Thursday, September 15, 2011

అమ్మ చిలిపితనం

మా అమ్మ చిలిపితనం

ఏంటీ...? అమ్మ చిలిపితనం ఏంటి....? పెద్దంతరం, చిన్నంతరం లేదా అనుకోకండి...
అమ్మ తను పెద్దయ్యాకే మనకి తెలుసు కాబట్టి అమ్మ అంటే శాంతం, ప్రేమ, ఆప్యాయత,చిరు కోపం కలగలిసిన దేవత అని మాత్రమే తెలుసుకోగలుగుతాం.

మరి అమ్మ తన చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలియాలంటే అమ్మ బాల్యం గురించి తెలుసుకోవలసిందే కదా....
అమ్మకి మనం స్నేహితులమే ఐతే ఇది అంత కష్టపడాల్సిన పని కాదని నా ఆలోచన....మీరేమంటారు...?
(మేమేదో అంటాం, అనుకుంటాం గానీ ముందు ఆ చిలిపితనం గురించి తొందరగా చెప్పూ అంటారా...)

అమ్మ చిన్నప్పుడు బాగానే చదివేది కానీ లెక్కల్లో ఎప్పుడూ కొన్ని తక్కువ మార్కులే వచ్చేవి....
పెద్దమ్మేమో ఇంట్లో లీడర్ టైపు(బాగా చదివేది కూడా)
స్కూల్లో రిపోర్టు ఇవ్వగానే పెద్దమ్మ ఇంట్లో చెప్పేసేది......
ఇంక అమ్మకేమో ఎక్కడలేని భయం తాతయ్య ఎక్కడ కొడతారో అని (చదువు విషయం లో కొంచం స్ట్రిక్ట్ లేండి)
కొట్టడం అంటే అచ్చంగా కొట్టడమే కాకపోయినా ఏదో ఒక రకం పనిష్మెంట్ ఉండేది.

పెద్దమ్మ లీడర్ అని చెప్పుకున్నాం కదా... అందరి రిపోర్టులు వరసగా పెట్టుకొని తాతయ్య గారి ముందు నిల్చొని టక టకా అన్ని సబ్జెక్టుల మార్కులు చదివేదంట... దాన్ని బట్టి ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఉండేదంట...

ఎప్పుడూ అమ్మ పెద్దమ్మని బతిమిలాడుకునేదిట  ఈ ఒక్కసారి లెక్కల మార్కులు ఎక్కువ చదవమని ఊహూ.. పెద్దమ్మ ససేమీరా ఒప్పుకునేది కాదు...

ఇదిలా ఉండగా ఒకసారి పరీక్షలలో అమ్మకి బాగ తక్కువ మార్కులు వచ్చాయంట (లెక్కలోనే లెండి)
ఇక చూస్కోండి "ఎలా రా దేవుడా! ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా ఉంది పరిస్థితి. రిపొర్టు చూపదామా నాన్న చేతి దెబ్బలు తినాలి, పోని వద్దంటే అక్క రాక్షసి ఊరుకోదు" అని అనుకుంటూ స్కూలు నుంచి వస్తుంది.

ఇంతలోనే పెద్దమ్మ "ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఎన్ని మార్కులు వచ్చాయి" అని అడిగింది.

అందుకు అమ్మ "ఇచ్చారు కాకపొతే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అక్కా ప్లీజ్.. ఈ ఒక్కసారి నాన్నకి చెప్పకే నీ పనులన్నీ నేనే చేస్తాను" అని వేడుకుంది.
(అప్పట్లో పనులన్నీ భాగాలుగా పంచుకుని చేసేవారంట)

అందుకు పెద్దమ్మ ఊరుకుంటుందా అస్సలు ఒప్పుకోలేదు.

అమ్మ బాగా ఆలోచించింది.స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉండేదిట (పల్లెటూరు కదండీ...)  అమ్మకి వెంటనే ఒక ఉపాయం తట్టింది అనుకున్నదే తడువుగా ఎవరూ చూడకుండా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ బావిలో పడేసింది..

ఎగురుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి "ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదుగా ఇప్పుడెలా చెప్తావో చూద్దాం" అని ఎక్కిరించిందంట..

పెద్దమ్మకి కోపమొచ్చి "ఉండు అప్పతో నీ పేరు చెప్పి, నిన్ను తన్నిస్తాను" అన్నదంట.

అందుకు అమ్మ "నీ దగ్గర సాక్షం లేదుగా..... నాకేం భయం... చెప్పుకో.... చెప్పుకో... చెప్పు తీసి తన్నిచ్చుకో" అన్నదంట.

అందుకు మా పెద్దమ్మకి బాగ ఉక్రోషం వచ్చి తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పడం, తాతగారు కొట్టడం.... మళ్ళీ టీచరికి 5రూపాయలు ఫైను కట్టి రిపోర్ట్ కొత్తది తయారుచేయించుకోవడం మాములే లెండి....

ఇలా ఇంకా చాలా ఉన్నాయి ...... ఒక్కొక్కటిగా పోస్టు చేస్తాను.....

నచ్చనివారు దయచేసి కామెంట్ రాయొద్దని, రాసినా అది పబ్లిష్ చేయబడదని మనవి.

3 comments:

 1. బాగున్నై మీ అమ్మగారి చిన్నప్పటి కబుర్లు. మీరు రాయడంకూడా బాగా రాస్తున్నారు.

  ReplyDelete
 2. కొత్త పాళీ గారు చాలా థాంక్స్ అండీ....
  అమ్మ గురించి కదా ..... అలా వచ్చేస్తుందేమో ......
  మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.... ఇంకా కొన్ని పోస్ట్లు ఇదే టాపిక్ మీద ఉంటాయి.... చదవండి... మీకు తప్పక నచ్చుతాయి అని నా నమ్మకం...

  ReplyDelete
 3. Super. chaalaa bavundi, meeru rasina vidhanam inkaa baavundi.

  ReplyDelete