్మ చిలిపితనం - 1


అమ్మ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది.... ఆ అల్లర్లన్నీ చెప్పాలంటే ఇలా ఒక్కో పోస్టూ రాయాల్సిందే....
మరి అంతా... ఇంతా... అల్లరి కాదంట... అమ్మమ్మ చెప్తుంది....

ఇంక అసలు విషయానికి వస్తే....
అమ్మ స్కూల్లో కూడా బాగా అల్లరి చేసి టీచర్లతో దెబ్బలు తినేది.
అప్పట్లో గురువులంటే భయం, భక్తి ఎక్కువే కాబట్టి.. కొన్ని కొన్ని సార్లు టీచర్లు చూడకుండా జాగ్రత్తపడుతూ ఉండేదిట..... దొరికిపొతే దెబ్బలే కదా...

ఒకసారి అమ్మకి, అమ్మ స్నేహితులకి మధ్య ఏదో గొడవ జరిగిందంట....
చిన్నప్పుడు గొడవ పడితే వాళ్ళకి ఏదో ఒక హాని చేయాలి అనిపించడం సహజం కదా.... (కావాలని కాకపొయినా)

అమ్మ ఆ రోజంతా బాగా ఆలోచించసాగింది. ఈ లోగా ఇంటి బెల్లు కొట్టేసారు. ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టింది.
స్కూలు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక దులిదొండకాయల చెట్టు కనబడింది (దులిదొండకాయలు అంటే అవేనండీ వాటి పసరు రాస్తే ఒకటే దురద పుడుతుందే... ఆ గుర్తొచ్చిందా... అదే అదే.. అయ్యో.. గుర్తురాలేదా..... మరి మీరేమంటారో... నాకు తెలియదులెండి...)

వాటిని చూస్తూ అలా కొంత దూరం నడిచింది...

ఇంక మెదడులో ఠంగ్ మని గంట మోగింది..... అనుకున్నదే తడవుగా "అక్కా! అక్కా! స్కూల్లో ఒక బుక్కు మర్చిపోయానే... నువ్వు నడుస్తూ ఉండు , నేనెళ్ళి తెచ్చుకుంటాను..." అని పెద్దమ్మకి చెప్పి వెనక్కి పరిగెత్తింది...

కొంత దూరం పరిగెత్తాక ఆ చెట్టు దగ్గర ఆగి ఎవరూ చూడకుండా కొన్ని కాయలు కోసి పుస్తకాల మధ్యన దాచుకొని స్కూలు వైపు పరుగు తీసింది.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాచ్ మెన్ ఉన్నాడు.
అమ్మని చూస్తూనే "ఏంటి అమ్మయిగారు! ఇంటికి వెళ్ళకుండా స్కూలుకి వస్తున్నారు" అని అడిగాడు.

మా అమ్మ అబద్దాలు పూలు అల్లినంత తేలికగా అల్లుతుంది.
"నేను లెక్కల పుస్తకం క్లాస్ లో మర్చిపోయాను అందులో ఇచ్చిన లెక్కలు చెయ్యకపొతే రేపు టీచర్ కొడుతుంది" అని చెప్పింది.

అందుకు వెంటనే వాచ్ మెన్ కరిగిపోయి తాళం తీసి "తొందరగా వచ్చేయండీ..! నేను ఇక్కడే ఉంటా" అన్నాడు....

ఇక అమ్మ ఒక్క పరుగున క్లాసులోకి వెళ్ళి ఆ స్నేహితులు కూర్చునే, రాసుకునే బల్లల మీదా ఆ కాయలను బాగా రుద్ది ఏమీ తెలియని దానిలా బ్యాగులోంచి ఒక పుస్తకం తీసి చేతిలో పట్టుకుని బయటకి నడిచింది.

వాచ్ మెన్ అమ్మని చూసి "దొరికిందా అమ్మయిగారూ పుస్తకం?" అని అడిగితే
"ఆ..! దొరికిందంటూ' ఒక్క ఉదుటన ఇంటికి పరుగు తీసింది.

ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.... ఒక్క అమ్మకు తప్ప.......

మరుసటి రోజు మామూలుగానే స్కూలుకి వచ్చింది...... ఆ గొడవ పెట్టుకున్న స్నేహితురాళ్ళు కూడా వచ్చారు....

