Thursday, September 1, 2011

ఆమె కథ -3


                             ఆమె కథ -2


                                                    కొడుకు పట్నం వెళ్ళిపోయాక కనీసం క్షేమంగా చేరానన్న వార్త కూడా చెవిన పడలేదు. ఒక్క ఉత్తరం ముక్కైనా అందలేదు. ఇంక ఆమె తిండీ తిప్పల గురించి కష్టపడవలసిన రోజులు మళ్ళీ వచ్చాయి. "ఈ జీవుడు ఉన్నంత కాలం మనం దేవుడిని నమ్ముకుని ఏదో ఒక కష్టం చేసుకొవలసిందే కదా !" అనుకుని ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. ఒంట్లో బాగున్నా లేకపోయినా ఒక్క రోజు కూడా మానెయ్యకూడదు కదా పనిమనిషి, ఒకవేళ మనేసినా జీతంలో కోత. ఇలా ఏదోవిధంగా నాలుగు గింజలు నొట్లో పడేంత సంపాదించుకోగలుగుతుంది.

                                              ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె పని చేయాల్సిన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటామె కనబడి "నీ కొసమే వస్తున్నా ఇక్కడికి దగ్గర్లో మా పిన్నిగారిల్లు  ఉంది. వారికి పనిమనిషి కావాలట, నువ్వు ఉన్నవు అని చెప్పా తీసుకుని రమ్మన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం పదా !" అని అంది. ఆమెకు ఇష్టమా లేదా అనేది ఇంటామెకు అనవసరం కదా!        

                                          ఆమెతో వెళ్తుంది భువనమ్మ. అది వేరే వీధి. "మళ్ళీ రోజు 2 వీధులు దాటుకొని ఇక్కడ దాకా రావాలా" అనుకుంది. ఈ వీధిలోని వారు కాస్త మంచివారుగా తోస్తున్నారు ఆమెకి. అన్నీ పరికించుకుంటూ ఆ ఇంటిలోకి వెళ్ళింది. అక్కడికంటే కాస్త తక్కువ జీతమే అయినా ఎందుకో పని చెయ్యాలనిపించింది ఆమెకు. పని ఒప్పుకుని మరుసటి రోజు నుంచి వస్తానని చెప్పి వెనక్కి వచ్చేసింది.

                                                 కొత్త ఇంట్లో పనికి రెండు రోజులు ఇబ్బంది పడ్డా మెల్లగా సర్దుకుంది. అలవాటయిన పనే కాబట్టి పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అలా రోజూ మొదట ఆ వీధిలో పని చెయ్యటం తిరిగి ఈ వీధికి వచ్చి పని చెయ్యటం, అలా కొనసాగుతుండగా ఒకరోజు ఈ వీధిలో ఇంటివారు ఊరు వెళ్తున్నామనీ మరల రేపు పనికి రమ్మనీ చెప్పారు. సరేలే అనుకుని నడుస్తూ వస్తుండగా  ఒకరింట ఒక తాత కట్టెలు కొడుతూ కనిపించాడు. అందులో ఆశ్చర్యమేమున్నదీ అంటారా! ఆ తాత పక్క వీధిలో పండ్లు అమ్మే తాత. తాతకు 90సం||లు ఉంటాయి. రోజూ గడప నిండా పండ్లు తెచ్చి వీధులన్నీ తిరిగి అమ్మేవాడు. మరి ఆయన కట్టెలు కొట్టడం ఏంటా అనుకుంది. "అయినా నా పిచ్చి కాకపొతే పండ్లు అమ్మడానికి వస్తే కట్టెలు కొట్టమన్నారేమో  నాలుగు డబ్బులు వస్తాయి కదా అని కట్టెలు కొడుతున్నాడేమో" అని అనుకుంది.

                                                    ఇలా కొనసాగుతుండగా రోజూవారి దినచర్యలో ఎక్కడో ఒకచోట తాత తారసపడేవాడు. కానీ వేరువేరు పనులు చేస్తూ "ఏమోలే ఈ తాతకి ఆశ ఎక్కువ ఉన్నట్లుంది" అని నవ్వుకుంది.

                                                     కాలం గడుస్తుంది. ఆ రోజు "కార్తీక పౌర్ణమి" పెందలాడే ఇళ్ళకెళ్ళి పనులు ముగించుకొని, గుడికెళ్ళింది. అప్పటికే పది గంటలయింది. హడావిడిగా గుళ్ళోకి వెళ్ళి 365 వత్తులు వెలిగించి, తీర్థ ప్రసాదాలు తీసుకుని, కాసేపు కూర్చుని, మెల్లగా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చింది. తీరా తను చెప్పులు పెట్టే దగ్గర చూస్తే "తాత". ఇందాక హడావిడిలో గమనించలేదు. ఎందుకో తాత గురించి తెలుసుకోవాలనిపించింది ఆమెకు. తాత పక్కనే కూర్చుని "నాన్నా! నువ్వు ఎందుకు ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నావు. అంత డబ్బు ఏమి చేసుకుంటావు. తిండి మందం సంపాదించుకోరాదా?  " అని అడిగింది. అందుకు తాత నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆమె పట్టుబట్టి తాతను పదే పదే అడగడంతో తాత నోరు విప్పాడు.

2 comments:

  1. మొత్తానికి ఇప్పటికి నీ కలం కదిలింది.....:)

    ReplyDelete
  2. అవునండీ మారుతిగారు
    ఆమె కథ కు కలం ఎప్పుడో కదిలింది ... కాకపోతే ఇక్కడ దాకా రావడానికి ఇంత టైం పట్టింది.......

    ReplyDelete