Sunday, February 21, 2016

బుడతడి కథలు - బుడతడు చెయ్యని తప్పు

బుడతడి కథలు

బుడతడు చెయ్యని తప్పు


అనగనగా ఒక ఊర్లో ఒక బుడతడు ఉండేవాడు. వాడు వట్టి వాగుడుకాయ మరియు ప్రశ్నలపుట్ట...

వాగుడుకాయ అంటే ఏదిపడితే అది మాట్లడేరకం కాదు....
వాడిని వాడు రక్షించించుకోవడానికి ఏదైనా క్షణం లో సృష్టించి చెప్పగల ఘనుడు.

ప్రశ్నలపుట్ట అంటే వాడికి ఏదైనా తెలియకపొతే అది తెలుసుకునే దాకా నిద్రపోడు... అంతవరకే ఐతే బాదే లేదు.. కానీ దాని గురించి చెప్పే దాకా ఎదుటివారిని నిద్రపోనివ్వడు....

ఇక వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ చిట్టి పొట్టి కథలన్నీ చదవాల్సిందే మరి...


బుడతడికి బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క ఉన్నారు.
వాడు పుట్టినప్పటి నుంచే వస పోయకుండానే  ఊ .. ఊ అంటూ తెగ ఊసులు చెప్తూ ఉండేవాడని వాళ్ళ అమ్మ ఎప్పుడూ చెప్పుకొని మురిసిపోతూ ఉండేది.
కాకపొతే ప్రశ్నలపుట్ట కదా పుట్టినప్పటినుంచే ఎవరైనా చూడటానికి వస్తే బొటనువేలు ఎత్తి (ఏంటీ, ఏందుకు అన్నట్లుగా) వచ్చినవారు సమాధానం చెప్పే దాకా వదిలేవాడు కాదంట.

ఇక వాడి దగ్గరికి వస్తున్నారంటే ఏదో ఒక విషయం గుర్తు పెట్టుకొని రావల్సిందే అన్నమట.

ఇదిలా ఉండగా వాడు కాస్త పెద్దయ్యి నడక నేర్చాడు, అన్నో , ఇన్నో మాటలు కూడా మాట్లడేస్తున్నాడు.

వాల్ల బామ్మ వాడికి శతకాలు నేర్పిద్దామని సుమతీ శతకంతో మొదలుపెట్టింది.
చిన్నవాడు కదా రోజుకి పద్యంలోని ఒకటి, రెండు మాటలు నేర్చుకుంటే చాలు అని రోజుకి ఒక రెండు మాటలు మాత్రమే చెప్పేది.

బాగుందిలే చిన్నవాడు నేర్చుకుంటాడనుకుంటే తప్పే మరి..... ఎందుకో ముందు ముందు మీరే చదువుతారుగా...

ఒక రోజు వాడు నాన్న దాచుకున్న విలువైన వస్తువు పగలగొట్టాడు. (పాపం కావాలని కాదు లెండి) ఇక అంతే నాన్నగారు కోప్పడతారేమో అని భయంతో
ఉరుక్కుంటూ వచ్చి అటూ ఇటూ దాక్కోవడం మొదలెట్టాడు కాసేపు అమ్మ కొంగు వెనక, కాసేపు నాన్న రాసుకునే బల్ల కింద, ఇంకాసేపు తాతయ్య పడక కుర్చీ వెనక , బామ్మ నులక మంచం కిందా ఇలా...ఎవరడిగినా ఏంటనేది చెప్పడే ఇంతలో నాన్నగారు ఆ వస్తువు పగిలిన విషయం గమనించారు...
బుడతడి అక్కను పిలిచి నువ్వుగానీ చేసావామ్మా అని అడిగారు (పెద్దలైతే చెప్పెస్తారు కదా) అందుకు అక్క "లేదు నాన్నా నేను ఇటువైపుగా రానే లేదు" అని చెప్పింది.

ఇక వీడికి భయం పట్టుకుంది, ఇక నన్నే పిలుస్తారు అని ఎలాగా దేవుడా అని ఇంతలో నాన్న నుంచి పిలుపు రానే వచ్చింది... అందరికీ ఏమీ అర్ధంకాక ఏమైందని విషయం కనుక్కున్నారు.

అమ్మ పిలవడం మొదలెట్టింది, బుడతడికి కొంచం ధైర్యం వచ్చింది.
అమ్మకు చెప్తే ఎలగో అలా నాకు తిట్లు తప్పిస్తుందిలే అనుకున్నాడు.
మెల్లగా బామ్మ మంచం కిందనుంచి బయటికి వచ్చి అమ్మ దగ్గరికి పరుగు తీసాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఆస్థాన పండితుల సమావేశం లాగ ఇంటిల్లిపాది అక్కడే ఉన్నారు.

పాపం ఇప్పుడు తప్పించుకోనూలేడు.

అమ్మ దగ్గరకి పిలిచింది. "అరే బుడతాయ్! ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే నిజాయితీగా ఒప్పేసుకుంటే శిక్ష తప్పుతుంది కదరా మరెందుకు అలా దాక్కుంటున్నవ్" అని అడిగింది.

వాడు ఇక వాడి వాదన మొదలెట్టాదు "నేను అది కావాలని విరగ్గొట్టలేదు కాబట్టి నన్ను ఏమీ అనకూడదు కదా.......
కానీ నాన్నగారికి కోపం వస్తే ఏమీ అలోచించరని బామ్మ మొన్న నీతో అంది కదా...................!
అది గుర్తొచ్చి ఎక్కడ నాన్నగారు నన్ను ముందు తిట్టేస్తారో అని భయపడి పరిగెత్తాను" అన్నాడు.

దానికి ఆశ్చర్యపోవడం వారిద్దరి వంతయ్యింది..
ఇక బామ్మ అందుకుని "ఆరి భడవా.... నీకెన్ని తెలివితేటలు రా.....మేము అన్న మాట అటుంచి నువ్వు కావాలని చేయకపొయినా నీ చేతిలోనే అది పగిలింది కదా అందుకు తప్పు నీదే కదా మరి అలా పరిగెత్తడం తప్పు కదా" అంది..

అప్పుడు వాడికి ఏదో గుర్తొచ్చినట్టు చిటిక వేసి "అయినా సరే నేను చేసింది తప్పు కాదు అన్నాడు"

దానికి ఇక తాతయ్యకు విసుగొచ్చి "నువ్వు అక్కడే ఉండి నాన్నకు విషయం చెప్తే నాన్న నిన్ను తిట్టరు కదా, కానీ నువ్వలా చేయలేదు కాబట్టీ నువ్వు చేసింది తప్పేరా బుడతా" అన్నారు.

అందుకు బుడత "లేదు తాతయ్యా! లేదు, నేను తప్పు చేయలేదు, అక్కడి నుంచి పరిగెత్తడం తప్పు కాదు" అన్నాడు.


అందుకు నాన్నగారు "పెద్దాచిన్నా ఉండక్కర్లేదు రా! తప్పు చేసి పైగా చేయలేదని తాతయ్యకే ఎదురు చెప్తావా" అని గద్దించేసరికి

బిక్కమొఖం వేసుకొని " మరి బామ్మే కదా 'తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతీ' అని రోజంతా చెప్పింది" అందుకని బాగా అలోచించి తప్పించుకున్నాను  నా తప్పేంటి" అని రాగమందుకున్నాడు.

అందుకు వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

వాడేమో ఉడుకుమోత్తనం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఇలా వాడు ఎప్పుడూ తప్పు చేయడు, చేసినా ఒప్పుకోడు.
చూసారుగా ప్రతి ప్రశ్న కి ఏదో ఒక సమాధానం ఎలా టకటకా చెప్పేసాడో

అదండీ మన బుడతడు చెయ్యని తప్పు.

మరిన్ని కబుర్లకోసం వేచియుండండి...

2 comments:

  1. చాలా బాగుందండి

    ReplyDelete
  2. Hey there yoursmaddy information or the article which u had posted was simply superb and to say one thing that this was one of the best information which I had seen so far, thanks for the information #BGLAMHAIRSTUDIO

    ReplyDelete