Tuesday, September 3, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 4


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 4

అత్తయ్య  చేసిన ప్రార్థనతో  వరుణుడు శాంతించాడు కానీ చలి తగ్గలేదు....

భక్తులందరూ చలికి వణికిపోతుంటే రాంనరేష్ గిరి బాబా గారు అక్కడ ఉన్నవారందరికీ కంబళ్ళు ఏర్పాటు చేసారు. గుడారాన్ని వెచ్చగా ఉంచేందుకు  బొగ్గుపై చక్కర వేసి నిప్పు పుట్టించారు...
(ఇది సైన్స్ పరంగా ఎలా సాధ్యమని ఆలోచించేవారికి నా దగ్గర సమాధానం లేదు)

అమ్మావాళ్ళు  రోజూలాగే ఆ రోజు కూడా గంగా స్నానానికి బయలుదేరుతుండగా పక్క టెంటులో ఉండే జానకీమాయి వచ్చారు. వీరు చాలా దూరం నడిచి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారని తెలుసుకుని తనకు తెలిసిన దగ్గర మార్గం (షాట్ కట్ అనాలేమో) చూపిస్తానని తీసుకెళ్లి చూపించారు. 

గంగాదాకా వెళ్ళారు. తీరా అక్కడిదాకా వెళ్ళిచూస్తే కిక్కిరిసిన భక్తజనం....కాలుతీసి కాలుపెట్టే సందు లేదు..... అల్లంత దూరాన గంగ కనపడుతుంది కానీ గంగ ఒడ్డు నుంచి వీరున్న చోటు వరకు అంతా జనంతో నిండిపోయింది....

ఎలారా దేవుడా అని ఆలోచిస్తుండగా మా సరస్వతి అత్తయ్య హనుమంతుడిని "నాయనా హనుమా...! ఎక్కడున్నావయ్యా...? ఆనాడు సీతమ్మ వారికోసం నూరు యోజనాల లంకను దాటావు... ఈరోజు పది యోజనాలలో ఉన్న గంగ దగ్గరకు మమ్మల్ని ఎలాగైనా చేర్చవయ్యా..." అంటూ ప్రార్థించారు.

ప్రార్థించి ఒక పక్కగా చూస్తే ఏదో చిన్న మార్గం కనపడింది.... అది ఒకరికంటే ఎక్కువమంది పట్టని అతి చిన్న మార్గం.... ముగ్గురూ ఆ మార్గంలోగుండా వెళ్ళి చూస్తే మీరు నమ్మరండీ.... ఎదురుగా గంగ.... అసలు వాళ్ళు ఊహించనేలేదు అంత త్వరగా గంగ దగ్గరకు చేరుకోగలరని.... ఇక గంగలో స్నానం చేసి తిరిగి వచ్చారు... వారు మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ మార్గం ఎక్కడా కనపడలేదు.... ఇది నిజంగా దేవుడి లీల కాదంటారా....
స్నానం చేసి గుడారానికి తిరిగి వచ్చాక  సత్సంగము, భజనా కార్యక్రమాలు జరిగాయి. తరువాత బాబాగారి దగ్గరకు ఒక విదేశీ యువకుడు, ఒక జపానీ వనిత దీక్ష తీసుకోవడానికి  వచ్చారు. బాబాగారు వారికి దీక్షా నియమాలు చెప్పారు. యువకుడు ఒప్పుకున్నారు కానీ జపానీ వనిత మటుకు వచ్చే సంవత్సరం తీసుకుంటానన్నారు.  బాబాగారు యువకుడికి ముండనం చేయించి ఏకవస్త్రధారుడిని చేసి అయిదు ఇళ్ళలో (గుడారాలలో) భిక్ష ఎత్తించి "శ్రీహరి" గా పేరు మార్చి దీక్ష ఇచ్చారు. 