ప్రేయర్ అయ్యాక పిల్లలందరూ క్లాస్సులోకొచ్చారు.
ఫస్టు పీరియడ్ మొదలయ్యింది......... ఒక 5నిమిషాల తరువాత ఆ పిల్లలు ఒకటే గోక్కోవడం మొదలు పెట్టారంట...... ఒకటే దురద పాపం ఏంచేస్తారు వాళ్ళు మాత్రం....టీచర్ చూసి బయటికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కు రండి అని అరిచిందంట..... ఏమి చేస్తే ఏం లాభం అవి అలా పొయేవి కాదు కదా.......
ఇక ఆరోజంతా అలా గోక్కుంటూనే ఉన్నారంట పాపం....


అమ్మకి మొదట కాసేపు నవ్వొచ్చినా తర్వాత చాలా బాధపడిందంట.......
తప్పు చేసినప్పుడు మనకి మనమే "అయ్యో! అలా చేయకుండా ఉంటే పోయేది కదా!" అని అనుకుంటాం చూడండి...... అదేనండీ పశ్చాత్తాపం అంటారే....అదే.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా...! ఆ దేవుడు మా అమ్మ తెలియనితనంతో చేసిన తప్పులన్నీ మన్నించాలని కోరుకుంటున్నాను....

మరి ఆ స్నేహితుల సంగతీ అంటారా... స్కూల్లో స్నేహితులంటే ఎంతసేపు కొట్టుకుంటారు చెప్పండి? మా అంటే ఒకటి లేదా రెండు రోజులు అంతే కదా...... వీళ్ళు అంతే కాకపోతే ఆ దురదలు తగ్గడానికి ఒక వారం పట్టిందనేది మర్చిపోవాలి మరి......

Thursday, September 15, 2011

అమ్మ చిలిపితనం

మా అమ్మ చిలిపితనం

ఏంటీ...? అమ్మ చిలిపితనం ఏంటి....? పెద్దంతరం, చిన్నంతరం లేదా అనుకోకండి...
అమ్మ తను పెద్దయ్యాకే మనకి తెలుసు కాబట్టి అమ్మ అంటే శాంతం, ప్రేమ, ఆప్యాయత,చిరు కోపం కలగలిసిన దేవత అని మాత్రమే తెలుసుకోగలుగుతాం.

మరి అమ్మ తన చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలియాలంటే అమ్మ బాల్యం గురించి తెలుసుకోవలసిందే కదా....
అమ్మకి మనం స్నేహితులమే ఐతే ఇది అంత కష్టపడాల్సిన పని కాదని నా ఆలోచన....మీరేమంటారు...?
(మేమేదో అంటాం, అనుకుంటాం గానీ ముందు ఆ చిలిపితనం గురించి తొందరగా చెప్పూ అంటారా...)

అమ్మ చిన్నప్పుడు బాగానే చదివేది కానీ లెక్కల్లో ఎప్పుడూ కొన్ని తక్కువ మార్కులే వచ్చేవి....
పెద్దమ్మేమో ఇంట్లో లీడర్ టైపు(బాగా చదివేది కూడా)
స్కూల్లో రిపోర్టు ఇవ్వగానే పెద్దమ్మ ఇంట్లో చెప్పేసేది......
ఇంక అమ్మకేమో ఎక్కడలేని భయం తాతయ్య ఎక్కడ కొడతారో అని (చదువు విషయం లో కొంచం స్ట్రిక్ట్ లేండి)
కొట్టడం అంటే అచ్చంగా కొట్టడమే కాకపోయినా ఏదో ఒక రకం పనిష్మెంట్ ఉండేది.

పెద్దమ్మ లీడర్ అని చెప్పుకున్నాం కదా... అందరి రిపోర్టులు వరసగా పెట్టుకొని తాతయ్య గారి ముందు నిల్చొని టక టకా అన్ని సబ్జెక్టుల మార్కులు చదివేదంట... దాన్ని బట్టి ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఉండేదంట...

ఎప్పుడూ అమ్మ పెద్దమ్మని బతిమిలాడుకునేదిట  ఈ ఒక్కసారి లెక్కల మార్కులు ఎక్కువ చదవమని ఊహూ.. పెద్దమ్మ ససేమీరా ఒప్పుకునేది కాదు...

