Friday, September 13, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 5 (ఆఖరు భాగం)


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 5

రైల్వే ప్లాట్ఫార్మ్ కూలిన దుర్ఘటనతో  ఆగిన రైళ్ళ రాకపోకలు రెండు రోజుల తర్వాత తిరిగి కొనసాగింపబడ్డాయి.....

అమ్మా వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చింది ..... రెండు రోజుల తర్వాత వచ్చిన మొదటి రైలేమో.... మొదలైన స్టేషనులోనే నిండిపోయి, వీళ్ళ స్టేషనుకి వచ్చేసరికి   కిక్కిరిసి ఉంది.... ఎక్కడా ఇంత చోటు కూడా లేకపోవడంతో తప్పక వికలాంగుల బోగీలో ఎక్కారు.... అప్పటికే ఆ బోగీ నిండి ఉన్నా వీరికి కూర్చోడానికి మటుకు వీలైంది.

రైలు ప్రయాణీకులతో నిండిపోయి.... గమ్యానికి చేరడానికి సిద్ధమయ్యి.... అల్లహాబాద్ స్టేషను నుంచి బయలుదేరింది. ప్రయాణీకులు ఒకరి మీద ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అలా స్టేషన్లను దాటుకుంటూ కొందరిని గమ్యాలకు చేరుస్తూ మరికొందరిని తనలో నింపుకుంటూ సాగిపోతుంది రైలు.... ఇలా ఒక స్టేషనులో రైలు ఆగింది... ఆ స్టేషనులో ఒక కళ్ళు లేని పెద్దాయన ఎక్కారు...  రైలు కదిలింది.... వారు మెల్లగా నడుస్తూ అమ్మావాళ్ళు కూర్చున్న చోటుకి  వచ్చి కూర్చున్నారు..... కాసేపటికి వారిని గమనించిన మా సరస్వతి అత్తయ్య లేచి వారి వద్దకు వెళ్ళి " మీరు వచ్చి ఈ సీటులో కూర్చోండి ..... ఇక్కడనుంచి లేవండీ.... ఇది మీ బోగీ... మీకు కేటాయించిన సీటు.... మీరే కూర్చోవాలి...." అంటూ వారిని ఆ సీటులో కూర్చోబెట్టారు.

వారు అత్తయ్యను చల్లగా ఉండమని దీవించి ఆ సీటులో కూర్చున్నారు.... అమ్మ,ఆంటీ, అత్తయ్య సర్దుకుని కూర్చున్నారు...

చిత్రం చూడండి..... ఆ వచ్చిన తరువాతి స్టేషనులో పోలీసులు ఎక్కి కర్రలతో చప్పుడు చేస్తూ "వికలాంగులు కానివారు వికలాంగులకి సీటు ఇవ్వాలి..... అవసరమైతే దిగిపోవాలి " అని హెచ్చరించి వెళ్ళారు.

కానీ ఆ పని సరస్వతి అత్తయ్య ముందే చేయడంతో అక్కడి ప్రయాణీకులు అందరూ అత్తయ్యను మెచ్చుకోలుగా/అభినందిస్తునట్టుగా చూసారు.... చేసేది చిన్న పనే అయినా నిండు మనసుతో చేస్తే అందరూ హర్షిస్తారు..... (ఇక్కడ అది వారి చోటే కదా వారికి ఇచ్చినంత మాత్రాన గొప్ప పనా.....! అని మీకు అనిపించవచ్చు .... కానీ అక్కడ కూర్చున్న ఎంతమందికి ఆ ఆలోచన వచ్చింది చెప్పండి )

నాగాసాకీలు (నాగా బాబాలు) చేసిన అద్భుతాలు, అంగ/కర విన్యాసాలు , వీరు చూసిన అద్భుతాలు తలుచుకుంటూ , చర్చించుకుంటూ ప్రయాణం కొనసాగించారు... 

రాంనరేష్ గిరి బాబాగారి  గురువు గారు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ , ధ్యానం చేసుకుంటూనే నిప్పుల్లోకి దూకి అదృశ్యమయ్యేవారు ..... వారు తిరిగి సాయంత్రం కల్లా తిరిగి వచ్చేవారు.... 

నాగాసాకీ బాబాలు తమ చుట్టూ పిడకలు పేర్చుకుని అంటించుకుని మధ్యలో వారు కూర్చుని ధ్యానం చేస్తూ చేస్తూ అదృశ్యమయ్యేవారు.... 

ఇలాంటి ఎన్నో అద్భుతాలు అమ్మ, సరస్వతి అత్తయ్య, సుజాత ఆంటీ చూసారు.

ఈ అద్భుతాలను నమ్మేవారు ఎందరుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం వీటిని తప్పక నమ్ముతాను.....

మనది రాముడు ఏలిన రాజ్యం....రామరాజ్యం ..... భరతుడు పాలించిన భరతభూమి.... మన ధర్మం సనాతమ ధర్మం.... ఇటువంటి ఎన్నో అద్భుతాలు అడుగడుగునా ఉన్న దేశం మన భారతదేశం..... నేను ఈ దేశంలో పుట్టినందుకు ఏంతో గర్విస్తున్నాను....
(ఇవన్నీ నిజంగా జరిగాయా...?... నమ్మాలా...? అనుకునేవారికి చెప్పేది కానీ...., నిరూపించి చూపగలిగేది కానీ ఏమీ లేదు - మన పుణ్యభూమిలో పుట్టి.... మన శక్తి మనమే తెలుసుకోలేని స్థితిలో ఉన్నామే అని బాధపడటం తప్ప...)

అమ్మ, సుజాత ఆంటీ డోర్నకల్ స్టేషనులో దిగి కొత్తగూడెం వెళ్ళారు... సరస్వతి అత్తయ్య అదే రైలులో ఖమ్మం చేరుకున్నారు........ అలా వారి ప్రయాణం ఆసక్తికరంగా , అడుగడుగునా అద్భుతాలతో, దేవుడి అండతో సాఫీగా సాగింది.....

వారి ప్రయాణాన్ని అంత సజావుగా.... ఆటంకాలను పక్కకు తోసి.... తానే వెన్నంటి ఉండి , సందర్భానుసారంగా తన పరివారాన్ని పంపి ఆదుకున్న ఆ ఆర్తజన రక్షకుడైన సీతారాముడిని మరవకుండా..... ఆ వారంలోనే వీరంతా కాలిసి భద్రాచలం వెళ్ళి వైకుంఠ రాముడిని, సీతమ్మవారిని , వారి పరివారాన్ని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుని తిరిగివచ్చారు.


మనమందరం కూడా ఆ భద్రాద్రిరాముడిని మనస్సులో ఒక్కసారి స్మరించుకుందాం

సర్వేజనా సుజనోభవంతు:
సర్వేసుజనా సుఖినోభవంతు:

2 comments:

  1. మొత్తం‌ ఐదు భాగాలూ చదివాను. చక్కగా వ్రాసారు.

    ReplyDelete
  2. సంకల్పమును బట్టి సహాయసహకారాలు అందుతుంటాయి మరి... మీ విశ్లేషణాత్మక వివరణ, చెప్పిన (రాసిన) విధానం చాలా చక్కగా ఉన్నది. చివరి భాగము చదవగానే మొదటి భాగము వరకు చదవాలనిపించింది.

    ReplyDelete