Tuesday, August 20, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 2


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 2


ప్రయాగలో స్నానాలు చేసాక గంగ నుంచే మట్టి తెచ్చి ఒక సైకతలింగాన్ని తయారు చేసి , పిండి దీపము వెలిగించి, పాలు, జామపండు నైవెద్యముగా పెట్టి, గంగామాతకు బట్టలు, కాటుక,గాజులు,అద్దము,దువ్వెన,నల్లపూసలు,పుస్తెలు, మెట్టెలు సమర్పించి లింగాన్ని తిరిగి గంగలో కలిపేసారు...

స్నానము, పూజ ముగించుకుని ఇక అక్కడ ఉండటం సాధ్యపడదని తెలుసుకుని కాశీకి వెళ్దామనుకొని అక్కడ నుంచి బయల్దేరారు అమ్మావాళ్ళు...


భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటాన ఆటోలు, రిక్షాల రాకపోకలు త్రివేణీ సంగమానికి 7కి.మీ. ముందే ఆపేసారు. నడక తప్పనిసరి కావడంతో నడుచుకుంటూ మూడు గంటల్లో బస్టాండు చేరుకున్నారు... 
  
కానీ అత్తయ్యకేమో ఎలాగైనా నాగాసాకీలని ( వీరినే నాగా బాబాలనీ, నంగా బాబాలని కూడా పిలుస్తారట ) చూడాలని కోరిక...

నాగాసాకీలు అంటే దిగంబరులై, వంటి నిండా బూడిద పూసుకుని, జటాజూటధారులై ఎళ్ళప్పుడూ అగ్ని కార్యాలు చేసుకుంటూ తమదైన లోకములో ఉంటారు...


వీరి గురించి మరి కొంత ఇక్కడ చదవచ్చు - ఇది ఇంగ్లీషులో ఉంది 

ఇంత దూరం వచ్చాము, ఒక్కసారి వారిని కూడా చూసి వెళ్ళిపోదామని అత్తయ్య అమ్మని అడిగారు...
సరే అని ఆ లగేజీ అంతా మొయ్యలేక సుజాత ఆంటీని అక్కడే ఉండమని వారు నాగాసాకీలు ఉండే సెక్టర్ వెతకడం మొదలుపెట్టారు...

ఇక్కడ సెక్టర్ల  గురించి ఒక విషయం చెప్పాలి...

ప్రభుత్వం వారు ప్రయాగ అంతటినీ సెక్టర్లుగా విభజించి ప్రతి రాష్ట్రానికి ఒక సెక్టరు, దేవస్థానాలకి సెక్టర్లు ( ఉదా: టి.టి.డి సెక్టరు...) , మఠాలకు సెక్టర్లు (ఉదా: జియర్ మఠం సెక్టరు, శంకర మఠం సెక్టరు) నాగాసాకీలకు ఒక సెక్టరు ఇలా ఎర్పాటు చేసారు...

పోలీసులను, భక్తులను అడుగుతూ ఎట్టకేలకు నాగాసాకీల సెక్టారు చేరుకున్నారు...

అక్కడ డేరాలు కట్టి టెంటులు వేసి ఉన్నాయి... ఒక్క నాగాసాకీలవే 500 పై చిలుకు  టెంట్లు ఉన్నాయి...
ప్రతీ టెంటులో నాగాసాకీలు అటూ ఇటూ వరుసగా కూర్చుని హోమయజ్ఞాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు....

భక్తుల దర్శనార్థం మధ్య నడిచే స్థలం విడిచిపెట్టారు...
అమ్మ, అత్తయ్య ఒక టెంటులోకి వెళ్ళి నాగాసాకీలను దర్శించుకున్నారు... వారు జటాజూటాలతో దిగంబరులయి గురువులను స్మరిస్తూ అగ్ని కార్యాలు చేసుకుంటున్నారు....