ఇదిలా ఉండగా ఒకసారి పరీక్షలలో అమ్మకి బాగ తక్కువ మార్కులు వచ్చాయంట (లెక్కలోనే లెండి)
ఇక చూస్కోండి "ఎలా రా దేవుడా! ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా ఉంది పరిస్థితి. రిపొర్టు చూపదామా నాన్న చేతి దెబ్బలు తినాలి, పోని వద్దంటే అక్క రాక్షసి ఊరుకోదు" అని అనుకుంటూ స్కూలు నుంచి వస్తుంది.

ఇంతలోనే పెద్దమ్మ "ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఎన్ని మార్కులు వచ్చాయి" అని అడిగింది.

అందుకు అమ్మ "ఇచ్చారు కాకపొతే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అక్కా ప్లీజ్.. ఈ ఒక్కసారి నాన్నకి చెప్పకే నీ పనులన్నీ నేనే చేస్తాను" అని వేడుకుంది.
(అప్పట్లో పనులన్నీ భాగాలుగా పంచుకుని చేసేవారంట)

అందుకు పెద్దమ్మ ఊరుకుంటుందా అస్సలు ఒప్పుకోలేదు.

అమ్మ బాగా ఆలోచించింది.స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉండేదిట (పల్లెటూరు కదండీ...)  అమ్మకి వెంటనే ఒక ఉపాయం తట్టింది అనుకున్నదే తడువుగా ఎవరూ చూడకుండా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ బావిలో పడేసింది..

ఎగురుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి "ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదుగా ఇప్పుడెలా చెప్తావో చూద్దాం" అని ఎక్కిరించిందంట..

పెద్దమ్మకి కోపమొచ్చి "ఉండు అప్పతో నీ పేరు చెప్పి, నిన్ను తన్నిస్తాను" అన్నదంట.

అందుకు అమ్మ "నీ దగ్గర సాక్షం లేదుగా..... నాకేం భయం... చెప్పుకో.... చెప్పుకో... చెప్పు తీసి తన్నిచ్చుకో" అన్నదంట.

అందుకు మా పెద్దమ్మకి బాగ ఉక్రోషం వచ్చి తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పడం, తాతగారు కొట్టడం.... మళ్ళీ టీచరికి 5రూపాయలు ఫైను కట్టి రిపోర్ట్ కొత్తది తయారుచేయించుకోవడం మాములే లెండి....

ఇలా ఇంకా చాలా ఉన్నాయి ...... ఒక్కొక్కటిగా పోస్టు చేస్తాను.....

నచ్చనివారు దయచేసి కామెంట్ రాయొద్దని, రాసినా అది పబ్లిష్ చేయబడదని మనవి.

Friday, March 12, 2010

మీరు ఎప్పుడైనా ఇలా ఆలొచించారా..........?

మీరు ఎప్పుడైనా ఇలా ఆలొచించారా..........?
మీకు తెలుసా.........!

మానవ శరీరం 45 డెల్(యూనిట్) నొప్పినే భరించగలదు.
కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి పడే బాధ ( ప్రసవ వేదన ) 57 డెల్(యూనిట్).
ఇది 20 ఎముకలు ఒక్కసారే ఫ్రాక్చర్ అయినదానితో సమానం అన్నమాట.....

"అమ్మను ప్రేమించండి"


దేవుడు అన్ని ప్రదేశాలలో ఉండలేక అమ్మని సృష్టించాడు............

 


                                                                                                                
 


 
 


 
 


 
 


 
 


 
 


 
 

ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషి అమ్మ ...........
గొప్ప విమర్శకురాలు అమ్మ ..........
అయినా మన ఆత్మబంధువు అమ్మ

అమ్మను ప్రేమించండీ ..........

                                                              ENGLISH VERSION

Sunday, January 10, 2010

అమ్మ సలహా...


ఇది నేను ఎక్కడో చదివిందేనండి..
బాగుంది కదా అని ఇక్కడ రాసాను.....


ఈ కాలం పిల్లలకి ప్రతీ అమ్మా ఇచ్చే సలహా ఇది .......


అమ్మ తన కొడుకు తొ...




1960’స్ ............ ......... ......... ఒరేయ్ , మన కులం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....


*
*
*
*

1970’స్…………………….. ఒరేయ్ , మన మతం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

1980’స్ ……………………. మన హోదా కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

1990’స్ ……………………. మన దేశం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

2000 ……………………. నీ వయసు కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

2010 ……………………. ఎవరైనా పర్లేదు కానీ అమ్మాయినే పెళ్ళి చేసుకోరా ….…..….. !!!