Friday, September 16, 2011

అమ్మ చిలిపితనం - 2

అమ్మ చిలిపితనం - 1


అమ్మ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది.... ఆ అల్లర్లన్నీ చెప్పాలంటే ఇలా ఒక్కో పోస్టూ రాయాల్సిందే....
మరి అంతా... ఇంతా... అల్లరి కాదంట... అమ్మమ్మ చెప్తుంది....

ఇంక అసలు విషయానికి వస్తే....
అమ్మ స్కూల్లో కూడా బాగా అల్లరి చేసి టీచర్లతో దెబ్బలు తినేది.
అప్పట్లో గురువులంటే భయం, భక్తి ఎక్కువే కాబట్టి.. కొన్ని కొన్ని సార్లు టీచర్లు చూడకుండా జాగ్రత్తపడుతూ ఉండేదిట..... దొరికిపొతే దెబ్బలే కదా...

ఒకసారి అమ్మకి, అమ్మ స్నేహితులకి మధ్య ఏదో గొడవ జరిగిందంట....
చిన్నప్పుడు గొడవ పడితే వాళ్ళకి ఏదో ఒక హాని చేయాలి అనిపించడం సహజం కదా.... (కావాలని కాకపొయినా)

అమ్మ ఆ రోజంతా బాగా ఆలోచించసాగింది. ఈ లోగా ఇంటి బెల్లు కొట్టేసారు. ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టింది.
స్కూలు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక దులిదొండకాయల చెట్టు కనబడింది (దులిదొండకాయలు అంటే అవేనండీ వాటి పసరు రాస్తే ఒకటే దురద పుడుతుందే... ఆ గుర్తొచ్చిందా... అదే అదే.. అయ్యో.. గుర్తురాలేదా..... మరి మీరేమంటారో... నాకు తెలియదులెండి...)

వాటిని చూస్తూ అలా కొంత దూరం నడిచింది...

ఇంక మెదడులో ఠంగ్ మని గంట మోగింది..... అనుకున్నదే తడవుగా "అక్కా! అక్కా! స్కూల్లో ఒక బుక్కు మర్చిపోయానే... నువ్వు నడుస్తూ ఉండు , నేనెళ్ళి తెచ్చుకుంటాను..." అని పెద్దమ్మకి చెప్పి వెనక్కి పరిగెత్తింది...

కొంత దూరం పరిగెత్తాక ఆ చెట్టు దగ్గర ఆగి ఎవరూ చూడకుండా కొన్ని కాయలు కోసి పుస్తకాల మధ్యన దాచుకొని స్కూలు వైపు పరుగు తీసింది.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాచ్ మెన్ ఉన్నాడు.
అమ్మని చూస్తూనే "ఏంటి అమ్మయిగారు! ఇంటికి వెళ్ళకుండా స్కూలుకి వస్తున్నారు" అని అడిగాడు.

మా అమ్మ అబద్దాలు పూలు అల్లినంత తేలికగా అల్లుతుంది.
"నేను లెక్కల పుస్తకం క్లాస్ లో మర్చిపోయాను అందులో ఇచ్చిన లెక్కలు చెయ్యకపొతే రేపు టీచర్ కొడుతుంది" అని చెప్పింది.

అందుకు వెంటనే వాచ్ మెన్ కరిగిపోయి తాళం తీసి "తొందరగా వచ్చేయండీ..! నేను ఇక్కడే ఉంటా" అన్నాడు....

ఇక అమ్మ ఒక్క పరుగున క్లాసులోకి వెళ్ళి ఆ స్నేహితులు కూర్చునే, రాసుకునే బల్లల మీదా ఆ కాయలను బాగా రుద్ది ఏమీ తెలియని దానిలా బ్యాగులోంచి ఒక పుస్తకం తీసి చేతిలో పట్టుకుని బయటకి నడిచింది.

వాచ్ మెన్ అమ్మని చూసి "దొరికిందా అమ్మయిగారూ పుస్తకం?" అని అడిగితే
"ఆ..! దొరికిందంటూ' ఒక్క ఉదుటన ఇంటికి పరుగు తీసింది.

ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.... ఒక్క అమ్మకు తప్ప.......

మరుసటి రోజు మామూలుగానే స్కూలుకి వచ్చింది...... ఆ గొడవ పెట్టుకున్న స్నేహితురాళ్ళు కూడా వచ్చారు....

ప్రేయర్ అయ్యాక పిల్లలందరూ క్లాస్సులోకొచ్చారు.
ఫస్టు పీరియడ్ మొదలయ్యింది......... ఒక 5నిమిషాల తరువాత ఆ పిల్లలు ఒకటే గోక్కోవడం మొదలు పెట్టారంట...... ఒకటే దురద పాపం ఏంచేస్తారు వాళ్ళు మాత్రం....టీచర్ చూసి బయటికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కు రండి అని అరిచిందంట..... ఏమి చేస్తే ఏం లాభం అవి అలా పొయేవి కాదు కదా.......
ఇక ఆరోజంతా అలా గోక్కుంటూనే ఉన్నారంట పాపం....


అమ్మకి మొదట కాసేపు నవ్వొచ్చినా తర్వాత చాలా బాధపడిందంట.......
తప్పు చేసినప్పుడు మనకి మనమే "అయ్యో! అలా చేయకుండా ఉంటే పోయేది కదా!" అని అనుకుంటాం చూడండి...... అదేనండీ పశ్చాత్తాపం అంటారే....అదే.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా...! ఆ దేవుడు మా అమ్మ తెలియనితనంతో చేసిన తప్పులన్నీ మన్నించాలని కోరుకుంటున్నాను....

మరి ఆ స్నేహితుల సంగతీ అంటారా... స్కూల్లో స్నేహితులంటే ఎంతసేపు కొట్టుకుంటారు చెప్పండి? మా అంటే ఒకటి లేదా రెండు రోజులు అంతే కదా...... వీళ్ళు అంతే కాకపోతే ఆ దురదలు తగ్గడానికి ఒక వారం పట్టిందనేది మర్చిపోవాలి మరి......

6 comments:

 1. అమ్మను మరో కోణం లో చూపారు..బాగుంది

  ReplyDelete
 2. బెంచ్ మీద పొస్తే ఏం అవుతుంది కానీ.. మేము డైరెక్ట్ గా వెళ్ళి సడన్ గా షర్ట్ వెనక పై నుంచి వీపు మీద పోసే వాళ్ళం...

  ReplyDelete
 3. Lakshmi Raghava గారు చాలా థాంక్స్ అండీ....

  ReplyDelete
 4. Kumari గారు నా పోస్టు మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ....

  ReplyDelete
 5. Vamshi గారు మీకు చాలా అనుభవం ఉన్నట్టుంది...

  ReplyDelete