మరునాడు మౌనీ అమావాస్య స్నానం చేసి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని రాంనరేష్ గిరి బాబా దగ్గరకు వెళ్ళారు. బాబా గారిని అనుమతి అడిగి అక్కడున్న బాబాలందరికీ వీరికి తోచిన ద్రవ్యము దక్షిణగా ఇచ్చి ప్రయాణము గురించి చెప్పారు. రాంనరేష్ గిరి బాబా గారు ఇంకొక్క రోజు ఉండివెళ్ళమని చెప్పారు. కానీ, ఇంటినుంచి బయల్దేరిన తొమ్మిదవ రోజు ఇల్లు చేరకూడదనే నమ్మకం ఉండటాన వారు వెళ్దామనే నిర్ణయించుకుని బాబాగారి వద్ద సెలవు తీసుకున్నారు. బాబాగారు వారిని ఆశీర్వదించి ఒక రుద్రాక్ష, ముత్యము ఇచ్చారు.(బాబాగారు అమ్మను ఆశీర్వదిస్తున్న ఫోటో - అదే ఫోటోలో శ్రీహరిగారిని(ఎర్ర దుస్తులు) చూడవచ్చు)


బాబాగారి దగ్గర ఆశీర్వాదము రుద్రాక్ష, ముత్యము తీసుకుని మౌనీ అమావాస్య రోజు స్నానం చేసి తిరుగు ప్రయాణమయ్యారు. మౌనీ అమావాస్య కావటాన కిక్కిరిసిన భక్తజనంతో రోడ్లన్నీ నిండిపోయాయి... (ఆ ఒక్క రోజే 30 మిలియన్ల భక్తులు స్నానం చేసారని ప్రభుత్వం వారి అంచనా). రైల్వే స్టేషనుకు కూడా నడిచే వెళ్ళాలి.

ఇక తప్పదనుకుని నడక ప్రారంభించారు ఒకటా, రెండా 7 కిలోమీటర్లు.... మొదటి 3 కిలోమీటర్లు ఎలాగోలా నడిచారు. పెద్దవారు కదా అంత దూరం నడక అలవాటు లేక ఆయాసం........ ఉన్నవి మూడే బ్యాగులైనా అంత దూరం మోసుకుంటూ వెళ్ళటాన చాలా బరువైపోయి మొయ్యలేని పరిస్థితి వచ్చింది.  ఇక వారివల్లకాక బ్యాగులోంచి ఒక్కో బట్టతీసి పడేసుకుంటూ నడుస్తున్నారు. అయినప్పటికీ ఓపీక లేక నడవలేని స్థితికి వచ్చి మా సరస్వతి అత్తయ్య  లక్ష్మణుడిని "నాయనా లక్షణా...! ముసలివారం.... నడవలేకపోతున్నాము...అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగా ఉంది... చాలా దూరం నడవాల్సి ఉంది ..... ఎలాగైనా మమ్మల్ని స్టేషనుకు చేర్చు నాయనా...!" అంటూ ప్రార్థించారు. 

ప్రార్థించిన కాసేపటికే  గుండెజబ్బున్న వృద్ధుడిని దింపటానికి ఒక రిక్షా వచ్చింది. అతడిని దింపి ఖాళీగా వెళ్తున్న రిక్షాను ఆపి స్టేషను దాకా తీసుకెళ్ళమని అడిగారు. 150రూపాయలకే  రిక్షా అతను వారిని స్టేషను దగ్గర క్షేమంగా దించి వెళ్లారు.(నిజానికి వారున్న పరిస్థితికి 2000 ఇచ్చైనా రావటానికి వారు సిద్ధంగా ఉన్నారు).

స్టేషనుకి వచ్చి ఖమ్మంకు టికెట్లు తీసుకుని అలా ప్లాట్ఫార్మ్ దాటారో లేదో వారి వెనకే బ్రిడ్జి కూలింది..... బహుశా రాంనరేష్ గిరి బాబాగారు వీరిని ఒక రోజు ఉండి వెళ్ళమని చెప్పింది ఇందుకేనేమో.... తృటిలో తప్పిన ప్రమాదం నుంచి తేరుకునేలోపే గుట్టలుగా శవాలు పడిపోయాయి.... ఏమి జరుగుతుందో.... ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.... ఆ దుర్ఘటనతో రెండు రోజులు రైళ్ళ రాకపోకలు ఆగిపోయాయి....                                          (రైల్వే స్టేషనులో ప్లాట్ఫార్మ్ కూలిన తరువాతి దృశ్యం - గూగుల్ ఫోటో )

No comments:

Post a Comment