Friday, September 13, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 5 (ఆఖరు భాగం)


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 5

రైల్వే ప్లాట్ఫార్మ్ కూలిన దుర్ఘటనతో  ఆగిన రైళ్ళ రాకపోకలు రెండు రోజుల తర్వాత తిరిగి కొనసాగింపబడ్డాయి.....

అమ్మా వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చింది ..... రెండు రోజుల తర్వాత వచ్చిన మొదటి రైలేమో.... మొదలైన స్టేషనులోనే నిండిపోయి, వీళ్ళ స్టేషనుకి వచ్చేసరికి   కిక్కిరిసి ఉంది.... ఎక్కడా ఇంత చోటు కూడా లేకపోవడంతో తప్పక వికలాంగుల బోగీలో ఎక్కారు.... అప్పటికే ఆ బోగీ నిండి ఉన్నా వీరికి కూర్చోడానికి మటుకు వీలైంది.

రైలు ప్రయాణీకులతో నిండిపోయి.... గమ్యానికి చేరడానికి సిద్ధమయ్యి.... అల్లహాబాద్ స్టేషను నుంచి బయలుదేరింది. ప్రయాణీకులు ఒకరి మీద ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అలా స్టేషన్లను దాటుకుంటూ కొందరిని గమ్యాలకు చేరుస్తూ మరికొందరిని తనలో నింపుకుంటూ సాగిపోతుంది రైలు.... ఇలా ఒక స్టేషనులో రైలు ఆగింది... ఆ స్టేషనులో ఒక కళ్ళు లేని పెద్దాయన ఎక్కారు...  రైలు కదిలింది.... వారు మెల్లగా నడుస్తూ అమ్మావాళ్ళు కూర్చున్న చోటుకి  వచ్చి కూర్చున్నారు..... కాసేపటికి వారిని గమనించిన మా సరస్వతి అత్తయ్య లేచి వారి వద్దకు వెళ్ళి " మీరు వచ్చి ఈ సీటులో కూర్చోండి ..... ఇక్కడనుంచి లేవండీ.... ఇది మీ బోగీ... మీకు కేటాయించిన సీటు.... మీరే కూర్చోవాలి...." అంటూ వారిని ఆ సీటులో కూర్చోబెట్టారు.

వారు అత్తయ్యను చల్లగా ఉండమని దీవించి ఆ సీటులో కూర్చున్నారు.... అమ్మ,ఆంటీ, అత్తయ్య సర్దుకుని కూర్చున్నారు...

చిత్రం చూడండి..... ఆ వచ్చిన తరువాతి స్టేషనులో పోలీసులు ఎక్కి కర్రలతో చప్పుడు చేస్తూ "వికలాంగులు కానివారు వికలాంగులకి సీటు ఇవ్వాలి..... అవసరమైతే దిగిపోవాలి " అని హెచ్చరించి వెళ్ళారు.

కానీ ఆ పని సరస్వతి అత్తయ్య ముందే చేయడంతో అక్కడి ప్రయాణీకులు అందరూ అత్తయ్యను మెచ్చుకోలుగా/అభినందిస్తునట్టుగా చూసారు.... చేసేది చిన్న పనే అయినా నిండు మనసుతో చేస్తే అందరూ హర్షిస్తారు..... (ఇక్కడ అది వారి చోటే కదా వారికి ఇచ్చినంత మాత్రాన గొప్ప పనా.....! అని మీకు అనిపించవచ్చు .... కానీ అక్కడ కూర్చున్న ఎంతమందికి ఆ ఆలోచన వచ్చింది చెప్పండి )

నాగాసాకీలు (నాగా బాబాలు) చేసిన అద్భుతాలు, అంగ/కర విన్యాసాలు , వీరు చూసిన అద్భుతాలు తలుచుకుంటూ , చర్చించుకుంటూ ప్రయాణం కొనసాగించారు... 

రాంనరేష్ గిరి బాబాగారి  గురువు గారు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ , ధ్యానం చేసుకుంటూనే నిప్పుల్లోకి దూకి అదృశ్యమయ్యేవారు ..... వారు తిరిగి సాయంత్రం కల్లా తిరిగి వచ్చేవారు.... 

నాగాసాకీ బాబాలు తమ చుట్టూ పిడకలు పేర్చుకుని అంటించుకుని మధ్యలో వారు కూర్చుని ధ్యానం చేస్తూ చేస్తూ అదృశ్యమయ్యేవారు.... 

ఇలాంటి ఎన్నో అద్భుతాలు అమ్మ, సరస్వతి అత్తయ్య, సుజాత ఆంటీ చూసారు.

ఈ అద్భుతాలను నమ్మేవారు ఎందరుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం వీటిని తప్పక నమ్ముతాను.....

మనది రాముడు ఏలిన రాజ్యం....రామరాజ్యం ..... భరతుడు పాలించిన భరతభూమి.... మన ధర్మం సనాతమ ధర్మం.... ఇటువంటి ఎన్నో అద్భుతాలు అడుగడుగునా ఉన్న దేశం మన భారతదేశం..... నేను ఈ దేశంలో పుట్టినందుకు ఏంతో గర్విస్తున్నాను....
(ఇవన్నీ నిజంగా జరిగాయా...?... నమ్మాలా...? అనుకునేవారికి చెప్పేది కానీ...., నిరూపించి చూపగలిగేది కానీ ఏమీ లేదు - మన పుణ్యభూమిలో పుట్టి.... మన శక్తి మనమే తెలుసుకోలేని స్థితిలో ఉన్నామే అని బాధపడటం తప్ప...)

అమ్మ, సుజాత ఆంటీ డోర్నకల్ స్టేషనులో దిగి కొత్తగూడెం వెళ్ళారు... సరస్వతి అత్తయ్య అదే రైలులో ఖమ్మం చేరుకున్నారు........ అలా వారి ప్రయాణం ఆసక్తికరంగా , అడుగడుగునా అద్భుతాలతో, దేవుడి అండతో సాఫీగా సాగింది.....

వారి ప్రయాణాన్ని అంత సజావుగా.... ఆటంకాలను పక్కకు తోసి.... తానే వెన్నంటి ఉండి , సందర్భానుసారంగా తన పరివారాన్ని పంపి ఆదుకున్న ఆ ఆర్తజన రక్షకుడైన సీతారాముడిని మరవకుండా..... ఆ వారంలోనే వీరంతా కాలిసి భద్రాచలం వెళ్ళి వైకుంఠ రాముడిని, సీతమ్మవారిని , వారి పరివారాన్ని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుని తిరిగివచ్చారు.


మనమందరం కూడా ఆ భద్రాద్రిరాముడిని మనస్సులో ఒక్కసారి స్మరించుకుందాం

సర్వేజనా సుజనోభవంతు:
సర్వేసుజనా సుఖినోభవంతు:

Tuesday, September 3, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 4


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 4

అత్తయ్య  చేసిన ప్రార్థనతో  వరుణుడు శాంతించాడు కానీ చలి తగ్గలేదు....

భక్తులందరూ చలికి వణికిపోతుంటే రాంనరేష్ గిరి బాబా గారు అక్కడ ఉన్నవారందరికీ కంబళ్ళు ఏర్పాటు చేసారు. గుడారాన్ని వెచ్చగా ఉంచేందుకు  బొగ్గుపై చక్కర వేసి నిప్పు పుట్టించారు...
(ఇది సైన్స్ పరంగా ఎలా సాధ్యమని ఆలోచించేవారికి నా దగ్గర సమాధానం లేదు)

అమ్మావాళ్ళు  రోజూలాగే ఆ రోజు కూడా గంగా స్నానానికి బయలుదేరుతుండగా పక్క టెంటులో ఉండే జానకీమాయి వచ్చారు. వీరు చాలా దూరం నడిచి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారని తెలుసుకుని తనకు తెలిసిన దగ్గర మార్గం (షాట్ కట్ అనాలేమో) చూపిస్తానని తీసుకెళ్లి చూపించారు. 

గంగాదాకా వెళ్ళారు. తీరా అక్కడిదాకా వెళ్ళిచూస్తే కిక్కిరిసిన భక్తజనం....కాలుతీసి కాలుపెట్టే సందు లేదు..... అల్లంత దూరాన గంగ కనపడుతుంది కానీ గంగ ఒడ్డు నుంచి వీరున్న చోటు వరకు అంతా జనంతో నిండిపోయింది....

ఎలారా దేవుడా అని ఆలోచిస్తుండగా మా సరస్వతి అత్తయ్య హనుమంతుడిని "నాయనా హనుమా...! ఎక్కడున్నావయ్యా...? ఆనాడు సీతమ్మ వారికోసం నూరు యోజనాల లంకను దాటావు... ఈరోజు పది యోజనాలలో ఉన్న గంగ దగ్గరకు మమ్మల్ని ఎలాగైనా చేర్చవయ్యా..." అంటూ ప్రార్థించారు.

ప్రార్థించి ఒక పక్కగా చూస్తే ఏదో చిన్న మార్గం కనపడింది.... అది ఒకరికంటే ఎక్కువమంది పట్టని అతి చిన్న మార్గం.... ముగ్గురూ ఆ మార్గంలోగుండా వెళ్ళి చూస్తే మీరు నమ్మరండీ.... ఎదురుగా గంగ.... అసలు వాళ్ళు ఊహించనేలేదు అంత త్వరగా గంగ దగ్గరకు చేరుకోగలరని.... ఇక గంగలో స్నానం చేసి తిరిగి వచ్చారు... వారు మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ మార్గం ఎక్కడా కనపడలేదు.... ఇది నిజంగా దేవుడి లీల కాదంటారా....




స్నానం చేసి గుడారానికి తిరిగి వచ్చాక  సత్సంగము, భజనా కార్యక్రమాలు జరిగాయి. తరువాత బాబాగారి దగ్గరకు ఒక విదేశీ యువకుడు, ఒక జపానీ వనిత దీక్ష తీసుకోవడానికి  వచ్చారు. బాబాగారు వారికి దీక్షా నియమాలు చెప్పారు. యువకుడు ఒప్పుకున్నారు కానీ జపానీ వనిత మటుకు వచ్చే సంవత్సరం తీసుకుంటానన్నారు.  బాబాగారు యువకుడికి ముండనం చేయించి ఏకవస్త్రధారుడిని చేసి అయిదు ఇళ్ళలో (గుడారాలలో) భిక్ష ఎత్తించి "శ్రీహరి" గా పేరు మార్చి దీక్ష ఇచ్చారు. 

మరునాడు మౌనీ అమావాస్య స్నానం చేసి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని రాంనరేష్ గిరి బాబా దగ్గరకు వెళ్ళారు. బాబా గారిని అనుమతి అడిగి అక్కడున్న బాబాలందరికీ వీరికి తోచిన ద్రవ్యము దక్షిణగా ఇచ్చి ప్రయాణము గురించి చెప్పారు. రాంనరేష్ గిరి బాబా గారు ఇంకొక్క రోజు ఉండివెళ్ళమని చెప్పారు. కానీ, ఇంటినుంచి బయల్దేరిన తొమ్మిదవ రోజు ఇల్లు చేరకూడదనే నమ్మకం ఉండటాన వారు వెళ్దామనే నిర్ణయించుకుని బాబాగారి వద్ద సెలవు తీసుకున్నారు. బాబాగారు వారిని ఆశీర్వదించి ఒక రుద్రాక్ష, ముత్యము ఇచ్చారు.



(బాబాగారు అమ్మను ఆశీర్వదిస్తున్న ఫోటో - అదే ఫోటోలో శ్రీహరిగారిని(ఎర్ర దుస్తులు) చూడవచ్చు)


బాబాగారి దగ్గర ఆశీర్వాదము రుద్రాక్ష, ముత్యము తీసుకుని మౌనీ అమావాస్య రోజు స్నానం చేసి తిరుగు ప్రయాణమయ్యారు. మౌనీ అమావాస్య కావటాన కిక్కిరిసిన భక్తజనంతో రోడ్లన్నీ నిండిపోయాయి... (ఆ ఒక్క రోజే 30 మిలియన్ల భక్తులు స్నానం చేసారని ప్రభుత్వం వారి అంచనా). రైల్వే స్టేషనుకు కూడా నడిచే వెళ్ళాలి.

ఇక తప్పదనుకుని నడక ప్రారంభించారు ఒకటా, రెండా 7 కిలోమీటర్లు.... మొదటి 3 కిలోమీటర్లు ఎలాగోలా నడిచారు. పెద్దవారు కదా అంత దూరం నడక అలవాటు లేక ఆయాసం........ ఉన్నవి మూడే బ్యాగులైనా అంత దూరం మోసుకుంటూ వెళ్ళటాన చాలా బరువైపోయి మొయ్యలేని పరిస్థితి వచ్చింది.  ఇక వారివల్లకాక బ్యాగులోంచి ఒక్కో బట్టతీసి పడేసుకుంటూ నడుస్తున్నారు. అయినప్పటికీ ఓపీక లేక నడవలేని స్థితికి వచ్చి మా సరస్వతి అత్తయ్య  లక్ష్మణుడిని "నాయనా లక్షణా...! ముసలివారం.... నడవలేకపోతున్నాము...అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగా ఉంది... చాలా దూరం నడవాల్సి ఉంది ..... ఎలాగైనా మమ్మల్ని స్టేషనుకు చేర్చు నాయనా...!" అంటూ ప్రార్థించారు. 

ప్రార్థించిన కాసేపటికే  గుండెజబ్బున్న వృద్ధుడిని దింపటానికి ఒక రిక్షా వచ్చింది. అతడిని దింపి ఖాళీగా వెళ్తున్న రిక్షాను ఆపి స్టేషను దాకా తీసుకెళ్ళమని అడిగారు. 150రూపాయలకే  రిక్షా అతను వారిని స్టేషను దగ్గర క్షేమంగా దించి వెళ్లారు.(నిజానికి వారున్న పరిస్థితికి 2000 ఇచ్చైనా రావటానికి వారు సిద్ధంగా ఉన్నారు).

స్టేషనుకి వచ్చి ఖమ్మంకు టికెట్లు తీసుకుని అలా ప్లాట్ఫార్మ్ దాటారో లేదో వారి వెనకే బ్రిడ్జి కూలింది..... బహుశా రాంనరేష్ గిరి బాబాగారు వీరిని ఒక రోజు ఉండి వెళ్ళమని చెప్పింది ఇందుకేనేమో.... తృటిలో తప్పిన ప్రమాదం నుంచి తేరుకునేలోపే గుట్టలుగా శవాలు పడిపోయాయి.... ఏమి జరుగుతుందో.... ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.... ఆ దుర్ఘటనతో రెండు రోజులు రైళ్ళ రాకపోకలు ఆగిపోయాయి....



                                          (రైల్వే స్టేషనులో ప్లాట్ఫార్మ్ కూలిన తరువాతి దృశ్యం - గూగుల్ ఫోటో )

Sunday, August 25, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 3

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 3

రాంనరేష్ గిరి బాబా గారి సహాయంతో అమ్మ, అత్తయ్య, సుజాత ఆంటీ నాగాసాకీల గుడారానికి చేరుకున్నారు...

వారికి ఒక టెంటులో కొంత చోటు చూపించి అందులో ఉండమని చెప్పారు... వంటశాల చూపించి అక్కడ వంట కార్యక్రమాలను చూసుకునే "రాందేవ్" బాబాను పరిచయం చేసి వెళ్ళారు రాంనరేష్ గిరి బాబాగారు.

ఒక్కొక్క టెంటు సుమారు 500 మంది ఉండగలిగేంత పెద్దదిగా ఉండేది.వంట గది టెంటు మటుకు చాలా పెద్దగా ఉండేది. వీరందరికీ టీ, కాఫీ భోజనాదులు అన్నీ అక్కడ నుంచే ఏర్పాటు అయ్యేవి.

అంతేకాక అక్కడ బ్యాచీల వారిగా వచ్చి టీ, కాఫీ, సమోసా, లడ్డూ, కేసరి లాంటి పదార్థాలు ప్రతీ ఒక్కరికి ఇచ్చి వెళ్ళేవారు.అలాగే మన గుడారంలో వండేవి పక్క గుడారాలకి వెళ్ళి పంచిపెట్టేవారు.

అక్కడ ప్రతీరోజూ భజన, సత్సంగము జరిగేవి.అందులో అమ్మవాళ్ళు కూడా పాల్గొనేవారు. 

అమ్మ వాళ్ళు స్నానాదులు ముగించుకుని జపము చేసుకుంటూ కూర్చున్నారు...

మొదటి రోజు భజన, సత్సంగము ముగిసింది. భోజన సమయానికి అమ్మావాళ్ళని పిలిచి అందరితో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టారు. అక్కడ అందరూ స్వామీజీలు ప్రసాదం స్వీకరించాకే భోజనం చేసేవారు. భోజనం మటుకు ఉత్తర భారతదేశ పద్దతిలో ఉండేది.పరోటా,ఆలుగడ్డ కూర,ఉడికించిన శెనగలు,పెసలు ఇలాంటివి ఉండేవి.

భోజనం ముగించుకుని టెంటులోకి తిరిగి వచ్చి కాసేపు భగవంతుడిని ధ్యానం చేసుకుని పడుకున్నారు...

ప్రయాగలో అడుగుపెట్టిన మొదటిరోజు అలా గడిచింది.

మరుసటి రోజు పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు ముగించుకుని వచ్చారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. అంత మందికి వీలుగా ఉండటానికి ప్రభుత్వం వారు చక్కటి వసతులను కల్పించారు. నిజంగా లెక్కకు మించిన భక్తులకు వసతులు కల్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు ఉత్తర్ ప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలపకుండా, వారిని మెచ్చుకోకుండా ఉండలేం...

వీరు స్నానాలు చేసినప్పటికీ స్వామీజీ పిలిచి గంగకు వెళ్ళి స్నానము చేసి రమ్మన్నారు. ఆ అఖాడా (నాగాసాకీల డేరాల)నుంచి 2 కి.మీ.ల దూరం ఉంటుంది గంగ. స్వామీజి చెప్పారని వెళ్ళి స్నానం చేసి వచ్చారు. కానీ పెద్దవారు అవటాన కాస్త అలిసిపోయారు...

తిరిగి వచ్చేటప్పటికి భోజనాల సమయం కావడంతో భోజనానికి రమ్మని పిలిచారు. ఆ రోజు కూడా ఉత్తర భారతదేశ పద్దతిలో భోజనం ఉండేసరికి సరిగ్గా తినలేకపోయారు. ఇది గమనించిన రాందేవ్ బాబా వారిని అందరిముందూ కాక వంటశాలకు పిలిచి విషయం ఏమిటని అడిగారు. 

అమ్మ బాబాగారితో "మేము దక్షిణ భారతదేశం నుంచి వచ్చాము... మాకు ఇలాంటి ఆహారము అలవాటులేక తినలేకపోతున్నాము" అని చెప్పారు.అందుకు బాబాగారు " మీరు అలా ఇబ్బందిపడవద్దు.. మీకు కావాలంటే మీరే వండుకోవచ్చని " చెప్పారు. అందుకు వారు అలాగే చేస్తామని బాబాగారికి కృతజ్ఞతలు చెప్పి తమ గుడారానికి తిరిగి వచ్చారు.

ఆ రోజు స్వామీజీ వద్దకు ఒక విదేశీ వనిత దీక్ష తీసుకోవడానికి వచ్చారు. స్వామీజీ ఆమెకు వారి పద్దతులు వివరించి ఒప్పుకున్న మీదట ఆమెకు ముండనం చేయించి, ఏకవస్త్రను చేసి, "సీతాజ్ఞి"గా పేరు మార్చి దీక్ష ఇచ్చారు. తరువాత భజన,సత్సంగము జరిగింది.

ఆ కార్యక్రమమంతా ముగిసాక అమ్మావాళ్ళు వారి వంట చేసుకోడానికి వంటశాలకు వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వంటసామాన్లు అన్నీ పెద్దపేద్దవి. టీ,కాఫీలు పెద్దపేద్ద గంగాళాలలో తయారుచేసేవారట. వీరున్నది ముగ్గురు. ఎలా వంట చేసుకోవాలా అని అనుకుంటుంటే సరస్వతి అత్తయ్య ఉపాయంతో మంచినీళ్ళ జగ్గులో ఆలుగడ్డ కూర, రసం,అన్నం వండారు. పెరుగు తెచ్చుకుని పెట్టుకున్నారు.

మనం అనుకుంటాం కానండీ మన పెద్దవాళ్ళ ఆలోచనా తీరు, వారి ఉపాయాల ముందు మనమెంత చెప్పండి...!! ఒక సమస్యకు వారు చిటికెలో సులువైన పరిష్కారం చెప్పగలరు... వారి అనుభవం అలాంటిది... వారు చెప్పేది మంచికే అయినా మనకి అంత దూరాలోచన ఉండక ఏదో చెప్తున్నారులే అని విని వదిలేస్తాం.... పాటించము... ఒక్కోసారి తరువాత మన అనుభవంలోకి వచ్చాక బాధపడతాం... ఒక్కోసారి మనం అనుకున్నదే కరెక్ట్ అవుతుంది అనుకోండి... అంత మాత్రాన వారిది తప్పనీ, వారికి ఏమీ తెలియదని కాదు కదా...(అసలు ఇక్కడ నాకు అనాలేమో... మిమ్మల్ని కలపడం ఎందుకు చెప్పండి... మీరందరూ మంచివారే..)

వంట అంతా ముగించుకున్నారు కానీ.. స్వామీజీ ప్రసాదం స్వీకరించేవరకు తినకూడదు కదా...!స్వామీజీవారు ప్రసాదం స్వీకరించేసరికి సాయంత్రం 4 అయింది.అప్పటివరకు ఆగి అందరితో పాటే భోజనం ముగించారు.

ఇదేంటి భోజనం,వంట వీరికి ఎందుకు అంత తిండిపిచ్చి అనుకోకండి... వయసు పైబడిన వాళ్ళు కదా బి.పి., షుగరు ఉండటాన వేళకు ఆహారం తినకపోతే ప్రమాదము.. ఊరుగాని ఊరు వచ్చి అక్కడ ఏదైనా జరగకూడనిది జరిగితే కష్టం కదా... అందుకన్నమాట వారి తాపత్రయం.


ఇక వచ్చేపోయే భక్తులలతో మళ్ళీ సందడి మొదలయింది. ఆ వచ్చే భక్తులలో ఎవరైనా తెలుగువారు ఉంటే స్వామీజి అమ్మను పిలిచి వారు ఏమి చెప్పదలుచుకున్నారో అడిగి తెలుసుకుని వారికి తగు సలహాలు చెప్పేవారు. అమ్మ భక్తులు చెప్పేది స్వామీజీకి, స్వామీజి చెప్పేది భక్తులకు వివరించేవారు.

ఆ రోజు రాత్రి అనుకోకుండా వర్షం మొదలయింది. వాన... విపరీతమైన చలి. వెంటనే మా సరస్వతి అత్తయ్య వరుణ దేవుడిని "వరుణ దేవా..! ముసలివాళ్ళం, ఊరుగాని ఊరు వచ్చాము, ఎంతోమంది భక్తులు నాయనా...మాకైనా గుడారాలు ఉన్నాయి... గుడారాలు కూడా లేక రోడ్లపైనే పడుకుంటున్న భక్తులు ఎందరో ఉన్నారు... మమ్మల్నందరినీ ఇబ్బందులపాలు చేయకు.. నీ ప్రతాపము తగ్గించుకో..." అని కన్నీళ్ళతో ప్రార్థించారు. 

అంతే మీరు నమ్మరండీ నిమిషంలో వాన తగ్గిపోయింది.

అక్కడ స్వామీజీకి అత్తయ్య ఏమి చేస్తున్నారో అర్థం కాక అమ్మను పిలిచి విషయం ఏమిటని అడిగారు. అమ్మ అంతా వివరించగా విషయం తెలుసుకుని చాలా సంతోషించారు.

ఇక్కడ ఒక మాట చెప్పాలి... కొందరికి వాక్షుద్ధి ఉంటుంది. వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. అసలు నిజం చెప్పాలంటే ప్రతీ మనిషికీ వాక్షుద్ధి ఉంటుంది. వారు చేసే పనులను బట్టి దాని ప్రభావం ఉంటుంది. వారు మాట్లాడే మంచి/చెడు మాటల వల్ల దాని ప్రభావం తగ్గటం,పెరగడం జరుగుతుంది. మనం మన గురించీ, మన పక్కవారి గురించీ మంచే తలుచుకుని, మంచి జరగాలని కోరుకుంటే మన మాటే వేదం అవుతుంది. మన సంకల్పం బలపడి అనుకున్నది జరిగి తీరుతుంది. దీనికి నాలుక పై మచ్చలు ఉండనక్కర్లేదు... దేవుడే దిగిరానక్కర్లేదు కదా...! దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనకు సరిగ్గా ఉపయోగించుకోవటం వస్తే... అంతా శుభమే.. అంతా జయమే..

ఆ వాక్షుద్ధే మా సరస్వతి అత్తయ్యకు ఉంది. అందుకే వారు చేసిన ప్రార్థనకు వరుణ దేవుడు కటాక్షించారు. ఇది నిజంగా జరిగిందా...? మేము నమ్మాలా...? అని ఆలోచించేవారికి/ప్రశ్నించేవారికి చెప్పేది ఏమి లేదండి... చేయగలిగింది కూడా ఏమీ లేదు.. అది వారి ఊహకే వదిలేయడం తప్ప.

Tuesday, August 20, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 2


అమ్మ మహాకుంభమేళా యాత్ర - 2


ప్రయాగలో స్నానాలు చేసాక గంగ నుంచే మట్టి తెచ్చి ఒక సైకతలింగాన్ని తయారు చేసి , పిండి దీపము వెలిగించి, పాలు, జామపండు నైవెద్యముగా పెట్టి, గంగామాతకు బట్టలు, కాటుక,గాజులు,అద్దము,దువ్వెన,నల్లపూసలు,పుస్తెలు, మెట్టెలు సమర్పించి లింగాన్ని తిరిగి గంగలో కలిపేసారు...

స్నానము, పూజ ముగించుకుని ఇక అక్కడ ఉండటం సాధ్యపడదని తెలుసుకుని కాశీకి వెళ్దామనుకొని అక్కడ నుంచి బయల్దేరారు అమ్మావాళ్ళు...


భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటాన ఆటోలు, రిక్షాల రాకపోకలు త్రివేణీ సంగమానికి 7కి.మీ. ముందే ఆపేసారు. నడక తప్పనిసరి కావడంతో నడుచుకుంటూ మూడు గంటల్లో బస్టాండు చేరుకున్నారు... 
  
కానీ అత్తయ్యకేమో ఎలాగైనా నాగాసాకీలని ( వీరినే నాగా బాబాలనీ, నంగా బాబాలని కూడా పిలుస్తారట ) చూడాలని కోరిక...

నాగాసాకీలు అంటే దిగంబరులై, వంటి నిండా బూడిద పూసుకుని, జటాజూటధారులై ఎళ్ళప్పుడూ అగ్ని కార్యాలు చేసుకుంటూ తమదైన లోకములో ఉంటారు...


వీరి గురించి మరి కొంత ఇక్కడ చదవచ్చు - ఇది ఇంగ్లీషులో ఉంది 

ఇంత దూరం వచ్చాము, ఒక్కసారి వారిని కూడా చూసి వెళ్ళిపోదామని అత్తయ్య అమ్మని అడిగారు...
సరే అని ఆ లగేజీ అంతా మొయ్యలేక సుజాత ఆంటీని అక్కడే ఉండమని వారు నాగాసాకీలు ఉండే సెక్టర్ వెతకడం మొదలుపెట్టారు...

ఇక్కడ సెక్టర్ల  గురించి ఒక విషయం చెప్పాలి...

ప్రభుత్వం వారు ప్రయాగ అంతటినీ సెక్టర్లుగా విభజించి ప్రతి రాష్ట్రానికి ఒక సెక్టరు, దేవస్థానాలకి సెక్టర్లు ( ఉదా: టి.టి.డి సెక్టరు...) , మఠాలకు సెక్టర్లు (ఉదా: జియర్ మఠం సెక్టరు, శంకర మఠం సెక్టరు) నాగాసాకీలకు ఒక సెక్టరు ఇలా ఎర్పాటు చేసారు...

పోలీసులను, భక్తులను అడుగుతూ ఎట్టకేలకు నాగాసాకీల సెక్టారు చేరుకున్నారు...

అక్కడ డేరాలు కట్టి టెంటులు వేసి ఉన్నాయి... ఒక్క నాగాసాకీలవే 500 పై చిలుకు  టెంట్లు ఉన్నాయి...
ప్రతీ టెంటులో నాగాసాకీలు అటూ ఇటూ వరుసగా కూర్చుని హోమయజ్ఞాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు....

భక్తుల దర్శనార్థం మధ్య నడిచే స్థలం విడిచిపెట్టారు...
అమ్మ, అత్తయ్య ఒక టెంటులోకి వెళ్ళి నాగాసాకీలను దర్శించుకున్నారు... వారు జటాజూటాలతో దిగంబరులయి గురువులను స్మరిస్తూ అగ్ని కార్యాలు చేసుకుంటున్నారు....

అక్కడే ఉన్న ఒక స్వామివారు వీరిద్దరిని పిలిచి "ఎవరు మీరు… ఎక్కడ నుంచి వచ్చారు… మీకేమి కావాలి ? " అని అడిగారు

అమ్మావాళ్ళు వివరాలు చెప్పాక కొన్ని స్వంత విషయాలు అడిగితే వారిని ఉద్దేశించి "నువ్వు దేనికోసం వచ్చావు ఈ భూమ్మీదకి...? ప్రాపంచిక విషయాల మీద వ్యామొహం ఎందుకు? నీకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు... ఇంకా ఎందుకు ఈ కోరికలు.... దేని కోసం నువ్వు ఇంకా ప్రాకులాడుతున్నావు?..... దేవుడిని స్మరించుకుంటూ కాలం గడుపు  " అని అన్నారు.   

అందుకు వారు తమ తప్పు తెలుసుకుని ఇక నుంచి కోరికలను వదులుకొని దైవ చింతనలో కాలం గడుపుతామని విన్నవించుకున్నారు...
ఆ స్వామి వీరికి రుద్రాక్ష మరియు విభూది ఇచ్చారు.... ఆయనే "శివశక్తి బాబా"
(వీరి సంభాషణ అంతా హిందీలోనే జరిగింది)


మొత్తానికి అత్తయ్య కోరిక మేరకు నాగాసాకీలను దర్శించుకున్నారు... 

కానీ ఎక్కడా ఉండటానికి ఇంత చోటు కూడా లేదు.... ఎప్పుడో పొద్దున్న తిన్న రెండు పూరీలు ఏమి అక్కరకు వస్తాయి చెప్పండి ?.... అంత దూరం నడిచి నడిచి ఉన్నారేమో బాగా ఆకలి మొదలైంది. నాగాసాకీలకు సహాయ సహకారాలు అందించేవారు (ఇప్పటి భాషలో స్పాన్సర్లు అనాలేమో..!) వచ్చేపొయే భక్తులకు టీ, కాఫీలు అందిస్తున్నారు... వీరికి అది కాస్త ఉపశమనం అయ్యింది ..


తిరిగి బస్టాండుకి వెళ్ళిపోయి సుజాత ఆంటీని కలిసి ఏదైన తిని కాశీకి వెళ్ళిపోదామని అనుకున్నారు..
ఇంతలో అక్కడే ఉన్న మరొక బాబా పిలిచి వీరి వివరాలు అడిగారు....

వివరాలు చెప్పి వీరి ప్రస్తుత పరిస్థితి వివరించారు.... ఆడవాళ్ళు... ఆకలితో ఉన్నారు... ఎక్కడా ఉండటానికి ఇంత చోటు కూడా లేదు అని తెలుసుకుని వారిని అక్కడే ఉండమని బాబా తమ గురువుగారి దగ్గరకు వెళ్ళారు...గురువుగారి అనుమతితో వీరికి భోజనం పెట్టించారు.... సుజాత ఆంటీ గురించి కూడా చెప్తే తనకోసం భోజనం పొట్లం కట్టించి ఇచ్చారు. అంతేకాకుండా, వీరితో పాటే బస్టాండు వరకు వచ్చి ఆంటీ తినేదాకా ఉండి , ముగ్గురిని తీసుకుని వారి టెంటుకు తిరిగి వచ్చారు....


ఇంతకీ ఆ బాబా మరెవరో కాదండీ మన భద్రాచల రాముడే.... పేరు "రాంనరేష్ గిరి" 

అలా తినడానికి తిండి, ఉండటానికి బస దొరకని వారికి ఆ భద్రాచల రాముడే తోడుండి వారిని ఒక గూటికి చేర్చాడు.... 

Monday, August 19, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 1

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 1

కుంభ మేళా అనేది 12 ఏళ్ళకు ఒకసారి జరిగే ఉత్సవం. దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలు హాజరవుతుంటారు. 

కుంభమేళా ఈ 4 ప్రదేశాలలో ఏదో ఒక నగరంలో జరుగుతుంది... అల్లహాబాద్, హరిద్వార్, ఉజ్జయని మరియు నాసిక్

అర్థ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగలో జరుగుతుంది...

పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మాత్రమే జరుగుతుంది...

మహా కుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మాత్రమే జరుగుతుంది...


2013లో జరిగిన మహాకుంభమేళాలో ఒక్క మౌనీ అమావాస్యనాడే 30 మిలియన్ల భక్తులు ప్రయాగలో స్నానం చేసి ఉంటారని అంచనా...


ఈ సంవత్సరం జరిగిన మహాకుంభమేళకు అమ్మ, సరస్వతి అత్తయ్య, మా అమ్మ స్నేహితురాలు సుజాత ఆంటీ కలిసి వెళ్ళారు.

అలా వెళ్ళిన వారి ప్రయాణంలో జరిగిన ఘటనలు, ఎదుర్కున్న పరిస్థితులు అమ్మ నాకు చెప్పారు ...

అవి విన్న తరువాత దేవుడు నిజంగా మనకు అడుగడుగునా తోడుంటాడు అనేది అక్షర సత్యం అనిపించింది..
ఆ అనుభవాలే ఇప్పుడు నేను మీ అందరితో బ్లాగ్ముఖంగా పంచుకోదలిచాను....


అమ్మ కుంభమేళా జరుగుతున్న కాశీ పట్టణానికి వెళ్ళదలిచి సాయి మావయ్య చేత తత్కాల్ లో టికెట్లు బుక్ చేయించారు. రెండు సార్లు బుక్ చేసినా టికెట్లు కన్ఫర్మ్ కాలేదు.
ఇక ఆఖరున ఏదైతే అది అవుతుందని జనరల్ టికెట్లు బుక్ చేసుకుని అమ్మ, ఆంటీ కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళారు. ఖమ్మంలో సరస్వతి అత్తయ్య ఇళ్ళు చేరుకుని అత్తయ్యకు టికెట్ల విషయం చెప్పారు. ఎలాగైనా నేనూ వస్తానని అత్తయ్య కూడా భద్రాచల రామయ్యకు దండం పెట్టుకుని వారితో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడ రైలు పదిహేను నిమిషాలకు మించి ఆగదు అని తెలుసుకున్నారు.

రైలు వచ్చాక చూస్తే జనరల్ బోగీలో విపరీతమైన జనం.... ఇసుక వేస్తే రాలదంటారే అలాగ....

అసలు ఏ బోగీ చూసినా కాలు పెట్టే సందు లేదు... ఏ బోగీలో అయినా ఇంత చోటు దొరకపోదా అని సామాన్లు పట్టుకుని ప్రతి బోగీ వెతుక్కుంటూ వెళ్తున్నారు....

అలా వెతుకుతూ వెతుకుతూ రైలు ఆఖరు బోగీ దగ్గరకు వచ్చారు... చూస్తే బోగీ అంతా ఖాళీ...అది వికలాంగుల బోగీ.. ఎక్కొచ్చా లేదా అని అలోచిస్తుంటే అక్కడే ఉన్న టీ.సి. చూసి పర్లేదు ఎక్కేయమని చెప్పారు...వీరు ఎక్కడం చూసి ఇంకొకరు కూడా ఎక్కారు.....అతనికి సుమారు 50ఏళ్ళు ఉంటాయేమో....

రైలు కదిలాక చూస్తే ఆ బోగీలో వీరు 4 తప్ప ఇంకెవరూ లేరు, ఇక వెంటనే అత్తయ్యకి సంకోచం కలిగి అతని వివరాలు కనుక్కోమని చెప్పారు (అతను తెలుగువాడు కాడు).

అమ్మ అతని పేరు, వివరాలు కనుక్కున్నారు... అతను అన్నీ చెప్పారు కానీ తాను ఎక్కడ ఉంటారో చెప్పలేదు... 

అతనితో కబుర్లు చెప్తూ ప్రయాణం కొనసాగించారు...అలా కొన్ని గంటలు గడిచాక ఆ బోగీ కూడా జనంతో కిక్కిరిసిపోయింది....కానీ వారి ప్రయాణం మటుకు సజావుగానే సాగింది...

వారందరూ కలిసి ఎట్టకేలకు ప్రయాగ చేరుకున్నారు....

వారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తే వీరి సామాన్లు కొన్ని మోసి త్రివేణీ సంగమం దాకా చేర్చారు...

స్నానాలు ముగించుకుని, దీపాలు వెలిగించుకొని దగ్గర్లోని టిఫిన్ సెంటరుకు వచ్చారు....

అతను వీరు టిఫిన్ చేసేవరకు ఉండి సెలవు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు....

అయ్యో అతను టిఫిన్ కూడా చేయలేదు తిని వెళ్ళమని చెప్దామని వెనక్కి తిరిగి చూస్తే అతడెక్కడా కనిపించలేదు...

ఇంతకీ అతని పేరేంటో మీకు చెప్పలేదు కదూ.... 

                                      దశరథ్


శ్రీరాముని అభీష్టం మేరకు నీ భక్తులను నేను క్షేమంగా చేరుస్తానని దశరధులవారే స్వయంగా వచ్చారేమో....! అనుకుని మనసులోనే నమస్కరించుకున్నారు ముగ్గురు....



Tuesday, July 2, 2013

80 ఏళ్ళ మనిషి జీవితం



ఇది నేను ఈ మధ్య Facebook లో చదివాను.
నా బ్లాగు మిత్రులతో కూడా పంచుకోవాలనిపించి ఇక్కడ రాస్తునాను...

మొదటి రోజున దేవుడు ఆవును(గోమాతను) సృష్టించి "నువ్వు రోజు యజమాని(రైతు)తో పాటు పొలానికి వెళ్ళి పని చేయాలి, లేగదూడలను కని పాలిచ్చి రైతన్నకు అండగా ఉండాలి. నీకు 60 ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తున్నాను" అని అన్నారు.

అందుకు గోమాత "60 ఏళ్ళు అలాంటి జీవితం గడపడం కష్టం.... నాకు 20 ఏళ్ళు చాలు మిగితా 40ఏళ్ళు తిరిగి ఇచ్చేస్తాను" అంటుంది. దేవుడు అందుకు అంగీకరిస్తారు.

రెండవ రోజు దేవుడు కుక్కను సృష్టించి "నువ్వు రోజంతా ఇంటిముందు కూర్చొని వచ్చేపొయేవారిని చూసి అరుస్తూ ఉండాలి. నీకు 20ఏళ్ళ జీవితం ప్రసాదిస్తాను" అని అన్నారు.

అందుకు కుక్క "అన్ని రోజులు అరవటం(మొరగటం) నా వల్ల కాదు నాకు 10ఏళ్ళు చాలు, మిగితా 10ఏళ్ళు తిరిగి ఇచ్చేస్తాను" అంటుంది. దేవుడందుకు అంగీకరిస్తారు.

మూడవ రోజున దేవుడు కోతిని సృష్టించి "నీకు 20ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తాను.. నువ్వు నీ కోతి చేష్టలతో అందరినీ నవ్వించాలి" అని అంటారు.

అందుకా కోతి "20ఏళ్ళు కోతి చేష్టలు నా వల్ల కాదు ... కుక్క మీకు 10ఏళ్ళు ఇచ్చింది కదా నేను కూడా 10 ఏళ్ళు ఇస్తాను" అన్నది. దేవుడు సరేనన్నారు.

నాలుగవ రోజు దేవుడు మనిషిని సృష్టిస్తారు "తిను, తాగు, ఆడుకో , ఆనందంగా జీవించు నేను నీకు 20 ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తాను" అంటారు.

అందుకు మనిషి " ఏంటీ... ఒక్క ఇరవై ఏళ్ళేనా .... అవేమి సరిపోతాయి... నాకు నా 20తో పాటు ఆవు తిరిగిచ్చిన 40ఏళ్ళు, కుక్క ఇచ్చిన 10ఏళ్ళు, కోతి ఇచ్చిన 10ఏళ్ళు కలిపి 80ఏళ్ళు ఇచ్చేయండి" అని అడుగుతాడు.

దేవుడు అందుకు సరేనని అంగీకరిస్తారు.

అందుకే మనం మొదటి 20ఏళ్ళు ఆడుతూ, పాడుతూ ఏమీ చేయకుండా ఆనందంగా జీవిస్తాం.
తరువాతి 40ఏళ్ళు బానిసల లాగా కుటుంబం కోసం ఎండనకా వాననకా కష్టపడతాం.
తరువాతి పదేళ్ళు కోతి చేష్టలతో మనవళ్ళని, మనవరాళ్ళని ఆనందపరుస్తాము.
ఆఖరి పదేళ్ళు ఇంటి ముందు కూర్చుని వచ్చేపోయేవారి మీద అరుస్తూ ఉంటాము.

ఎవరు రాసారో కాని చాలా బాగుంది కదండీ.... ఎంత నిజం....

English Version కోసం ఇక్కడ చూడండి :  Hardworking Human Life