అక్కడే ఉన్న ఒక స్వామివారు వీరిద్దరిని పిలిచి "ఎవరు మీరు… ఎక్కడ నుంచి వచ్చారు… మీకేమి కావాలి ? " అని అడిగారు

అమ్మావాళ్ళు వివరాలు చెప్పాక కొన్ని స్వంత విషయాలు అడిగితే వారిని ఉద్దేశించి "నువ్వు దేనికోసం వచ్చావు ఈ భూమ్మీదకి...? ప్రాపంచిక విషయాల మీద వ్యామొహం ఎందుకు? నీకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు... ఇంకా ఎందుకు ఈ కోరికలు.... దేని కోసం నువ్వు ఇంకా ప్రాకులాడుతున్నావు?..... దేవుడిని స్మరించుకుంటూ కాలం గడుపు  " అని అన్నారు.   

అందుకు వారు తమ తప్పు తెలుసుకుని ఇక నుంచి కోరికలను వదులుకొని దైవ చింతనలో కాలం గడుపుతామని విన్నవించుకున్నారు...
ఆ స్వామి వీరికి రుద్రాక్ష మరియు విభూది ఇచ్చారు.... ఆయనే "శివశక్తి బాబా"
(వీరి సంభాషణ అంతా హిందీలోనే జరిగింది)


మొత్తానికి అత్తయ్య కోరిక మేరకు నాగాసాకీలను దర్శించుకున్నారు... 

కానీ ఎక్కడా ఉండటానికి ఇంత చోటు కూడా లేదు.... ఎప్పుడో పొద్దున్న తిన్న రెండు పూరీలు ఏమి అక్కరకు వస్తాయి చెప్పండి ?.... అంత దూరం నడిచి నడిచి ఉన్నారేమో బాగా ఆకలి మొదలైంది. నాగాసాకీలకు సహాయ సహకారాలు అందించేవారు (ఇప్పటి భాషలో స్పాన్సర్లు అనాలేమో..!) వచ్చేపొయే భక్తులకు టీ, కాఫీలు అందిస్తున్నారు... వీరికి అది కాస్త ఉపశమనం అయ్యింది ..


తిరిగి బస్టాండుకి వెళ్ళిపోయి సుజాత ఆంటీని కలిసి ఏదైన తిని కాశీకి వెళ్ళిపోదామని అనుకున్నారు..
ఇంతలో అక్కడే ఉన్న మరొక బాబా పిలిచి వీరి వివరాలు అడిగారు....

వివరాలు చెప్పి వీరి ప్రస్తుత పరిస్థితి వివరించారు.... ఆడవాళ్ళు... ఆకలితో ఉన్నారు... ఎక్కడా ఉండటానికి ఇంత చోటు కూడా లేదు అని తెలుసుకుని వారిని అక్కడే ఉండమని బాబా తమ గురువుగారి దగ్గరకు వెళ్ళారు...గురువుగారి అనుమతితో వీరికి భోజనం పెట్టించారు.... సుజాత ఆంటీ గురించి కూడా చెప్తే తనకోసం భోజనం పొట్లం కట్టించి ఇచ్చారు. అంతేకాకుండా, వీరితో పాటే బస్టాండు వరకు వచ్చి ఆంటీ తినేదాకా ఉండి , ముగ్గురిని తీసుకుని వారి టెంటుకు తిరిగి వచ్చారు....


ఇంతకీ ఆ బాబా మరెవరో కాదండీ మన భద్రాచల రాముడే.... పేరు "రాంనరేష్ గిరి" 

అలా తినడానికి తిండి, ఉండటానికి బస దొరకని వారికి ఆ భద్రాచల రాముడే తోడుండి వారిని ఒక గూటికి చేర్చాడు.... 

1 comment:

  1. Raamula varu mee venta vennente vunnarannamaata. Aayana meeda baram vesinanduku kapadutu vachadu.

    ReplyDelete