Tuesday, August 30, 2011

ఆమె కథ -2


        ఆమె కథ -1                     

                                               ఎలాగో కష్టాలుపడి అతడిని మచ్చిక చేసుకుంటూ తను కష్టపడుతూ పిల్లలనైతే చదివించగలిగింది. అమ్మాయి యుక్త వయస్సుకి రానే వచ్చింది. కొడుకు చేతికందితే కష్టాలు తీరుతాయి కదా అనుకున్న ఆమె ఆశ నిరాశే అయింది. కొడుక్కి అవేమి పట్టవు. ఎంతసేపటికి నేను, నాది నా డబ్బు, నా సుఖం , ఇన్ని రోజులూ మీ దగ్గర నేనేమి సుఖపడ్డాను అంటాడే తప్ప ఇంకేమి పట్టించుకోడు. ఒకనాడు ఆమె కొడుకుని దగ్గరకు పిలిచి "చెల్లెలికి పెళ్ళి చెయ్యాలిరా! ఆ బాధ్యత నీదే, నాకా వయసు మీద పడుతుంది, మీ నాన్న చూడబోతే రోగంతో మంచం పట్టాడు ఈ ఒక్క సహాయం చేయరా" అని అర్ద్రమైన గొంతుతో వేడుకుంది. మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానిండి "నేను పెళ్ళి చేసుకొని ఆ వచ్చిన కట్నం డబ్బులతో చెల్లి పెళ్ళి చేస్తానులే" అన్నడు. ఘనుడు. కనీసం దానికైనా ఒప్పుకున్నాడులే అని సమాధానపడి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఎలాగైతేనేం అతడు పెళ్ళి చేసుకొని, చెల్లెలి పెళ్ళి చేసి అత్తగారింటికి సాగనంపాడు.
                                                     సంవత్సరాదిన అతడి పెళ్ళి, మధ్యమాన చెల్లెలి పెళ్ళి, బాధ్యతలు తీరినవిలే అనుకుంది ఆమె. ఇంకా ఎక్కడ "కర్మానుబంధం మనుష్యరూపే" అన్నట్లుగా ఇంకెన్ని కర్మలు(పనులు) చేయాల్సినవి ఉన్నాయో ఆమెకు తెలియదు కదా! కొడుక్కి పెళ్ళి అయి సంవత్సరం దాటిందో లేదో భర్త చావు, మనవడి పుట్టుక. "ఆహా యమా! సమం చేసితివా!" పిల్లలిద్దరి సహాయంతో ఆ కర్మలేవో కానిచ్చింది. కూతురు కర్మలవగానే తన అత్తగారింటికి అదేనండీ మన పట్నానికి వెళ్ళిపోయింది. కొడుకు ఎలాగో ఇంట్లో ఉండేవాడే, కానీ కొత్తరకం చిక్కు, అతడి బావమరిది కూడా ఇక్కడే ఉంటాడట భార్యగారి ఆజ్ఞాపన, భర్తగారి సమ్మతి తోడై , ఆమె పని మరింత పెంచాయి. అర్ధం కాలేదుటండీ కొడుకు కుటుంబం, కోడలి తమ్ముడిగారి కుటుంబం, మనవడి బాధ్యత ఇవన్నీ ఆమే కదా చూసుకోవాల్సింది.

                                                  సరేలే ఏమైతేనేమి మనకంటూ మిగిలింది ఏమీ లేదు కదా! వీరినైనా సంతోషంగా చూసుకుందాం అనుకుని వారికి సేవలు చేయసాగింది. కోడి కూయక ముందే లేవాలి, లేస్తుంది ఇళ్ళంతా ఊడ్చి, వాకిలి చల్లి, ముగ్గు పెట్టి, కాఫీ పెట్టి మొదట కోడలుగారికే ఇవ్వాలి. అది ఆమెగారి ఆజ్ఞ. భర్త ముందు తనే కష్టపడుతున్నట్టు ఉండాలి కదా , అదెలాగంటారా ముందు ఆమెకే ఇవ్వాలి అంటే ఆమెనే లేపాలి కదా... చూడని వారికి ఈ పనులన్నీ ఎవరు చేసారో తెలియదు కదా... కోడలుగారి మాట దురుసుతనం ముందు ఏది ఆగుతుంది చెప్పండి..... కోడలు కాఫీ తాగిన తర్వాత ఆ రోజు చేయాల్సిన టిఫినేంటో, వంటలేంటో చెప్తారన్నమాట. ఆ ఏర్పాట్లు చేస్తూ గుక్కెడు కాఫీ అయినా నొట్లో పోసుకోవడం మర్చిపోతుంది అప్పుడప్పుడు. 9 కొట్టేసరికి బాక్సులు కట్టి టిఫిన్లు పెట్టేస్తుంది. ఎవరి దారిన వారు పోయాక అంట్లన్నీ తోమి బట్టలుతికేసరికి సూర్యుడు నడినెత్తి దాటేసుంటాడు. ఏవో రెండు ముద్దలు తిందాంలే అనుకుంటుండగా మనవడి ఏడుపు. కోడలు లేదా అని చూస్తే ఉంటుంది కానీ టి.వి . చూస్తూనో, పక్కింటామెతో తను కొన్న కొత్త చీర గురించి చెప్తూనో... పైగా "అత్తయ్యా! ఏమి వెలగబెడుతున్నారక్కడ కాస్త ఇటు వచ్చి కొంచెం బాబు చూడొచ్చు కదా! అబ్బబ్బ ఈ ముసలావిడతో ఛస్తున్నాం" అని కూడా అంటుంది. "ఇదేమి చోద్యం!" అనుకుంటున్నరా ' అదే విధి ' . మనవడిని ఎత్తుకొని పాలు పట్టించి, నిద్రపుచ్చి తను తినేసరికి పక్షులు ఒకటీ, రెండుగా అప్పుడప్పుడే ఇళ్ళకు వస్తుంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా ఇల్లు చేరుకుంటారు.

                                                వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వేడి వేడి కాఫీ అందివ్వాలి. ఎవరూ సహాయం కూడా చేయరు. తనే అన్నీ చెసుకోవాలి.అదంతే. కాస్తో కూస్తో ఆ బావమరిదిగారి భార్య మంచిదనే చెప్పవచ్చు ఆమెను ఏమీ అనదు కాబట్టి. ఇలా ఆమె దినచర్య రాత్రి భోజనాలు, మంచాలు పరిచి పక్కబట్టలు వేయటం దాకా కొనసాగుతుంది. ఇలా, అలా, ఎలాగైతేనేమి ఆమె జీవితం సాగుతుంది. కాలం గడుస్తూ ఉంటే మనవడు, మనవరాలుతో పాటు కూతురికి ఒక కొడుకు పుట్టాడు. వారిలో తన బాల్యాన్ని చూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది.

                                  ఇంతలో ఒకరోజు కొడుకు బావమరిదిగారు వచ్చి "బావా! నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. నేనూ, నా కుటుంబంతో సహా వెళ్ళదలిచాను" అన్నాడు. "హమ్మయ్యా! ఒక బాధ్యత తప్పిందిలే ఆమెకు" అనుకుంటున్నారా.... ఇంకా చదవండి "నాకు ఉద్యోగం వచ్చిన ఫ్యాక్టరీలోనే నీకు కూడా ఒక చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తాను, కాకపోతే ఒక 2లక్షలు ఖర్చు అవుతుంది. నీ ఉద్యోగం వచ్చేవరకు నువ్వు నా దగ్గరే ఉండవచ్చు. ఇన్ని రోజులూ నువ్వు నన్ను చూసుకోలేదా ఏమి?" అని ఇంకా అతను సమాధానం చెప్పకముందే "ఏమంటావే అక్కా! నువ్వైనా చెప్పు బావకి" అని సైగ చేసాడు. ఇదే అదనుగా "అవునండీ పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, మన కష్టాలు తీరిపోవాలన్నా ఇదే మంచి అవకాశం. మీరు కాదనకూడదు .... లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంతే" అంది.

                                    దానికతడు కాసేపు ఆలొచించి ..... "అది కాదే 2లక్షలంటే మాటలా ఇప్పటికిప్పుడు ఎక్కడనుంచి వస్తాయే " అన్నాడు. దానికామె "ఓస్! అదా మీ దిగులు. లంకంత కొంప మనమెవరూ లేకపోతే ఏం చేసుకోవడానికి...? దీనిని అమ్మితే పోలా!" అంది. అందుకతడు "ఆ! ఇంటిని అమ్మెయ్యాలా....? మరి అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆమెను చూసేవారు ఎవరు?" అని అడిగాడు. దానికి బావమరిదిగారి భార్య "అన్నయ్యగారూ! మీరు మరీ అంత బాధపడాలా మా పుట్టింటికి దగ్గరలో ఒక చిన్న గది ఉంది. ఇరవై వేలంట, అమ్ముతున్నారని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు చెప్పింది. ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో అది ఎంతో కాదు కదా! మనకని చెప్తే కొంత తగ్గిస్తారు కూడా... అంతేనా.. ఏమంటావ్ వదినా" అంది.

                                    ఇదీ ఆమెగారి మంచితనం.

                                    "ఇంకేంటండీ ఆలోచిస్తున్నారు. త్వరగా ఇల్లు అమ్మకం పెట్టంది లేకపోతే నేను మా...."
                                     "సరె సర్లేవే అలాగే కానిద్దాం"

                                      ఆమె గుండె ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకురా దేవుడా నన్ను తీసుకెళ్ళలేదు అని గట్టిగా అరవాలనుంది. కానీ, ఏనాడు నోరెత్తి గట్టిగా మాట్లాడనైనా లేదామె. ఇంక ఏమనగలుగుతుంది. చూసారా కాలం ఎంత బలీయమైనదో, విధి ఆడిన వింత నాటకానికి ఆమె మరొకసారి బలయ్యింది. "ఏమిటో కదా ఈ లోకం...."

   ఆ విధంగా ఆమె ఆ మారుమూల పల్లెలోని ఒక చిన్న గదికి చేరింది. ఇప్పుడు ఆమెకు 50సం||లు.


No comments:

Post a Comment