Thursday, September 8, 2011

ఆమె కథ - 4

ఆమె కథ -3

"నేను సంపాదించేది నా కోసం కాదమ్మా!"
ఒహో ఇతనిది కూడా నా లాంటి బతుకే కాకపోతే కొడుకేమైనా డబ్బుకి వేధిస్తాడేమో అనుకుంది.
"నీ కొడుకుల కోసమా నాన్నా ఈ కష్టం?" అని అడిగింది.
"కాదమ్మా అదో పెద్ద కథ. అయినా అదంతా నీకెందుకులే"  అన్నాడు తాత.
"అదేంటి నాన్న అలా అంటావ్ నేను నీ కష్టం తీర్చగలనో లేదో కాని చెప్తే వింటాను కదా, నీ గుండె బరువైనా తగ్గుతుంది" అని అర్ధించింది.
"సరేలే విను. నేను మొదట పండ్లు మాత్రమే అమ్మేవాడిని. రోజంతా అమ్మగా వచ్చిన డబ్బు వీధి చివరన కూర్చుని లెక్కపెట్టుకునే వాడిని. ఇదిలా ఉండగా ఒక రోజు వీధి చివరికి వచ్చేసరికి ఒక పసికందు ఏడుస్తూ కనబడ్డాడు.. దగ్గర్లో ఎవ్వరూ లేరు. ఒక గంట అక్కడే వేచి వున్నా, ఎవరైనా వస్తారేమో అని. కానీ ఎవరూ రాలేదు. చూస్తూ చూస్తూ పసికందును వదలబుద్ది కాలేదు. ఇంటికి తీసుకెళ్దామా అంటే ముసల్ది ఏమంటుందో అని భయం. ఎలాగైతేనేమి ఇంటికి తీసుకెళ్ళాను. ఏమనుకుందో ఏమో ముసల్ది "కన్నబిడ్డలు కాదన్నారు, వీడినైనా మన బిడ్డలా చూసుకుందామయ్యా" అంది. హమ్మయ్యా అనుకొని సంతోషించాను.
       
                          కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వీడంటే నాకు దొరికాడు కాబట్టి పెంచుతాను, ఎందరో పిల్లలు రోడ్డు మీదనే బతికేస్తున్నారు , వాళ్ళందరి సంగతేంటి? వళ్ళ కోసం నా వంతు సహాయంగా నేను ఏమైనా చెయ్యాలి అనుకున్నను. వెంటనే ఈ విషయం పిల్లాడిని పడుకోబెడుతున్న ముసల్దానికి చెప్పాను, అది కూడా సరేనంది. పొద్దున్నే లేచి నా బాల్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. ఇద్దరు మాత్రం నాతో ఏకీభవించారు. మేము నలుగురం కలిసి మా ఇంటి వెనక ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి తాటాకులతో ఒక పెద్ద గది కట్టాం. నేను, నా స్నేహితులు వీధులన్నీ వెథికి అనాధ బాలలను తీసుకువచ్చాం. మొత్తం 10 మంది అయ్యారు. ఆ రోజు నుంచి నేను మధ్యాహ్నం కల్లా పండ్లన్నీ అమ్మి, మధ్యాహ్నం నుంచి ఒక వ్యాపారి వద్ద కట్టెల పని చేస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకొని అన్నం తిని పడుకుంటాను. రాత్రి పదింటికి లేచి ఫ్యాక్టరీ లో వాచ్ మెన్ గా పని చేస్తుంటాను. ఇలా ఆదివారాలు, పండగ రోజుల్లో గుడి దగ్గర ఉంటాను. మా ముసల్ది పొద్దుట్నించి సాయంత్రం దాకా దగ్గర్లోని బడిలో ఆయాగా పని చేస్తుంది, పిల్లలకి భోజనం వండి పెడుతుంది.
                                             నా స్నేహితులలో ఒకడు పిల్లలకు పాఠాలు చెప్తాడు, మరొకడు వారి కోసం అన్ని చోట్లా తిరిగి పుస్తకాలు, బట్టలు సేకరించి తెస్తాడు." అని తన కథంతా చెప్పాడు తాత.

                                           ఇదంతా విన్న ఆమెకు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోనారంభించిది. కన్నీళ్ళు తుడుచుకోవడం కూడా మరిచి తాతను అలాగే తదేకంగా చూడసాగింది. "ఏంటమ్మా ! అలా చూస్తున్నావు" అన్న తాత మాటలతో ఈ లోకం లోకి వచ్చింది.

1 comment: