Wednesday, December 21, 2011

దయ్యంతో నా అనుభవం

దయ్యంతో నా అనుభవం


కొంచెం పెద్ద అనుభవమే.... తీరికున్నప్పుడు చదవండేం.....


అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. వేసవి సెలవలకి అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళాను.
ఆట పాటలతో , పుస్తకాలు చదవడంతో కాలక్షేపం అయిపోయేది.
ఇది ఇలా ఉండగా ఒక రోజు అందరి భోజనాలయ్యాక ఆరుబయట మంచాలేసుకుని చుక్కలని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ( ఆ మరే నేనో పెద్దనాపసానినని నేను చెప్పింది అందరూ వింటారా ఏంటి... అమ్మా వాళ్ళేదో మాట్లాడుతుంటే మనం కిక్కురుమనకుండా పక్కన కూర్చుని వినడమే....)

ఈలోగా మావయ్య వచ్చాడు. హమ్మయ్య మావయ్యైతే కాసేపు మాతో ఆడుకుంటాడూ , బోలెడు కథలు చెప్తాడని.... ఇక ఇక్కడ మనకేమి పని అనుకొని నేనూ మా అక్కా మావయ్య దగ్గరికి పరుగెత్తుకెళ్ళాం.
 మావయ్య తింటూ మాకూ చెరో ఆవకాయ ముద్దా, పెరుగన్నం ముద్దా పెడితే ఎంచక్కా వద్దనకుండా తినేసాం.

ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉండేది "మావయ్య తినే రెండు ముద్దలన్నా తిననియ్యండే... !" అని.
దానికి నేనేదో పెద్ద గొప్ప పండితురాలిలాగా ఒక రోజు మావయ్య తినే ముద్దలన్నీ లెక్కపెట్టి "మావయ్యా..! నువ్వు తినేది 23 ముద్దలైతే అమ్మేంటి 2అని అంటుంది" అని అడిగాను.(అమ్మని అడగాలంటే చచ్చేంత ధైర్యం కావాలి తెలుసా..)

సరే ఇక  విషయానికి వస్తే మావయ్య భోజనం చేసాక "కథలు చెప్పూ..! కథలు చెప్పూ...! " అంటూ ఇద్దరం గోల చేసేసరికి , మావయ్య అరుగెక్కి కూర్చుని మమ్మల్ని చెరో పక్క కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలెట్టాడు.

పాపం మా మావయ్య తన మానాన తను చందమామ కథలు చెప్తుంటే నేనే ఆపి  "మావయ్యా ! నువ్వు నిజంగా దయ్యాన్ని చూసావంట కదా.... మరి ఆ కథ మాకెప్పుడూ చెప్పలేదేంటి?" అని ఏదో గొప్ప రహస్యం బయట పెట్టినదానిలాగా నడుమ్మీద చెయ్యేసుకుని నిలదీసినట్టుగా అడిగాను.

దానికి మా మావయ్య "నీకెవరు చెప్పారే.... అన్నీ ఇట్టే తెలుసుకుంటావ్.... అయినా అది చిన్నపిల్లలు వినే కథ కాదులే" అని మమ్మల్ని శాంతిపచూసాడు.

ఈ చిన్నపిల్లలు చూడకూడదు/వినకూడదు/మాట్లాడకూడదు అనే మాటలున్నాయి చూసారాండీ అవి మహా చెడ్డవి.
ఎక్కడ లేని రోషాన్ని తెచ్చిపెడతాయి. అన్ని లాజిక్కులనీ గుర్తుచేస్తాయి...

పొగిడినట్టే పొగిడి మా మవయ్య వేసిన చురకకి మన బుర్ర పాదరసంలాగా పని చేసి 'ఏ అర్థరాత్రి ఫోను వచ్చిందని చిన్న తాతయ్య ఇంటికి పంపినప్పుడు చిన్నపిల్లలము కామా.... ? బావినుంచి నీళ్ళు తెచ్చేటప్పుడు (చిన్న బిందెడు - తిప్పి కొడితే లీటరు నీళ్ళు ఉండవు - పూజకని మాచేత స్నానమవగానే తెప్పించేవాళ్ళు)  చిన్నపిల్లలము కామా....?' ఇలా నిలదీసేసరికి మావయ్యకి ఏమిచేయాలో పాలుపోక సరే చెప్తాను కానీ 'నిద్రలో భయపడి లేస్తే మావయ్యే దయ్యం కథ చెప్పాడని మీ అమ్మకి చెప్పొదని మా ఇద్దరి దగ్గర మాట తీసుకున్నాడు.

సరే నీకెందుకు ప్రాణం పోయినా మాట తప్పం అన్న రేంజ్లో మొహాలు పెట్టి చెప్పమన్నట్టుగా సైగ చేసాం.

మా మావయ్య చెప్పిన నిజం దయ్యం కథ :

ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి పొలంలో పడుకోవటానికి వెళ్ళాను. (అంటే జీతగాళ్ళు ఊరికెళ్ళినప్పుడో , ఏదైనా దొంగల భయం ఉన్నప్పుడో మావయ్య కూడా వెళుతుండేవాడు). సరే అందరం ఇంట్లో భోజనాలు చేసే వచ్చాము కదా అని వస్తూ వస్తూ కొట్లో కూల్ డ్రింకులు తెచ్చుకున్నాం (నేనైతే అస్సలు నమ్మలేదండీ....)

 అందరం ముచ్చట్లు పెట్టుకోవడం మొదలెట్టాము మధ్య మధ్యలో కూల్ డ్రింకు తాగుతూ పిచ్చా పాటీ మాట్లాడుకుని, కాసేపు అంత్యాక్షరీ అని గుర్తొచ్చిన పాటలన్నీ పాడుకొన్నాము. అర్థరాత్రైంది పడుకుందాం అనుకొని  అందరం బాత్రూం కి వెళ్ళి వచ్చాము.

పడుకోబోతుండగా ఒక నిప్పు రవ్వ (మంట లాంటిదంట)  మాకు దూరంగా కనబడింది.
 ఈ టైములో ఎవరుంటారా అని ఏవో తెలిసిన 2,3 పేర్లు పిలిస్తే ఎవరూ పలకలేదు. అది చూస్తూ చూస్తూ దగ్గరయ్యి మా పక్కగా మన పొలంలోని బావి దగ్గరకి వెళ్ళి 3 సార్లు బావి చుట్టూ తిరిగి బావిలో పడిపోయింది.

 అప్పటి వరకు ధైర్యంగా కబుర్లు చెప్పుకున్న మేము ఏమీ అర్థం కాక బిక్కచచ్చి పోయాము. అంతలో నా మిత్రుడొకడు అరేయ్ వారం రోజుల క్రితం మన ఊరి XXX ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కదా.... కొంపదీసి అదే దయ్యమయి ఇలా తిరుగుతుందేమోరా ....! అన్నాడు.

 అంతే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్కరికి నిద్రపడితే ఒట్టు.
ఇంక ఒకరి తరువాత ఒకరు వాళ్ళకు తెలిసిన దెయ్యజ్ఞానం పంచడం మొదలెట్టారు.

 అరే ఇలా నిప్పురూపంలో తిరిగే దయ్యాలని "కొరివి దయ్యం" అంటారంటరా....."XX దెయ్యం' (పేరు మర్చిపోయాను) ఎప్పుడూ కట్టెలు విరుస్తూ ఉంటుందంటరా..... ఫలానా దెయ్యం ఇష్టమైన వాళ్ళతొనే మాట్లడుతుందంటరా...... అరే ఎవరూ కనబడకపోయినా రాయి విసిరితే అది ఎవరికైనా తగిలినట్టుగా కిందపడితే (డైరెక్టుగా కిందపడకుండా అని అర్థం లేండి) ఖచితంగా దయ్యమే అంటరా..... కోరికలు తీరక చనిపోయినవారు ఆత్మలయి ఎదో ఒక దానిలోకి దూరి వారి కోరికలను తీర్చుకుంటాయంటరా...... ఇలా నోటికొచ్చినవన్నీ చెబుతుంటే ఒక్కొకరికీ భయం పెరిగిపొయింది....

ఇంతలో తెల్లవారుతుందగా ఇటుగా ఎవరో వస్తున్నట్టు అలికిడికాగానే అందరం తలా ఒక రాయి ఏరి విసిరికొట్టాము. దానికి భయపడ్డ మన జీతగాడు (అదృష్టవశాత్తు ఒక్క రాయీ తగల్లేదు)  "అబ్బో..! అమ్మో...!" అంటూ మొత్తుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. జీతగాడి గొంతు గుర్తుపట్టగానే అందరూ ఊపిరి పీల్చుకుని, వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్ళకి పరిగెత్తాము.

ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ ఎవ్వరూ దయ్యాల మాట మాత్రం ఎత్తలేదు.

---------------------------------------------------------------------------------

నాకెందుకో మా మావయ్య సగం కథ ఎగరగొట్టేసాడని గట్టి నమ్మకం. సరే కానిమ్మని మావయ్యను కాసేపు ఆటపట్టించి నిద్రపోదామని అమ్మ దగ్గరకు వెళ్ళాము. లోలోపల మాకు కొంచం భయంభయంగానే ఉంది.

ఇంతలో మా చినతాతగారికి అర్జెంటు  ఫోను.  మామూలుగానైతే ఏ భయం లేకుండా పరుగెత్తుకెళ్ళి
పిలుచుకొచ్చేదాన్నీ....... కానీ కాస్త భయం కూడా తోడయ్యేసరికి  నిద్రముంచుకొచ్చినట్టు నటించాను.

కానీ అమ్మ ఊరుకోదు కదా "అందరూ పడుకున్నారు ఇద్దరూ ఇప్పటిదాకా కబుర్లాడారు కదా అంతలోనే నిద్ర ముంచుకొచ్చిందా" అని కోప్పడుతూ వెళ్ళి రమ్మంది........

సరే దేవుడి మీద భారమేసి గేటు దాటి కొంచం దూరం వెళ్ళాను.
నాకక్కడ ఏదో ఆకారం ఉనట్టుగా కనిపిస్తుంది ఎందుకైనా మంచిదని వెనక్కి వెళ్ళి 'అక్కను కూడా రమ్మను.... ఇప్పటిదాకా అది కూడా కబుర్లాడిందిగా మరీ' అన్నాను. సరే అక్క కూడా నా వెంట వచ్చింది. అక్కడి దాకా వచ్చాక
 అక్కని ఆపి 'అక్కా...! అక్కా....!  అక్కడేదో ఉంది చూడు గాడిదలాగనో / గుర్రంలాగానో ఉంది కదా ' అన్నాను.

 ఈ భయం మహ చెడ్డదండి ఉన్నది లేనట్టుగాను , లేనిది ఉన్నట్టుగాను , వినపడకపోయినా వినిపించినట్టుగాను ఉంటుంది. పాపం మా అక్క నా మాటల ప్రభావం వల్ల అది గాడిద అని నిర్ధారణ చేసింది. ఇక అంతే వెనక్కి
చూడకుండా పరిగెత్తి చిన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఫోను వచ్చిందని చెప్పి... అలాగే గాడిద సంగతి చెప్పాము.....  తాతగారికి ఏమీ అర్థంకాక పనివారిని వెంటబెట్టుకు వచ్చి.... ఇంట్లో అందరినీ లేపేసి హడవిడీ చేసేసి అక్కడ ఏమి లేదు చెట్టుకొమ్మ విరిగిపడిందని తేల్చేసారు.

కానీ అమ్మ ఊరుకుంటుందా " ఫోనొచ్చింది పిలుచుకురమ్మంటే ఇంత రాద్ధాంతం చేస్తారా" అని తిట్ల వర్షం కురిపించడం మొదలెట్టింది..... వెంటనే నేనందుకుని 'అక్కడేదో ఉన్నట్టుంది కదక్కా అంటే అక్కే అది గాడిదే అని చెప్పిందీ' అన్నాను.

దానికి పాపం అందరి నుంచి తిట్లు 'చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపొతే నీకేమయ్యింది..... XXXX.....XXX ' అంటూ.

ఇప్పటికీ ఎప్పుడైన మా అక్కకి ఆ విషయం గుర్తుకు వస్తే మాత్రం ఛాన్స్ వదలకుండా తిడుతుంది....

Thursday, December 15, 2011

నాకే నవ్వొచ్చింది

నాకే నవ్వొచ్చింది

నేను చదువుకునే రోజుల్లో ఒక కథ రాసాను... అది అంతగా హాస్యం పండించకపోయినా ఎందుకో చదువుకుంటే నాకే నవ్వొచ్చింది...

బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో పోస్టు చేసిన ఆ కథ లింకు ఇక్కడ

Wednesday, December 14, 2011

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

మల్లెకన్నా తెల్లనైన అమ్మ మనసుకు వందనం
మంచుకన్న చల్లనైన అమ్మ చూపొక నందనం
ముత్యాలమూటలైన మాటలకు , రత్నాలరాశులైన అండదండలకు అభివందనం
అమృతమయ చేతులకు , అనంతమైన ఆశీర్వచనములకు పాదాభివందనం
అన్నిటికన్నా మిన్నైన అమ్మ ఒడిలోని వెచ్చందనానికి
అమ్మ చూపులోని కరుణకు , అమ్మ చూపించే ప్రేమకు ఆనందమయ జన్మదినం

అమ్మ ఇలాగే కలకాలం సంతోషంగా,ఆనందంగా,  ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటూ
 హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Wednesday, October 26, 2011

దీపావళి శుభాకాంక్షలు


మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు .....




ఈ దీపావళి మీ ఇంట సంతోషపు వెలుగులు నింపాలని,  ఆనందమయ కాంతులు వెదజల్లాలని , ఆరోగ్యభరిత ఆహ్లాదాన్ని అందించాలనీ కోరుకుంటున్నాను.....



Tuesday, October 25, 2011

తెలుగు భాషను మర్చిపోతున్నామా....

తెలుగు భాషను మర్చిపోతున్నామా....

ఏంటీ........................... ఇంతమంది తెలుగువారు నడుంకట్టి బ్లాగులు రాస్తుంటే......
ఏంతోమంది తెలుగువారు చక్కగా తెలుగు మాట్లాడుతుంటే.....
చాలామంది తెలుగు రాయటం , చదవటం  నేర్చుకుంటుంటే ....

ఇలా చెప్పుకుంటూ పోవచ్చు గానీ.... మేమంతా వెర్రివాళ్ళమా  ఏమి.... నీ ఇష్టమొచ్చినట్లు అనడానికి.....

అని నన్ను తిట్టిపోయకండి.........

నేను చెప్పేది ఏంటంటే..... మారుతున్న కాలంతో పాటు మనలో మార్పు సంతరించుకుంది...

అన్నిటిని మెల్లమెల్లగా మన సుఖానికి తగ్గట్టు మార్చేసుకుంటున్నాము.....

కొన్ని మన సౌకర్యాలకు తగ్గట్టు వాడేసుకుంటున్నాము.......

అలాంటి వాటిల్లో ఒకటే ఈ మన ప్రియమైన "తెలుగు" భాష అని నా అభిప్రాయం....

ఇది తప్పయ్యుండొచ్చు కూడా.....కానీ మరి నాకు తోచింది చెప్పాలి/రాయాలి కదా....  ఆ ప్రయత్నమే చేస్తున్నాను....

అసలిదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందటా..... అంటారా....

ఏమీ లేదండీ.... ఈ మధ్యనే "పిల్ల జమిందార్"  సినిమా చూసాను....

దాని ప్రభావం లేండి....... అంటే అదేదో నన్ను మార్చేసిందని కాదు....

అందులో మాష్టారి పాత్ర వేసిన యం.ఎస్.నారాయణ గారి "తెలుగు చచ్చిపొతే ....." డైలాగు నా మనసులో గింగిరాలు గింగిరాలు తిరిగేసి.... ఇలా నా చేత వ్రాయిస్తుంది...

అలోచిస్తే.... మెల్లమెల్లగా తెలుగు తన అస్థిత్వాన్ని కోల్పోతుందేమో అని భయం వేస్తుంది....

ఇది వరకటి రోజుల్లో ఎంత స్వచ్చమైన తెలుగు మాట్లాడుకునేవారం.....


చక్కగా "అమ్మా..! అన్నం పెట్టు.... ఆకలేస్తుంది" అని అడిగే రోజులు పోయాయి...


(నేను ఇంకా అలాగే అడుగుతాను/అంటాను  అని పోట్లాటకి దిగకండి... ఇక్కడ మీ ప్రసక్తి ఎత్తలేదు... ఈసారికి ఇలా వదిలెయ్యండి)

ఇదివరకటి రోజుల్లో వార్తలు ప్రారంభించే ముందు  "నమస్కారం... వార్తలు చదువుతున్నది XXX (శాంతి స్వరూప్)  ముందుగా ముఖ్యాంశాలు" అని మొదలు పెట్టే వారు

(ఆ ముఖ్యాంశాలు అనేది కూడా తర్వాత్తర్వాత వచ్చిందే అంటారా...... సరే అలాక్కానీయండి...)

మరి ఇప్పుడో "Welcome to Morning News/Mid-Night News This is so and so.... ముందుగా Headlines"

ఏ తెలుగులోనే కదా చెప్పాలి వార్తలన్నీ ..... మరి ఆ నాలుగు ముక్కలు కూడా తెలుగులోనే ఏడవచ్చు కదా....

అయిపోగానే  "This is  XXX signing-off"

ఇప్పటి దాకా ఏ  భూ-అంతరిక్ష గ్రహాల ఒప్పందాన్ని Sign  చేసావు నాయనా...

చక్కగా "ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం....!"  ఎటు పోయింది నీ సంస్కారం...

అలా అని నేను ఇంగ్లీషు భాషను ద్వేషించట్లేదు/దుమ్మెత్తిపోయట్లేదు.......

అమ్మలాంటి తెలుగు భాష అవహేళనకు గురి అవుతుంటే నిరసన తెలియజేస్తున్నాను....

ఆ సినిమాలో మాష్టారుగారు చెప్పినట్టు  దెబ్బతగిలితే shit అని అశుద్ధం నొట్లో వేసుకునే వారికి అమ్మ లాంటి తెలుగు విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి...


ఏవీ ఆ వీరి వీరి గుమ్మడిపండ్లు..... ఎక్కడా వినిపించవే ఆ యుగళ గీతాలు....

ఇదివరకు ఎవరైనా కనిపిస్తే పెద్దవారైతే నమస్కారం పెట్టి..... ఆ తరువాత బాగున్నారా ....? భోజనం చేసారా... ? అని అడిగేవారం....

అదే ఈ రోజు ఎదురయ్యారనుకోండి ఎంత పెద్దవారైనా.... "హల్లో అండీ హౌ ఆర్ యూ లంచ్ అయ్యిందా....?" అని మొదలు......


అలా అని లేచిందే మొదలు శుభోదయం....అంటూ ప్రతాపము చూపించేసి గ్రాంధీకం వాడనక్కరలేదు...

కనీసం కొన్ని విషయాలలో అయినా నియమంగా  పాటిస్తే బాగుంటుందేమో.....

మా పిల్లలు పీజ్జాలు, బర్గర్లే తింటారమ్మా అని సాగదీసే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ మమ్మీ డాడీల పీడింపు తప్పదేమో....

అలా అని మరీ విపరీత ఆలోచనలతో గోడ కాగితాలు (Wallpapers)...... కిటికీలు(Windows).... అంటూ రాసినా కాసేపు నవ్వొస్తుందేమో కానీ... మాట్లాడుకోవడానికి బాగోదు.....


టీ, కాఫీలను ఎలాగో తేనీయము,పానీయము అంటూ పిలవలేము కదా..... మరి అనగలిగిన , మాట్లాడగలిగిన వాటిని ఖూనీ ఎందుకు చేయడం అనేదే నా ప్రశ్న...........


ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత అయ్యేట్టు ఉంది...... కుదిరితే ఇంకో టపాలో
నా గోడు వెళ్ళబోసుకుంటాను.....

ఇప్పటికి ఉంటాను  ................


ఏమిటీ చూస్తున్నారు టాటాలు బై బై లూ గట్రా అంటాననా.....

ఇంతా రాసి ఆఖరున నన్ను నేనే గొయ్యి తీసి పాతేసుకుంటానా చెప్పండి......

Friday, September 30, 2011

Mystery of 1751 and 1752

ఏంటీ ఈ మిస్టరీ అనుకుంటున్నరా...?

అయితే ఇక్కడ క్లిక్ చేయండీ.....


అబ్బో.... మాకెప్పుడో తెలుసులే ....నువ్వు అందరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావనుకుంటే....మీ ఇష్టం...


కానీ ఒక మాటు మళ్ళీ చూస్తే పొయెదేమి లేదు కదా...అనుకుంటున్నరా.... ఇంకెదుకు ఆలస్యం మరి క్లిక్ చేసేయండీ...

Thursday, September 29, 2011

బుడతడి కథలు - బుడతడు చేయని తప్పు

బుడతడికి బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క ఉన్నారు.

వాడు పుట్టినప్పటి నుంచే వస పోయకుండానే  ఊ .. ఊ అంటూ తెగ ఊసులు చెప్తూ ఉండేవాడని వాళ్ళ అమ్మ ఎప్పుడూ చెప్పుకొని మురిసిపోతూ ఉంటుంది

కాకపొతే ప్రశ్నలపుట్ట కదా పుట్టినప్పటినుంచే ఎవరైనా చూడటానికి వస్తే బొటనువేలు ఎత్తి (ఏంటీ, ఏందుకు అన్నట్లుగా)ఎదో అడిగే ప్రయత్నం చేసేవాడంట. వచ్చినవారు సమాధానం చెప్పే దాకా వదిలేవాడు కాదంట.

ఇక వాడి దగ్గరికి వస్తున్నారంటే ఏదో ఒక విషయం గుర్తు పెట్టుకొని రావల్సిందే అన్నమాట.

ఇదిలా ఉండగా వాడు కాస్త పెద్దయ్యి నడక నేర్చాడు, అన్నో , ఇన్నో మాటలు కూడా మాట్లడేస్తున్నాడు.

వాళ్ళ  బామ్మ వాడికి శతకాలు నేర్పిద్దామని సుమతీ శతకంతో మొదలుపెట్టింది.

చిన్నవాడు కదా రోజుకి పద్యంలోని ఒకటి, రెండు మాటలు నేర్చుకుంటే చాలు అని రోజుకి ఒక రెండు మాటలు మాత్రమే చెప్పేది.

బాగుందిలే చిన్నవాడు నేర్చుకుంటాడనుకుంటే తప్పే మరి..... ఎందుకో ముందు ముందు మీరే చదువుతారుగా...

ఒక రోజు వాడు వాళ్ళ  నాన్న దాచుకున్న విలువైన వస్తువు పగలగొట్టాడు.
(పాపం కావాలని కాదు లెండి)
ఇక అంతే నాన్నగారు కోప్పడతారేమో అని భయంతో ఉరుక్కుంటూ వచ్చి అటూ ఇటూ దాక్కోవడం మొదలెట్టాడు కాసేపు అమ్మ కొంగు వెనక, కాసేపు నాన్న రాసుకునే బల్ల కింద, ఇంకాసేపు తాతయ్య పడక కుర్చీ వెనక , బామ్మ నులక మంచం కిందా ఇలా...ఎవరడిగినా ఏంటనేది చెప్పడే ఇంతలో నాన్నగారు ఆ వస్తువు పగిలిన విషయం గమనించారు...
బుడతడి అక్కను పిలిచి నువ్వుగానీ చేసావామ్మా అని అడిగారు (పెద్దలైతే చెప్పెస్తారు కదా) అందుకు అక్క "లేదు నాన్నా నేను ఇటువైపుగా రానే లేదు" అని చెప్పింది.

ఇక వీడికి భయం పట్టుకుంది, ఇక నన్నే పిలుస్తారు అని ఎలాగా దేవుడా అని ఇంతలో నాన్న నుంచి పిలుపు రానే వచ్చింది... అందరికీ ఏమీ అర్ధంకాక ఏమైందని విషయం కనుక్కున్నారు.

అమ్మ పిలవడం మొదలెట్టింది, బుడతడికి కొంచం ధైర్యం వచ్చింది.
అమ్మకు చెప్తే ఎలాగో అలా నాకు తిట్లు తప్పిస్తుందిలే అనుకున్నాడు.

మెల్లగా బామ్మ మంచం కిందనుంచి బయటికి వచ్చి అమ్మ దగ్గరికి పరుగు తీసాడు.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఆస్థాన పండితుల సమావేశం లాగా ఇంటిల్లిపాది అక్కడే ఉన్నారు.

పాపం ఇప్పుడు తప్పించుకోనూలేడు.

అమ్మ దగ్గరకి పిలిచింది. "అరే బుడతాయ్! ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే నిజాయితీగా ఒప్పేసుకుంటే శిక్ష తప్పుతుంది కదరా మరెందుకు అలా దాక్కుంటున్నవ్" అని అడిగింది.

వాడు ఇక వాడి వాదన మొదలెట్టాదు "నేను అది కావాలని విరగ్గొట్టలేదు కాబట్టి నన్ను ఏమీ అనకూడదు కదా.......
కానీ నాన్నగారికి కోపం వస్తే ఏమీ అలోచించరని బామ్మ మొన్న నీతో అంది కదా...................!
అది గుర్తొచ్చి ఎక్కడ నాన్నగారు నన్ను ముందు తిట్టేస్తారో అని భయపడి పరిగెత్తాను" అన్నాడు.

దానికి ఆశ్చర్యపోవడం వారిద్దరి వొంతయ్యింది.
ఇక బామ్మ అందుకుని "ఆరి భడవా.... నీకెన్ని తెలివితేటలు రా.....మేము అన్న మాట అటుంచి నువ్వు కావాలని చేయకపొయినా నీ చేతిలోనే అది పగిలింది కదా అందుకు తప్పు నీదే కదా మరి అలా పరిగెత్తదం తప్పు కదా" అంది.

అప్పుడు వాడికి ఏదో గుర్తొచ్చినట్టు చిటిక వేసి "అయినా సరే నేను చేసింది తప్పు కాదు అన్నాడు"

దానికి ఇక తాతయ్యకు విసుగొచ్చి "నువ్వు అక్కడే ఉండి నాన్నకు విషయం చెప్తే నాన్న నిన్ను తిట్టరు కదా, కానీ నువ్వలా చేయలేదు కాబట్టీ నువ్వు చేసింది తప్పేరా బుడతా" అన్నారు.

అందుకు బుడత "లేదు తాతయ్యా! లేదు, నేను తప్పు చేయలేదు, అక్కడి నుంచి పరిగెత్తడం తప్పు కాదు" అన్నాడు.

అందుకు నాన్నగారు "పెద్దాచిన్నా ఉండక్కర్లేదు రా! తప్పు చేసి పైగా చేయలేదని తాతయ్యకే ఎదురు చెప్తావా" అని గద్దించేసరికి

బిక్కమొఖం వేసుకొని " మరి బామ్మే కదా 'తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతీ' అని రోజంతా చెప్పింది" అందుకని బాగా అలోచించి తప్పించుకున్నాను  నా తప్పేంటి" అని రాగమందుకున్నాడు.

అందుకు వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

వాడేమో ఉడుకుమోత్తనం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఇలా వాడు ఎప్పుడూ తప్పు చేయడు, చేసినా ఒప్పుకోడు.
చూసారుగా ప్రతి ప్రశ్న కి ఏదో ఒక సమాధానం ఎలా టకటకా చెప్పేసాడో

అదండీ మన బుడతడు చెయ్యని తప్పు.

మరిన్ని కబుర్లకోసం వేచియుండండి...

Tuesday, September 27, 2011

బుడతడి కథలు

బుడతడి కథలు

అనగనగా ఒక ఊర్లో ఒక బుడతడు ఉండేవాడు.
వాడు వట్టి వాగుడుకాయ మరియు ప్రశ్నలపుట్టానూ....

వాగుడుకాయ అంటే ఏదిపడితే అది మాట్లడేరకం కాదు....
వాడిని వాడు రక్షించించుకోవడానికి ఏదైనా క్షణం లో సృష్టించి చెప్పగల ఘనుడు....

ప్రశ్నలపుట్ట అంటే వాడికి ఏదైనా తెలియకపొతే అది తెలుసుకునే దాకా నిద్రపోడు... అంతవరకే అయితే బాధే లేదు.. కానీ దాని గురించి చెప్పే దాకా ఎదుటివారిని నిద్రపోనివ్వడు...

ఇక వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ చిట్టి పొట్టి కథలన్నీ చదవాల్సిందే మరి...

Sunday, September 18, 2011

అమ్మ చిలిపితనం - 3 ఆరుద్ర పురుగు

అమ్మ చిలిపితనం - 1
అమ్మ చిలిపితనం - 2

అమ్మ స్కూలుకెళ్ళే రోజుల్లో ఎన్ని కోతి వేషాలు వేసేదో చెప్పాలంటే.... నిజంగా నేను ఒక స్నేహితురాలి గురించి చెప్పినట్టు చెప్తేనే... చాలా బాగా చెప్పగలుగుతానేమో.....

అది వర్షాకాలం. రాత్రి బాగా వర్షం పడి పొద్దున్నే ఆగిపోయింది.
అమ్మకి బడి ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. (ఎవరికైనా చిన్నప్పుడు అదే ఆలోచన ఉంటుంది కదా)

వర్షాకాలం వస్తే బడి ఎక్కువసార్లే ఎగ్గొట్టొచ్చు అని ఆశ. కానీ ఇలా రాత్రి పడి, పొద్దుటికల్లా ఆగిపోయే వర్షం అంటే చచ్చేంత కోపం.బడి ఎగ్గొట్టే వీలుండదు కదా...

అలా ఆ వర్షాన్ని తనివితీరా తిట్టుకుంటూ స్కూలికి వెళ్ళింది అమ్మ. స్కూల్లో ప్రేయర్ అవుతుంది. అందరూ లైనులో నిల్చుని ఉన్నారు. మైకులోంచి శబ్దం వినిపిస్తుంది "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్ ...స్టాండెటీజ్.... అట్టేన్షన్........స్టాండెటీజ్.... అట్టేన్షన్..... ప్రేయర్ పొజిషన్" అని.

వర్షా కాలంలో ఆరుద్ర పురుగులు చాలా కనబడేవి. మా చిన్నప్పుడు కూడా వర్షం రాగానే ఎక్కడినుంచి వచ్చేవో తెలీదు కాని ఎర్రెర్రగా సిల్కు చర్మంతో....పట్టు పురుగులలాగా........ ముట్టుకుంటే మెత్తగా......చిన్న చిన్నగా పాకుతూ........ అసలు భలే ఉండేవి....... వాటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని.... చేతి మీద కాసేపు పాకుతుంటే మురిపెంగా చూసుకుంటూ......... జాగ్రత్తగా అగ్గి పెట్టెల్లో దాచిపెట్టుకునే వాళ్ళం. ఒకటి రెండు రోజులు బాగానే చూసుకునే వాళ్ళం.......... తర్వాత మరి ఆ పురుగులు ఎలా పోయేవో తెలియదు...... చిన్నపిల్లలం కదా..... వాటి గురించి గుర్తు కూడా ఉండేది కాదు....

ఇక అసలు విషయానికి వస్తే ఈ "స్కూల్ స్టాండెటీజ్.... అట్టేన్షన్" హడావిడిలో ఆ ఆరుద్ర పురుగులు తొక్కిళ్ళలో పడి చనిపోయాయంట.
ఇంక మా అమ్మ తన బుద్ధి బలం ఉపయోగించి వాటిని జాగ్రత్తగా ఏరి దాచి పెట్టి...... స్కూల్ ఇంటెర్వెల్ లో ఆ తొక్కిన తన స్నేహితులందరినీ తీసుకొని ఒక మూలకు వెళ్ళి గొయ్యి తవ్వి........ ఈ చనిపోయిన ఆరుద్ర పురుగులను ఆ గోతి లో పాతిపెట్టి...... మట్టి కప్పిందంట.

అంతటితో ఆగక....... తన స్నేహితులతో "ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే కాసేపు గట్టిగా ఏడవాలబ్బా...... (ఇది సొంత తెలివి లేండి......మామూలుగా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా...! అది ఆత్మ శాంతి కొరకు చేసే పని అని అమ్మ ఆలోచన) పాపం ఆ ఆరుద్ర పురుగులు చచ్చిపోయాయి కదా..... వాటి ఆత్మ శాంతించాలంటే మనం కాసేపు గట్టిగా ఏడవాలి" అని చెప్పిందంట.

ఇక చూస్కోండి ఆ స్నేహితులందరూ, అమ్మ కూడా గట్టిగా ఆ ప్రదేశం దద్ధరిల్లేలా ఏడ్చారంట...... అంతటితో ఆగితే సరా........
అమ్మ ఆ స్నేహితులందరినీ తీస్కెళ్ళి ఆ స్కూల్లో ఉన్న జామచెట్ల జామకాయలను కోసి (పిందెలనే లెండి) నాలుగు ముక్కలు చేసి........ ఆ ఆరుద్ర పురుగులకు పిండం పెట్టిందంట.........  అయ్యో రామా.... అదేమి చోద్యం అనుకునేరు.... అక్కడితో కూడా ఆగకుండా..... దానికి 3వ రోజు కర్మలు, 5వ రోజు కర్మలు...... పెద్ద కర్మ అన్నీ చేసి....ఆ జామ పిందెలన్నీ అయిపోయేదాకా పిండాలనీ... తద్దినాలనీ.... తనకు తెలిసిన విజ్ఞానమంతా ప్రదర్శించి..... అనకూడదు కానీ..... నానా యాగీ చేసిందంట.........

నిజంగా దేవుడేగనక ఇదంతా చూసి ఉంటే అమ్మ దెబ్బకు ఆ ఆరుద్ర పురుగులకి ఖచ్చితంగా "చిరంజీవులు కమ్మని" వరమిచ్చేవాడేమో..................

ఇదండీ.... అమ్మ ఆరుద్ర పురుగులకి ఏర్పాటు చేసిన సంతాప సభ.......

ఇంకా మరెన్నో తప్పులు, ఒప్పులు, మిడి మిడి జ్ఞానంతో చేసిన పనులన్నిటినీ రాబొయే పోస్టుల్లో తెలుసుకుందాం.......

Friday, September 16, 2011

అమ్మ చిలిపితనం - 2

అమ్మ చిలిపితనం - 1


అమ్మ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది.... ఆ అల్లర్లన్నీ చెప్పాలంటే ఇలా ఒక్కో పోస్టూ రాయాల్సిందే....
మరి అంతా... ఇంతా... అల్లరి కాదంట... అమ్మమ్మ చెప్తుంది....

ఇంక అసలు విషయానికి వస్తే....
అమ్మ స్కూల్లో కూడా బాగా అల్లరి చేసి టీచర్లతో దెబ్బలు తినేది.
అప్పట్లో గురువులంటే భయం, భక్తి ఎక్కువే కాబట్టి.. కొన్ని కొన్ని సార్లు టీచర్లు చూడకుండా జాగ్రత్తపడుతూ ఉండేదిట..... దొరికిపొతే దెబ్బలే కదా...

ఒకసారి అమ్మకి, అమ్మ స్నేహితులకి మధ్య ఏదో గొడవ జరిగిందంట....
చిన్నప్పుడు గొడవ పడితే వాళ్ళకి ఏదో ఒక హాని చేయాలి అనిపించడం సహజం కదా.... (కావాలని కాకపొయినా)

అమ్మ ఆ రోజంతా బాగా ఆలోచించసాగింది. ఈ లోగా ఇంటి బెల్లు కొట్టేసారు. ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టింది.
స్కూలు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక దులిదొండకాయల చెట్టు కనబడింది (దులిదొండకాయలు అంటే అవేనండీ వాటి పసరు రాస్తే ఒకటే దురద పుడుతుందే... ఆ గుర్తొచ్చిందా... అదే అదే.. అయ్యో.. గుర్తురాలేదా..... మరి మీరేమంటారో... నాకు తెలియదులెండి...)

వాటిని చూస్తూ అలా కొంత దూరం నడిచింది...

ఇంక మెదడులో ఠంగ్ మని గంట మోగింది..... అనుకున్నదే తడవుగా "అక్కా! అక్కా! స్కూల్లో ఒక బుక్కు మర్చిపోయానే... నువ్వు నడుస్తూ ఉండు , నేనెళ్ళి తెచ్చుకుంటాను..." అని పెద్దమ్మకి చెప్పి వెనక్కి పరిగెత్తింది...

కొంత దూరం పరిగెత్తాక ఆ చెట్టు దగ్గర ఆగి ఎవరూ చూడకుండా కొన్ని కాయలు కోసి పుస్తకాల మధ్యన దాచుకొని స్కూలు వైపు పరుగు తీసింది.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాచ్ మెన్ ఉన్నాడు.
అమ్మని చూస్తూనే "ఏంటి అమ్మయిగారు! ఇంటికి వెళ్ళకుండా స్కూలుకి వస్తున్నారు" అని అడిగాడు.

మా అమ్మ అబద్దాలు పూలు అల్లినంత తేలికగా అల్లుతుంది.
"నేను లెక్కల పుస్తకం క్లాస్ లో మర్చిపోయాను అందులో ఇచ్చిన లెక్కలు చెయ్యకపొతే రేపు టీచర్ కొడుతుంది" అని చెప్పింది.

అందుకు వెంటనే వాచ్ మెన్ కరిగిపోయి తాళం తీసి "తొందరగా వచ్చేయండీ..! నేను ఇక్కడే ఉంటా" అన్నాడు....

ఇక అమ్మ ఒక్క పరుగున క్లాసులోకి వెళ్ళి ఆ స్నేహితులు కూర్చునే, రాసుకునే బల్లల మీదా ఆ కాయలను బాగా రుద్ది ఏమీ తెలియని దానిలా బ్యాగులోంచి ఒక పుస్తకం తీసి చేతిలో పట్టుకుని బయటకి నడిచింది.

వాచ్ మెన్ అమ్మని చూసి "దొరికిందా అమ్మయిగారూ పుస్తకం?" అని అడిగితే
"ఆ..! దొరికిందంటూ' ఒక్క ఉదుటన ఇంటికి పరుగు తీసింది.

ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు.... ఒక్క అమ్మకు తప్ప.......

మరుసటి రోజు మామూలుగానే స్కూలుకి వచ్చింది...... ఆ గొడవ పెట్టుకున్న స్నేహితురాళ్ళు కూడా వచ్చారు....

ప్రేయర్ అయ్యాక పిల్లలందరూ క్లాస్సులోకొచ్చారు.
ఫస్టు పీరియడ్ మొదలయ్యింది......... ఒక 5నిమిషాల తరువాత ఆ పిల్లలు ఒకటే గోక్కోవడం మొదలు పెట్టారంట...... ఒకటే దురద పాపం ఏంచేస్తారు వాళ్ళు మాత్రం....టీచర్ చూసి బయటికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కు రండి అని అరిచిందంట..... ఏమి చేస్తే ఏం లాభం అవి అలా పొయేవి కాదు కదా.......
ఇక ఆరోజంతా అలా గోక్కుంటూనే ఉన్నారంట పాపం....


అమ్మకి మొదట కాసేపు నవ్వొచ్చినా తర్వాత చాలా బాధపడిందంట.......
తప్పు చేసినప్పుడు మనకి మనమే "అయ్యో! అలా చేయకుండా ఉంటే పోయేది కదా!" అని అనుకుంటాం చూడండి...... అదేనండీ పశ్చాత్తాపం అంటారే....అదే.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా...! ఆ దేవుడు మా అమ్మ తెలియనితనంతో చేసిన తప్పులన్నీ మన్నించాలని కోరుకుంటున్నాను....

మరి ఆ స్నేహితుల సంగతీ అంటారా... స్కూల్లో స్నేహితులంటే ఎంతసేపు కొట్టుకుంటారు చెప్పండి? మా అంటే ఒకటి లేదా రెండు రోజులు అంతే కదా...... వీళ్ళు అంతే కాకపోతే ఆ దురదలు తగ్గడానికి ఒక వారం పట్టిందనేది మర్చిపోవాలి మరి......

Thursday, September 15, 2011

అమ్మ చిలిపితనం

మా అమ్మ చిలిపితనం

ఏంటీ...? అమ్మ చిలిపితనం ఏంటి....? పెద్దంతరం, చిన్నంతరం లేదా అనుకోకండి...
అమ్మ తను పెద్దయ్యాకే మనకి తెలుసు కాబట్టి అమ్మ అంటే శాంతం, ప్రేమ, ఆప్యాయత,చిరు కోపం కలగలిసిన దేవత అని మాత్రమే తెలుసుకోగలుగుతాం.

మరి అమ్మ తన చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలియాలంటే అమ్మ బాల్యం గురించి తెలుసుకోవలసిందే కదా....
అమ్మకి మనం స్నేహితులమే ఐతే ఇది అంత కష్టపడాల్సిన పని కాదని నా ఆలోచన....మీరేమంటారు...?
(మేమేదో అంటాం, అనుకుంటాం గానీ ముందు ఆ చిలిపితనం గురించి తొందరగా చెప్పూ అంటారా...)

అమ్మ చిన్నప్పుడు బాగానే చదివేది కానీ లెక్కల్లో ఎప్పుడూ కొన్ని తక్కువ మార్కులే వచ్చేవి....
పెద్దమ్మేమో ఇంట్లో లీడర్ టైపు(బాగా చదివేది కూడా)
స్కూల్లో రిపోర్టు ఇవ్వగానే పెద్దమ్మ ఇంట్లో చెప్పేసేది......
ఇంక అమ్మకేమో ఎక్కడలేని భయం తాతయ్య ఎక్కడ కొడతారో అని (చదువు విషయం లో కొంచం స్ట్రిక్ట్ లేండి)
కొట్టడం అంటే అచ్చంగా కొట్టడమే కాకపోయినా ఏదో ఒక రకం పనిష్మెంట్ ఉండేది.

పెద్దమ్మ లీడర్ అని చెప్పుకున్నాం కదా... అందరి రిపోర్టులు వరసగా పెట్టుకొని తాతయ్య గారి ముందు నిల్చొని టక టకా అన్ని సబ్జెక్టుల మార్కులు చదివేదంట... దాన్ని బట్టి ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఉండేదంట...

ఎప్పుడూ అమ్మ పెద్దమ్మని బతిమిలాడుకునేదిట  ఈ ఒక్కసారి లెక్కల మార్కులు ఎక్కువ చదవమని ఊహూ.. పెద్దమ్మ ససేమీరా ఒప్పుకునేది కాదు...

ఇదిలా ఉండగా ఒకసారి పరీక్షలలో అమ్మకి బాగ తక్కువ మార్కులు వచ్చాయంట (లెక్కలోనే లెండి)
ఇక చూస్కోండి "ఎలా రా దేవుడా! ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా ఉంది పరిస్థితి. రిపొర్టు చూపదామా నాన్న చేతి దెబ్బలు తినాలి, పోని వద్దంటే అక్క రాక్షసి ఊరుకోదు" అని అనుకుంటూ స్కూలు నుంచి వస్తుంది.

ఇంతలోనే పెద్దమ్మ "ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా ఎన్ని మార్కులు వచ్చాయి" అని అడిగింది.

అందుకు అమ్మ "ఇచ్చారు కాకపొతే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అక్కా ప్లీజ్.. ఈ ఒక్కసారి నాన్నకి చెప్పకే నీ పనులన్నీ నేనే చేస్తాను" అని వేడుకుంది.
(అప్పట్లో పనులన్నీ భాగాలుగా పంచుకుని చేసేవారంట)

అందుకు పెద్దమ్మ ఊరుకుంటుందా అస్సలు ఒప్పుకోలేదు.

అమ్మ బాగా ఆలోచించింది.స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక పెద్ద పాడుబడ్డ బావి ఉండేదిట (పల్లెటూరు కదండీ...)  అమ్మకి వెంటనే ఒక ఉపాయం తట్టింది అనుకున్నదే తడువుగా ఎవరూ చూడకుండా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ బావిలో పడేసింది..

ఎగురుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి "ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదుగా ఇప్పుడెలా చెప్తావో చూద్దాం" అని ఎక్కిరించిందంట..

పెద్దమ్మకి కోపమొచ్చి "ఉండు అప్పతో నీ పేరు చెప్పి, నిన్ను తన్నిస్తాను" అన్నదంట.

అందుకు అమ్మ "నీ దగ్గర సాక్షం లేదుగా..... నాకేం భయం... చెప్పుకో.... చెప్పుకో... చెప్పు తీసి తన్నిచ్చుకో" అన్నదంట.

అందుకు మా పెద్దమ్మకి బాగ ఉక్రోషం వచ్చి తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పడం, తాతగారు కొట్టడం.... మళ్ళీ టీచరికి 5రూపాయలు ఫైను కట్టి రిపోర్ట్ కొత్తది తయారుచేయించుకోవడం మాములే లెండి....

ఇలా ఇంకా చాలా ఉన్నాయి ...... ఒక్కొక్కటిగా పోస్టు చేస్తాను.....

నచ్చనివారు దయచేసి కామెంట్ రాయొద్దని, రాసినా అది పబ్లిష్ చేయబడదని మనవి.

Saturday, September 10, 2011

ఆమె కథ - 6 (ఆఖరి భాగం)


ఇక చదవండి....
                                                           
                                                           ఎప్పటిలాగే మనవాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగి రెండో సంవత్సరం రానే వచ్చింది. మళ్ళీ 30,000 ఎలాగా అని ఆలోచిస్తుంటే దేవుడు వరమిచ్చినట్లు ప్రభుత్వం వారు స్కాలర్ షిప్ ప్రకటించటం , కాలేజ్ వారు ప్రథమ, ద్వీతీయ ర్యాంకులు  వచ్చిన వారికి నగదు బహుమతులు ఇవ్వడంతో కష్టాలు తీరినాయి. ఎలాగైతేనేమి ఆ పిల్లాడు కష్టపడి 4సం||లు చదివి ఇంజనీర్ అయ్యాడు. అతడి ప్రతిభను గమనించిన ఒక బహుళ సంస్థల కంపెనీ అతనికి నెలకు 30,000 ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చింది. ఇక వారి ఆనందానికి అవధి లేదు. అతడు కూడా వారి సహాయాలను విస్మరించక అతడి ఖర్చుల నిమిత్తం ఉంచుకుని మిగితా జీతం వీరికే పంపసాగాడు.

                                     ఇతడి ప్రతిభాపాటవాలు, కష్టపడి పని చేసే తత్వం గమనించిన కంపెనీవారు ఇతనిని విదేశానికి కూడా పంపారు. అతడు అక్కడ పని చేస్తూనే ఈ పల్లెలో వీరి కోసం పెద్ద స్థలం కొని ఆ పిల్లలందరి బాధ్యత తనే తీసుకున్నాడు.

                                  ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడామెకు 80సం||లు. కొంతకాలం క్రితమే తాత కన్నుమూసాడు, తాత పోయిన మూణ్ణెళ్ళకే  ముసలామె కూడా చనిపోయింది. వారిద్దరూ పోతూ పోతూ పిల్లలను ఆమె చేతిలో పెట్టి పోయారు.

                                  క్రమేణా పిల్లలందరూ బాగా ఎదిగి ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన పెద్దవాడు ఆ పిల్లలందరితో కలిసి "XXX అనాథ శరణాలయం" మరియు "XXX వృద్ధాశ్రమం" కట్టించాడు.

                                    ఇప్పుడామె పనులన్నీ మానేసింది. అన్నిటినీ చూసుకోవడానికి మనుషులున్నారు. ఆమె పని పర్యవేక్షించడం మాత్రమే. పిల్లలందరూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒక వారం వుండి వెళతారు. ఆమె వారి కోసం ఎన్నో పిండి వంటలు చేయించి వారు వచ్చినప్పుడు స్వయంగా తానే వడ్డించేది. వారు ఒకరొకరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.

         జీవితానికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏమంటారు? 

                                 ఈ సంస్థలకు ప్రభుత్వం నుండి కూడా కొంత ధనం లభించసాగింది. ఆ 10 మంది పిల్లల దయ వల్ల ఇప్పుడు అది ఎన్నో శాఖలుగా విస్తరిస్తుంది. ఏ  శాఖలోలైనా శరణాలయం, ఆశ్రమం పక్క పక్కనే ఉండటంతో పిల్లలు తాతయ్య, అమ్మమ్మలతో... పెద్దలేమో పిల్లలతో ఆనందంగా గడపసాగారు.

                  వీరి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ సంస్థ స్థాపకులను అభినందిస్తూ  "XXXX" అవార్డుతో సత్కరించింది. పెద్దవాడు ఆమెను వెంట తీసుకెళ్ళి ఆ అవార్డు గవర్నరుగారి చేతుల మీదుగా ఆమెకు ఇప్పించాడు.

                              ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి "ఈ అవార్డుకు అసలు హక్కుదారు నేను కాదు, ఒక 10మంది పిల్లలను చేరదీసిన అమ్మానాన్నలది" అంటూ తాత కథ వివరించింది.

                              ఇదంతా వింటున్నవారందరి కళ్ళు చెమర్చాయి. కొందరి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి. కానీ, ఇద్దరి భ్రుకుటులు మాత్రం ముడిపడ్డాయి. వారే కొడుకు, కోడలు. వెంటనే ఆ పల్లెకు వచ్చారు. ఆమె ఉన్నతిని చూస్తూ ఏమనుకున్నారో ఏమో తెలీదండీ "మాతో రా అమ్మా!" అంటే "మాతో రండి అత్తయ్యా!" అని ఒకటే గొడవ. మనవడికి కొడుకు పుట్టాడట. విని సంతోషించింది.

                              "మీరు ఇచ్చిన గది చాలు బాబూ నాకు. ఆ సొమ్ము కూడా నాకు అక్కర్లేదు" అంటూ 20,000 తీసి వారి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  ఇదంతా తెలుసుకున్న మనవడు ఆమె వద్దకు వచ్చి "అమ్మమ్మా! నా తండ్రి చేసిన తప్పుకు నేను క్షమాపణలు చెప్పుకుంటాను. నా భాద్యతగా మా ఊరిలోని మీ సంస్థయొక్క బాగోగులు నేను చూసుకుంటాను" అని అన్నాడు.

పోనిలే మనవడైనా మంచివాడిగా మిగిలాడు అని సంతోషించి అలాగే కానిమ్మంది.

ఇదంతా గమనించిన ఆమె కొడుకూ, కోడలు "మమ్మల్ని క్షమించండీ" అంటూ పాదాలు పట్టుకున్నారు.

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా, అందులోనూ అమ్మ మనసు, వారిని క్షమించింది. ఆ రోజు నుంచి వారు కూడా అక్కడే ఆశ్రమంలో ఉంటూ అక్కడి పనులు చూసుకుంటున్నారు.

కాలం మనెవ్వరి నేస్తం కాదు కదండీ మన కోసం ఆగకుండానే పరిగెత్తుతూ, నీకంటే నే ముందంటూ తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళింది.

"ఆమె" ఇప్పుడు లేదు, కానీ ఆమె ఆశలు, ఆశయాలు అన్నీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాయి.

మరి మనం ఏ మాత్రం పక్కవారికి సహాయం చేస్తున్నాం. ఒక్కసారి పరీక్షగా చూడండి ఎందరో మన సహాయం కోసం వేచియున్నారు.
కదలండి.... కాపాడండి.... "మనుషులం" అని చాటి చెప్పండి.  


ఆమె కథ పూర్తిగా చదవడానికి ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి
ఆమె కథ


   

Friday, September 9, 2011

ఆమె కథ - 5

ఆమె కథ -1                                                   
ఆమె కథ - 2
ఆమె కథ -3
ఆమె కథ - 4     
ఇక చదవండి....
                                                      ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది "ఏమీ లేదు నాన్నా, ఇన్ని రోజులూ నేనూ, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్త, కొడుకు, కూతురు ఏ ఒక్కరూ నన్ను చూడలేదని ఎంతో బాధపడేదాన్ని. ఒకరు నన్ను చూసేదేంటి? నన్ను నేనే చూసుకుంటాను అనుకొని పనులు చేసుకున్నాను. కానీ "నా కోసం నేను బ్రతికితే అది స్వార్ధం అవుతుంది, పరుల కోసం నేను బ్రతికితే అది పరమార్ధం అవుతుంది" అని గ్రహించలేకపోయాను". అని తన కథంతా తాతకు చెప్పి ఇలా అడిగింది.

                                  "ఇప్పుడు చెప్పు నాన్నా! నేను మీకు ఎలా సహాయపడగలను. నన్నూ మీలో చేర్చుకుంటారు కదా?"

                                "తప్పకుండా తల్లీ! నీ వంతు సహాయం నువ్వు కూడా చెయ్యి, ఎవరి పుణ్యం వారిది, నాతోరా మా ఇల్లు చూపిస్తా" అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు.

                                                         తాతది పూరి గుడిసె అందులో ఒక పక్క పొయ్యి మరో పక్క నులక మంచం ఉన్నాయి. ఇంటి వెనక భాగాన ఉంది ఆ పిల్లల గది. పిల్లలు పండగ రోజు కదా ఆడుకుంటున్నారు. ఆ ఇల్లు, ఆ సందడీ చూసి ఆమె ఎంతో ఆనందించింది. తను కూడా ఎలాగైనా వీరికి సహాయపడాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి మెల్లగా ఇంటిదారి పట్టింది.

                                                     ఆ రాత్రంతా బాగా ఆలోచించి తను ఉంటున్న గది అమ్మేసి ఆ పిల్లలతో పాటే ఉందామని నిశ్చయించుకుని నిశ్చింతగా నిద్రపోయింది. ప్రొద్దున్నే లేచి గబగబా పనులు చేసుకుని ఇంటామెతో "అమ్మా! ఇంకా ఏమైనా ఇళ్ళుంటే చెప్పమ్మా చేస్తాను" అని వెళ్ళిపోయింది.

                                               గుడిసె వద్దకు వచ్చిన ఆమెను వారందరికీ పరిచయం చేసాడు. ఆమె తీసుకున్న నిర్ణయం వారందరికీ నచ్చింది. ఆమెను కూడా వారిలో ఒకరిగా స్వీకరించారు. ఆమె కుడా ఎక్కువ గంటలు పనిచేయనారంభించింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు పోస్టాఫీసు లో వేసింది, పిల్లల కోసమై.

కాలం గడుస్తున్నా కొద్దీ పిల్లలు పెద్ద వారు కాసాగారు. వారో వీరో సహాయాలు కూడా చేస్తున్నారు. ఆ పిల్లల్లో పెద్దవాడు బాగా చదివి వాళ్ళ ఊళ్ళోని బడిలో ఫస్టు వచ్చాడు.

                               అబ్బా! అనుకోకండీ లక్ష్మి లేనిచోట సరస్వతి తప్పకుండా ఉంటుంది.

                                                     వాడిని అదే ఊరిలోని కళాశాల వారు ఉచితంగా చేర్చుకున్నారు. పుస్తకాలు కూడా వారే ఇచ్చారు. మొత్తానికి పెద్దవాడి చదువు గాడిలో పడింది. ఇక దిగులేముంది అనుకుంటూ వారు అలా 2సం||లు గడిపారు. వాడు పై చదువుకు వచ్చాడు. మంచి ర్యాంక్ వచ్చినా 30,000 లేనిదే కాలేజీలో చేర్చుకోమన్నారు మేనేజ్జ్మెంట్ వారు. ఎంత వెతికినా అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలో అర్ధం కాలేదు వారికి.          

                                                                ఎవరైనా 100, 200 అంటే సహాయం చేస్తారు వేలకు వేలు చెయ్యరు కదా! ఇంతలో ఆమెకో ఆలోచన వచ్చింది. తను పోస్టాఫీసులో వేసిన డబ్బు ఇప్పటికి 40,000 అయింది కదా అవి తీద్దాం అంది. అవి తీస్తే మిగితా పిల్లల గతేం కానూ అన్నారు మిగితావారు. ఏదైతే అదవుతుంది లెమ్మని 30,000 ఫీజు కట్టి . 5,000 హాస్టల్ కి కట్టి ఆ సంవత్సరం చదువు వెళ్ళదీసారు.

ఆఖరి భాగం కోసం వేచి చూడండి...

Thursday, September 8, 2011

ఆమె కథ - 4

ఆమె కథ -3

"నేను సంపాదించేది నా కోసం కాదమ్మా!"
ఒహో ఇతనిది కూడా నా లాంటి బతుకే కాకపోతే కొడుకేమైనా డబ్బుకి వేధిస్తాడేమో అనుకుంది.
"నీ కొడుకుల కోసమా నాన్నా ఈ కష్టం?" అని అడిగింది.
"కాదమ్మా అదో పెద్ద కథ. అయినా అదంతా నీకెందుకులే"  అన్నాడు తాత.
"అదేంటి నాన్న అలా అంటావ్ నేను నీ కష్టం తీర్చగలనో లేదో కాని చెప్తే వింటాను కదా, నీ గుండె బరువైనా తగ్గుతుంది" అని అర్ధించింది.
"సరేలే విను. నేను మొదట పండ్లు మాత్రమే అమ్మేవాడిని. రోజంతా అమ్మగా వచ్చిన డబ్బు వీధి చివరన కూర్చుని లెక్కపెట్టుకునే వాడిని. ఇదిలా ఉండగా ఒక రోజు వీధి చివరికి వచ్చేసరికి ఒక పసికందు ఏడుస్తూ కనబడ్డాడు.. దగ్గర్లో ఎవ్వరూ లేరు. ఒక గంట అక్కడే వేచి వున్నా, ఎవరైనా వస్తారేమో అని. కానీ ఎవరూ రాలేదు. చూస్తూ చూస్తూ పసికందును వదలబుద్ది కాలేదు. ఇంటికి తీసుకెళ్దామా అంటే ముసల్ది ఏమంటుందో అని భయం. ఎలాగైతేనేమి ఇంటికి తీసుకెళ్ళాను. ఏమనుకుందో ఏమో ముసల్ది "కన్నబిడ్డలు కాదన్నారు, వీడినైనా మన బిడ్డలా చూసుకుందామయ్యా" అంది. హమ్మయ్యా అనుకొని సంతోషించాను.
       
                          కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వీడంటే నాకు దొరికాడు కాబట్టి పెంచుతాను, ఎందరో పిల్లలు రోడ్డు మీదనే బతికేస్తున్నారు , వాళ్ళందరి సంగతేంటి? వళ్ళ కోసం నా వంతు సహాయంగా నేను ఏమైనా చెయ్యాలి అనుకున్నను. వెంటనే ఈ విషయం పిల్లాడిని పడుకోబెడుతున్న ముసల్దానికి చెప్పాను, అది కూడా సరేనంది. పొద్దున్నే లేచి నా బాల్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. ఇద్దరు మాత్రం నాతో ఏకీభవించారు. మేము నలుగురం కలిసి మా ఇంటి వెనక ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి తాటాకులతో ఒక పెద్ద గది కట్టాం. నేను, నా స్నేహితులు వీధులన్నీ వెథికి అనాధ బాలలను తీసుకువచ్చాం. మొత్తం 10 మంది అయ్యారు. ఆ రోజు నుంచి నేను మధ్యాహ్నం కల్లా పండ్లన్నీ అమ్మి, మధ్యాహ్నం నుంచి ఒక వ్యాపారి వద్ద కట్టెల పని చేస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకొని అన్నం తిని పడుకుంటాను. రాత్రి పదింటికి లేచి ఫ్యాక్టరీ లో వాచ్ మెన్ గా పని చేస్తుంటాను. ఇలా ఆదివారాలు, పండగ రోజుల్లో గుడి దగ్గర ఉంటాను. మా ముసల్ది పొద్దుట్నించి సాయంత్రం దాకా దగ్గర్లోని బడిలో ఆయాగా పని చేస్తుంది, పిల్లలకి భోజనం వండి పెడుతుంది.
                                             నా స్నేహితులలో ఒకడు పిల్లలకు పాఠాలు చెప్తాడు, మరొకడు వారి కోసం అన్ని చోట్లా తిరిగి పుస్తకాలు, బట్టలు సేకరించి తెస్తాడు." అని తన కథంతా చెప్పాడు తాత.

                                           ఇదంతా విన్న ఆమెకు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోనారంభించిది. కన్నీళ్ళు తుడుచుకోవడం కూడా మరిచి తాతను అలాగే తదేకంగా చూడసాగింది. "ఏంటమ్మా ! అలా చూస్తున్నావు" అన్న తాత మాటలతో ఈ లోకం లోకి వచ్చింది.

Thursday, September 1, 2011

ఆమె కథ -3


                             ఆమె కథ -2


                                                    కొడుకు పట్నం వెళ్ళిపోయాక కనీసం క్షేమంగా చేరానన్న వార్త కూడా చెవిన పడలేదు. ఒక్క ఉత్తరం ముక్కైనా అందలేదు. ఇంక ఆమె తిండీ తిప్పల గురించి కష్టపడవలసిన రోజులు మళ్ళీ వచ్చాయి. "ఈ జీవుడు ఉన్నంత కాలం మనం దేవుడిని నమ్ముకుని ఏదో ఒక కష్టం చేసుకొవలసిందే కదా !" అనుకుని ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. ఒంట్లో బాగున్నా లేకపోయినా ఒక్క రోజు కూడా మానెయ్యకూడదు కదా పనిమనిషి, ఒకవేళ మనేసినా జీతంలో కోత. ఇలా ఏదోవిధంగా నాలుగు గింజలు నొట్లో పడేంత సంపాదించుకోగలుగుతుంది.

                                              ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె పని చేయాల్సిన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటామె కనబడి "నీ కొసమే వస్తున్నా ఇక్కడికి దగ్గర్లో మా పిన్నిగారిల్లు  ఉంది. వారికి పనిమనిషి కావాలట, నువ్వు ఉన్నవు అని చెప్పా తీసుకుని రమ్మన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం పదా !" అని అంది. ఆమెకు ఇష్టమా లేదా అనేది ఇంటామెకు అనవసరం కదా!        

                                          ఆమెతో వెళ్తుంది భువనమ్మ. అది వేరే వీధి. "మళ్ళీ రోజు 2 వీధులు దాటుకొని ఇక్కడ దాకా రావాలా" అనుకుంది. ఈ వీధిలోని వారు కాస్త మంచివారుగా తోస్తున్నారు ఆమెకి. అన్నీ పరికించుకుంటూ ఆ ఇంటిలోకి వెళ్ళింది. అక్కడికంటే కాస్త తక్కువ జీతమే అయినా ఎందుకో పని చెయ్యాలనిపించింది ఆమెకు. పని ఒప్పుకుని మరుసటి రోజు నుంచి వస్తానని చెప్పి వెనక్కి వచ్చేసింది.

                                                 కొత్త ఇంట్లో పనికి రెండు రోజులు ఇబ్బంది పడ్డా మెల్లగా సర్దుకుంది. అలవాటయిన పనే కాబట్టి పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. అలా రోజూ మొదట ఆ వీధిలో పని చెయ్యటం తిరిగి ఈ వీధికి వచ్చి పని చెయ్యటం, అలా కొనసాగుతుండగా ఒకరోజు ఈ వీధిలో ఇంటివారు ఊరు వెళ్తున్నామనీ మరల రేపు పనికి రమ్మనీ చెప్పారు. సరేలే అనుకుని నడుస్తూ వస్తుండగా  ఒకరింట ఒక తాత కట్టెలు కొడుతూ కనిపించాడు. అందులో ఆశ్చర్యమేమున్నదీ అంటారా! ఆ తాత పక్క వీధిలో పండ్లు అమ్మే తాత. తాతకు 90సం||లు ఉంటాయి. రోజూ గడప నిండా పండ్లు తెచ్చి వీధులన్నీ తిరిగి అమ్మేవాడు. మరి ఆయన కట్టెలు కొట్టడం ఏంటా అనుకుంది. "అయినా నా పిచ్చి కాకపొతే పండ్లు అమ్మడానికి వస్తే కట్టెలు కొట్టమన్నారేమో  నాలుగు డబ్బులు వస్తాయి కదా అని కట్టెలు కొడుతున్నాడేమో" అని అనుకుంది.

                                                    ఇలా కొనసాగుతుండగా రోజూవారి దినచర్యలో ఎక్కడో ఒకచోట తాత తారసపడేవాడు. కానీ వేరువేరు పనులు చేస్తూ "ఏమోలే ఈ తాతకి ఆశ ఎక్కువ ఉన్నట్లుంది" అని నవ్వుకుంది.

                                                     కాలం గడుస్తుంది. ఆ రోజు "కార్తీక పౌర్ణమి" పెందలాడే ఇళ్ళకెళ్ళి పనులు ముగించుకొని, గుడికెళ్ళింది. అప్పటికే పది గంటలయింది. హడావిడిగా గుళ్ళోకి వెళ్ళి 365 వత్తులు వెలిగించి, తీర్థ ప్రసాదాలు తీసుకుని, కాసేపు కూర్చుని, మెల్లగా ఇంటికి వెళ్దామని బయటకు వచ్చింది. తీరా తను చెప్పులు పెట్టే దగ్గర చూస్తే "తాత". ఇందాక హడావిడిలో గమనించలేదు. ఎందుకో తాత గురించి తెలుసుకోవాలనిపించింది ఆమెకు. తాత పక్కనే కూర్చుని "నాన్నా! నువ్వు ఎందుకు ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నావు. అంత డబ్బు ఏమి చేసుకుంటావు. తిండి మందం సంపాదించుకోరాదా?  " అని అడిగింది. అందుకు తాత నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆమె పట్టుబట్టి తాతను పదే పదే అడగడంతో తాత నోరు విప్పాడు.

Tuesday, August 30, 2011

ఆమె కథ -2


        ఆమె కథ -1                     

                                               ఎలాగో కష్టాలుపడి అతడిని మచ్చిక చేసుకుంటూ తను కష్టపడుతూ పిల్లలనైతే చదివించగలిగింది. అమ్మాయి యుక్త వయస్సుకి రానే వచ్చింది. కొడుకు చేతికందితే కష్టాలు తీరుతాయి కదా అనుకున్న ఆమె ఆశ నిరాశే అయింది. కొడుక్కి అవేమి పట్టవు. ఎంతసేపటికి నేను, నాది నా డబ్బు, నా సుఖం , ఇన్ని రోజులూ మీ దగ్గర నేనేమి సుఖపడ్డాను అంటాడే తప్ప ఇంకేమి పట్టించుకోడు. ఒకనాడు ఆమె కొడుకుని దగ్గరకు పిలిచి "చెల్లెలికి పెళ్ళి చెయ్యాలిరా! ఆ బాధ్యత నీదే, నాకా వయసు మీద పడుతుంది, మీ నాన్న చూడబోతే రోగంతో మంచం పట్టాడు ఈ ఒక్క సహాయం చేయరా" అని అర్ద్రమైన గొంతుతో వేడుకుంది. మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానిండి "నేను పెళ్ళి చేసుకొని ఆ వచ్చిన కట్నం డబ్బులతో చెల్లి పెళ్ళి చేస్తానులే" అన్నడు. ఘనుడు. కనీసం దానికైనా ఒప్పుకున్నాడులే అని సమాధానపడి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఎలాగైతేనేం అతడు పెళ్ళి చేసుకొని, చెల్లెలి పెళ్ళి చేసి అత్తగారింటికి సాగనంపాడు.
                                                     సంవత్సరాదిన అతడి పెళ్ళి, మధ్యమాన చెల్లెలి పెళ్ళి, బాధ్యతలు తీరినవిలే అనుకుంది ఆమె. ఇంకా ఎక్కడ "కర్మానుబంధం మనుష్యరూపే" అన్నట్లుగా ఇంకెన్ని కర్మలు(పనులు) చేయాల్సినవి ఉన్నాయో ఆమెకు తెలియదు కదా! కొడుక్కి పెళ్ళి అయి సంవత్సరం దాటిందో లేదో భర్త చావు, మనవడి పుట్టుక. "ఆహా యమా! సమం చేసితివా!" పిల్లలిద్దరి సహాయంతో ఆ కర్మలేవో కానిచ్చింది. కూతురు కర్మలవగానే తన అత్తగారింటికి అదేనండీ మన పట్నానికి వెళ్ళిపోయింది. కొడుకు ఎలాగో ఇంట్లో ఉండేవాడే, కానీ కొత్తరకం చిక్కు, అతడి బావమరిది కూడా ఇక్కడే ఉంటాడట భార్యగారి ఆజ్ఞాపన, భర్తగారి సమ్మతి తోడై , ఆమె పని మరింత పెంచాయి. అర్ధం కాలేదుటండీ కొడుకు కుటుంబం, కోడలి తమ్ముడిగారి కుటుంబం, మనవడి బాధ్యత ఇవన్నీ ఆమే కదా చూసుకోవాల్సింది.

                                                  సరేలే ఏమైతేనేమి మనకంటూ మిగిలింది ఏమీ లేదు కదా! వీరినైనా సంతోషంగా చూసుకుందాం అనుకుని వారికి సేవలు చేయసాగింది. కోడి కూయక ముందే లేవాలి, లేస్తుంది ఇళ్ళంతా ఊడ్చి, వాకిలి చల్లి, ముగ్గు పెట్టి, కాఫీ పెట్టి మొదట కోడలుగారికే ఇవ్వాలి. అది ఆమెగారి ఆజ్ఞ. భర్త ముందు తనే కష్టపడుతున్నట్టు ఉండాలి కదా , అదెలాగంటారా ముందు ఆమెకే ఇవ్వాలి అంటే ఆమెనే లేపాలి కదా... చూడని వారికి ఈ పనులన్నీ ఎవరు చేసారో తెలియదు కదా... కోడలుగారి మాట దురుసుతనం ముందు ఏది ఆగుతుంది చెప్పండి..... కోడలు కాఫీ తాగిన తర్వాత ఆ రోజు చేయాల్సిన టిఫినేంటో, వంటలేంటో చెప్తారన్నమాట. ఆ ఏర్పాట్లు చేస్తూ గుక్కెడు కాఫీ అయినా నొట్లో పోసుకోవడం మర్చిపోతుంది అప్పుడప్పుడు. 9 కొట్టేసరికి బాక్సులు కట్టి టిఫిన్లు పెట్టేస్తుంది. ఎవరి దారిన వారు పోయాక అంట్లన్నీ తోమి బట్టలుతికేసరికి సూర్యుడు నడినెత్తి దాటేసుంటాడు. ఏవో రెండు ముద్దలు తిందాంలే అనుకుంటుండగా మనవడి ఏడుపు. కోడలు లేదా అని చూస్తే ఉంటుంది కానీ టి.వి . చూస్తూనో, పక్కింటామెతో తను కొన్న కొత్త చీర గురించి చెప్తూనో... పైగా "అత్తయ్యా! ఏమి వెలగబెడుతున్నారక్కడ కాస్త ఇటు వచ్చి కొంచెం బాబు చూడొచ్చు కదా! అబ్బబ్బ ఈ ముసలావిడతో ఛస్తున్నాం" అని కూడా అంటుంది. "ఇదేమి చోద్యం!" అనుకుంటున్నరా ' అదే విధి ' . మనవడిని ఎత్తుకొని పాలు పట్టించి, నిద్రపుచ్చి తను తినేసరికి పక్షులు ఒకటీ, రెండుగా అప్పుడప్పుడే ఇళ్ళకు వస్తుంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా ఇల్లు చేరుకుంటారు.

                                                వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వేడి వేడి కాఫీ అందివ్వాలి. ఎవరూ సహాయం కూడా చేయరు. తనే అన్నీ చెసుకోవాలి.అదంతే. కాస్తో కూస్తో ఆ బావమరిదిగారి భార్య మంచిదనే చెప్పవచ్చు ఆమెను ఏమీ అనదు కాబట్టి. ఇలా ఆమె దినచర్య రాత్రి భోజనాలు, మంచాలు పరిచి పక్కబట్టలు వేయటం దాకా కొనసాగుతుంది. ఇలా, అలా, ఎలాగైతేనేమి ఆమె జీవితం సాగుతుంది. కాలం గడుస్తూ ఉంటే మనవడు, మనవరాలుతో పాటు కూతురికి ఒక కొడుకు పుట్టాడు. వారిలో తన బాల్యాన్ని చూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది.

                                  ఇంతలో ఒకరోజు కొడుకు బావమరిదిగారు వచ్చి "బావా! నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. నేనూ, నా కుటుంబంతో సహా వెళ్ళదలిచాను" అన్నాడు. "హమ్మయ్యా! ఒక బాధ్యత తప్పిందిలే ఆమెకు" అనుకుంటున్నారా.... ఇంకా చదవండి "నాకు ఉద్యోగం వచ్చిన ఫ్యాక్టరీలోనే నీకు కూడా ఒక చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తాను, కాకపోతే ఒక 2లక్షలు ఖర్చు అవుతుంది. నీ ఉద్యోగం వచ్చేవరకు నువ్వు నా దగ్గరే ఉండవచ్చు. ఇన్ని రోజులూ నువ్వు నన్ను చూసుకోలేదా ఏమి?" అని ఇంకా అతను సమాధానం చెప్పకముందే "ఏమంటావే అక్కా! నువ్వైనా చెప్పు బావకి" అని సైగ చేసాడు. ఇదే అదనుగా "అవునండీ పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, మన కష్టాలు తీరిపోవాలన్నా ఇదే మంచి అవకాశం. మీరు కాదనకూడదు .... లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంతే" అంది.

                                    దానికతడు కాసేపు ఆలొచించి ..... "అది కాదే 2లక్షలంటే మాటలా ఇప్పటికిప్పుడు ఎక్కడనుంచి వస్తాయే " అన్నాడు. దానికామె "ఓస్! అదా మీ దిగులు. లంకంత కొంప మనమెవరూ లేకపోతే ఏం చేసుకోవడానికి...? దీనిని అమ్మితే పోలా!" అంది. అందుకతడు "ఆ! ఇంటిని అమ్మెయ్యాలా....? మరి అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆమెను చూసేవారు ఎవరు?" అని అడిగాడు. దానికి బావమరిదిగారి భార్య "అన్నయ్యగారూ! మీరు మరీ అంత బాధపడాలా మా పుట్టింటికి దగ్గరలో ఒక చిన్న గది ఉంది. ఇరవై వేలంట, అమ్ముతున్నారని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు చెప్పింది. ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో అది ఎంతో కాదు కదా! మనకని చెప్తే కొంత తగ్గిస్తారు కూడా... అంతేనా.. ఏమంటావ్ వదినా" అంది.

                                    ఇదీ ఆమెగారి మంచితనం.

                                    "ఇంకేంటండీ ఆలోచిస్తున్నారు. త్వరగా ఇల్లు అమ్మకం పెట్టంది లేకపోతే నేను మా...."
                                     "సరె సర్లేవే అలాగే కానిద్దాం"

                                      ఆమె గుండె ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకురా దేవుడా నన్ను తీసుకెళ్ళలేదు అని గట్టిగా అరవాలనుంది. కానీ, ఏనాడు నోరెత్తి గట్టిగా మాట్లాడనైనా లేదామె. ఇంక ఏమనగలుగుతుంది. చూసారా కాలం ఎంత బలీయమైనదో, విధి ఆడిన వింత నాటకానికి ఆమె మరొకసారి బలయ్యింది. "ఏమిటో కదా ఈ లోకం...."

   ఆ విధంగా ఆమె ఆ మారుమూల పల్లెలోని ఒక చిన్న గదికి చేరింది. ఇప్పుడు ఆమెకు 50సం||లు.


Friday, August 26, 2011

ఆమె కథ -1



                                         సుమారు 50 సం||లు ఉంటాయి ఆమెకి.వృద్ధాప్యపు ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.అలాగని ఆమెది కృతిమ సౌందర్యం కాదు.చక్కటి మేని ఛాయ ఏ దేవతో తన అందాన్ని ఈమెకి ధారాదత్తం చేసిందా అన్నట్టుగా ఉంది ఆమె అందం.ఈ అందానికి తోడు ఆమెలోని మంచితనం, సహృదయం వంటి సుగుణాలు ఆమెకు వన్నె తెచ్చాయి.వయస్సు మీద పడినా చాదస్తపు ఛాయలు కనబడుటలేదు.కానీ ఆమె మనస్సు ఏ మాత్రం ఆనందంగా ఉంది అనేది ఎవరికీ తెలియని విషయం.

                                         ఆమె అందరికీ కావాలి, కానీ ఎవరికీ ఆమె అక్కరలేదు. ఇదేంటీ చిత్రంగా ఉందే అనుకుంటున్నారా! అదే మరి అర్ధం కావల్సిన విషయం.ఆమె అందరికీ కావాలి అంటే ప్రొద్దున లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ ఆమె అవసరం ఖచ్చితంగా ఉంటుంది.ఎవరికీ ఆమె అక్కర్లేదు అంటే ఆమె ఆనందంగా ఉందా, ఏమైనా తింటున్నదా లెదా? అనే విషయాలు ఎవరికీ పట్టవు.మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడపాల్సిన వయస్సు.కానీ ఎవరికీ కాకుండా ఒంటరిగా ఎక్కడో మారుమూల పల్లెలో ఇలా గడపాల్సి వస్తుంది జీవితం.ఆమె ఏనాడు అనుకొని ఉండదు ఈ రోజున ఇలాంటి జీవితం గడపాల్సి వస్తుందని.  

                         ఏంటీ! ఎంతసేపటికీ ఆమె,ఆమె జీవితం,ఆమె బాధ అంటూ సాగదీస్తావు ఇంతకీ ఏమిటి "ఆమె కథ" అంటారా వినండి చెప్తా.

                                            ఆమె పేరు "భువన".ఆమె పుట్టిన 6సం||లుకే తండ్రి చనిపోయాడు.అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎందరు ఉన్నా ఆమె ఎవరికీ ఏమి కానిది ఎందుకంటే ఆమె పుట్టిన తరువాతే వారింట దరిద్రలక్ష్మి తాండవిస్తుందని వారి భావన.వీరికి తినడానికి తిండి,కట్టుకొవతానికి బట్టా, విలాసాలకు రొక్కము మొ|| వాటికి ఏ మాత్రం కొదువ లేకపొయినా, ఆమె పుట్టిన దగ్గరినుండి తండ్రి వారిని సరిగా దగ్గరకు రానివ్వకపోవటం,ముద్దులాడకపోవటం, చేతిఖర్చులకు సొమ్ములివ్వకపొవటం వారికి నచ్చేది కాదు.అందుకే ఆమె అంటే వారికి ఇష్టం ఉండెడిది కాదు.    
                                                    తండ్రి చనిపోయిన దగ్గరనుంచి మొదలయినవి ఆమె కష్టాలు.ఎవరూ ఆమెతో మాట్లాడెడి వారు కాదు,ఆటలాడేవారు కాదు.కనీసం దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.చెల్లి,తమ్ముడు ఉన్నను ఆమెను అంతగా పట్టించుకునేవారు కాదు.ఇక తల్లి సంగతి సరేసరి."నువ్వు పుట్టినప్పటి నుంచే కదే మాకు ఈ కష్టాలు" అంటూ రోజుకు ఒకసారన్నా తిట్టేది.ఇదిలా ఉంటుండగా కాలచక్రం ఆమె కోసం ఆగకుండా పరుగులెడుతూ,నీకంటే నేనే ముందంటూ 20సం||లు వద్ద ఒక్కసారి ఆగింది.ఇప్పుడామెకు 26సం||లు అంటే యుక్తవయస్కురాలు అన్నమాట.ఏదో విధంగా ఆమెకు వదిలించుకోదలచి తల్లి ఆమె అన్నలతో చేరి అతి తక్కువ కట్నం తీసుకునేవాడికిచ్చి కట్టబెట్టింది.

                                                     హమ్మయ్య పోనీలే ఇకనైనా సుఖపడుతుంది అనుకుంటున్నారేమో కాస్త అక్కడ ఆగి ఇది చదవండి అతడు చక్కనివాడే కానీ చిక్కనివాడు ,చిక్కులు కొనితెచ్చువాడున్ను.అంటే రోజుకో రకంగా ఇంటికి వచ్చువాడు.ఒకరోజు త్రాగి వస్తే,మరొక రోజు అప్పులవారిని వెంట తెచ్చువాడు.ఒకరోజు పేకాటరాయుళ్ళతో వస్తే మరియొక రోజు పడతితో వచ్చేడి వాడు. విధి ఆడిన వింత నాటకానికి తను బలిపశువు అయిందా అన్నట్లు ఆమెకు 32ఏళ్ళు రాగానే ఇద్దరు పిల్లలు చదువుకు వచ్చారు. పెద్దవాడికి 1వ తరగతి పుస్తకాలు కొనాలి. చిన్నదాన్ని బడిలో వెయ్యాలి కానీ ఇవేమీ పట్టవు ఆ జల్సారాయుడికి. అలాంటి వాడికి పిల్లలెందుకు అంటారా! అన్ని రోజులూ వాడి దగ్గర డబ్బు ఉండదు కదా, డబ్బులేనినాడు పడతులు వచ్చేవారు కాదు, వాడి సుఖం కోసం ఆమెనే పడతిగా తలచెడివాడు. ఆ గుర్తులే ఈ పిల్లలు.

Thursday, August 25, 2011

ఆమె కథ - ముందుమాట


ముందుమాట:
నేను ఈ కథ రాసేముందు ఏదో ఒక కథ రాద్దామని ఆరుబయట కుర్చీ వేసుకొని డైరీ, పెన్ చేతిలో పెట్టుకొని కూర్చున్నాను. కాసేపు ఆలోచించగా కథలో ముందు రాసిన 4 లైన్లు వచ్చాయి. తర్వాత ఇంక ఆలోచించలేదు పెన్ను రాస్తూనే ఉంది ఆగకుండా.... కాకపొతే ఇది చక్కగా ఆహ్లాదపరిచే విధంగా ఉండకపొయినా  మధ్య తరగతి ఆడవారి జీవితంలో పడే కష్టాలని వివరిస్తుంది... ఇది ఈ రోజుల్లోని వారికి వర్తించకపొయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి కష్టాలు పడే వారు ఎక్కడో ఒక చోట ఇంకా ఉన్నారని గుర్తు చేస్తుంది....ఈ కథ యొక్క ఆఖరి భాగం మటుకు ఆసక్తికరంగా ఉంటుంది.....

నేను ఈ కథ 2008 లో రాసాను.... కానీ ఇక్కడ ప్రచురించలేకపోయాను... కథ కొంచం పెద్దది అవటం వలన భాగాలుగా పోస్టు చేస్తాను..ఈ కథ పూర్తిగా చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని నాకు తెలియపరచవలసిందిగా మనవి.....

Wednesday, August 24, 2011

బాబాని నమ్మేవారికి మాత్రమే......

బాబాని నమ్మేవారికి మాత్రమే......

కర్ణాటకాలో ఎవరో 108 రోజుల సాయి దీక్ష చేసారటండీ.....
ఆఖరి రోజున హోమం నిర్వహించినప్పుడు ఒక అద్భుతం జరిగిందట......
శ్రీ శిరిడీ సాయి బాబా వారు తమ దర్శనభాగ్యం కలుగజేసారంట...

ఇక్కడ పెట్టిన ఫొటోలు ఆ రోజు తీసినవే... కాకపోతే ఫోను లో తీసిన ఫొటోలలో మాత్రమే బాబా కనిపించారంట.......  వీడియోలో కనపడలేదంట..

ఇది  బాబాని నమ్మేవారికి మాత్రమే.

నమ్మనివారు  దీనిమీద వ్యాఖ్యానించవద్దని మనవి........


Tuesday, June 28, 2011

నా మెయిలు లోంచి వచ్చిన పోస్టు

నా మెయిలు లోంచి వచ్చిన పోస్టు
ఉన్న మార్గాలలో ఇదే బెస్టు
ఇలా పోస్టు రాయడం ఇదే ఫస్టు
ఇక పట్టబోదు నా బ్లాగుకి రస్టు

Sunday, May 8, 2011

అమ్మ మనసు


అమ్మ మనసు

ఎంత నొప్పినయినా భరించి
మనలని కనగలదు.........
ఎంత బాధనయినా తట్టుకుని
నాకేమి ఫరవాలేదు అనగలదు.......
ఎన్ని కష్టాలూ వచ్చినా
నీ కోసం నవ్వగలదు.......
ఎవరెన్ని మాటలన్నా
నీ దృష్టిని మరలనియ్యదు......
ఎన్నెన్ని అడ్డంకులు ఎదురైనా
నేనున్నానని అభయం ఇవ్వగలదు..........
ఎన్ని తిట్టినా
విలువైన ఆశీర్వాదము ఇవ్వగలదు........
ఎంత మందిలో ఉన్నా
తనదైన ప్రేమ పంచగలదు........

అంత గొప్పదైన అమ్మ మనసుని
4 మాటలలో చెప్పడం కుదరకపోయినా....
అమ్మ మన కోసం 1 మాటలో చెప్పగలదు.......

Thursday, April 21, 2011

బాగా నవ్వుకున్న వాక్యం...

ఈ మధ్య ఎక్కడో చదివి బాగా నవ్వుకున్న వాక్యం......

థియేటర్ లో ఇంటర్వెల్ లో కొందరు స్నేహితులు కనిపించి ఎలా పలకరించాలో తెలియక "సినిమా కి వచ్చావా?" అని అడుగుతారు.......
థియేటర్ కి సినిమా చూడడానికి కాకపొతే పల్లీలు అమ్ముకొవడానికి వస్తామా?

Sunday, April 3, 2011

ఉగాది పండుగ గురించి నాకు తెలిసిన కొంత ......

అసలు ఉగాది అంటే....
అంటూ మొదలుపెట్టి మిమ్మల్ని ఇబ్బందులలో పడవేయకుండా..... యుగాది పండుగ గురించి నాకు తెలిసిన కొంత మీకూ చెబుతాను....


ఇప్పటికే ఈ పండుగ గురించి చాలా మంది చెప్పి ఉన్న కారణాన, నేను అత్యవసరమైనవి.... వారు చెప్పని 4 మాటలు మాత్రం చెప్పదలిచాను...


యుగాది నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది..... వసంత ఋతువుతో మన ఇంట సుఖ సంతోషాలను నింపుతుంది...
యుగాది అంటే యుగానికి ఆది అని చెప్పుకోవచ్చు......


త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు ఈ రోజునే సృష్టి ని మొదలుపెట్టి ,భూమిని,కాలాలను,రోజులను,నెలలను, పగలురాతురులనూ,ఋతువులను,సంవత్సరాలనూ సృష్టించారని మన శాస్త్రము చెబుతున్నది.........


రామాయణ కాలములో ఉత్తరాయణము మొదలైన మొదటి రోజున ఉగాది జరుపుకునేవారట......... అంటే చైత్రము ఆఖరి నెల అన్నమాట.


6వ శతాబ్దములో వరాహమిహిర మహర్షి నూతన సంవత్సరమును చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేలా మార్చారు......


ఆ విధంగా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనము ఉగాది పండుగ జరుపుకుంటున్నాం....


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పండుగ సంధర్భంగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ..... అందరికీ ఈ సంవత్సరం.... కొత్త వెలుగు జిలుగులిస్తూ... ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......

Monday, March 28, 2011

వీళ్ళు చిచ్చర పిడుగులు.....!!!!!


స్నేహితులందరం కలిసి చాలా రోజులయ్యిందని ఈ మధ్య కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్నాం...

అందులో విశేషమేముంది...? అది అందరూ చేసే పనేగా అనుకోకండి.....

ఆ మాటల్లోనే కొన్ని విషయాలు తెలిసాయి ...

నా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు గురించి చెప్పింది ......

దానికి 3 ఏళ్ళ వయసున్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ పిలిచి Apple,Ball చెప్పవే అని అడిగారటండీ...
అందుకా పాప లోపలికి వెళ్ళి పుస్తకం తెచ్చి వాళ్ళమ్మ చేతిలో పెట్టి
"ఇందులో ఉన్నాయి చదువుకో మమ్మీ " అన్నదంట

చూసారా ఈ కాలం చిన్నారుల తెలివితేటలు...

అంత దాకా ఎందుకండీ... మా అక్క స్కూల్ టీచర్ గా పని చేస్తుంది .....
దానికి ఇద్దరు అమ్మాయిలు..... చిన్నది చిచ్చర పిడుగంటే నమ్మండి....

అది చదివేది 2వ తరగతి ..... దానికి స్కూల్ బోరు కొట్టేసిందంట ......
మొన్న వాళ్ళ అమ్మతో అంటుందీ....

"అమ్మా నేను ఇంక స్కూలుకు వెళ్ళను .... ప్రిన్సిపల్ సార్ ని అడిగి నాకు టీ.సీ. తెచ్చేసెయ్యి... నేను హాయిగా ఇంటిలో ఉండి ఆడుకుంటాను , డాన్స్ నేర్చుకుంటాను... ఇంక నేను చదవలేను...!"

పాపం ఆశ్చర్యపోవడం మా అక్కవంతైంది...

దాని స్కూల్స్ అయిపొయాయి , మా అక్క ఇంకా వెళ్ళాల్సి ఉంది, పెద్ద క్లాసు వారికి స్కూలు ఉంటుంది కదా... అందుకు...

అది అంటుందటా...

" అమ్మా రోజూ స్కూలుకేం వెళతావులే గానీ నువ్వు కూడా సార్ ని అడిగి టీ.సీ. తెచ్చేసుకో " అని


వీళ్ళు చిచ్చర పిడుగులు కాదంటారా....

Friday, March 18, 2011

English బ్లాగులను ఎక్కడ పోస్టు చేయవచ్చు


కూడలి లో తెలుగు బ్లాగులు మాత్రమే చేర్చబడతాయి అని "కొత్త బ్లాగు చేర్చండి" లంకె లో అడ్మిన్ గారు చెప్పారు.
కానీ కూడలిలో English అనే లంకె అందులో English బ్లాగులు ఉన్నాయి మరి...

మన English బ్లాగును అందరూ చూడాలి అంటే ఎవరికి రాయాలి...?

మీకు తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్.....

Tuesday, March 8, 2011

గ్యాస్ చుక్క కన్నీటి చుక్కాయెనా...!



పెరుగుతున్న గ్యాస్ ధరలు చూస్తుంటే గుండె దడ పుడుతుంది.
ఇప్పుడు $4/గ్యాలన్ ఉన్న గ్యాస్ ఇలాగే పెరుగుతూ పొతే ఆకాశాన్నంటుతూ $8/గ్యాలన్ అయినా ఆశ్చర్యపొనక్కర్లేదేమో ......


దీనికి కారణం ఎక్కడో జరిగే ఆందోళనలే అయినా , ఇక్కడ మనల్ని కూడా కల్లోల పరుస్తున్నాయి  అంటే అతిశయోక్తి కాదు..


ఇటీవల మా కజిన్ వాళ్ళు కారు కొనుక్కుంటుంటే మేము వెళ్ళాము.


ఆ కారు అమ్మే పెద్దమనిషి అంటారు "మా కాలంలో అయితే 80 సెంట్లకి గ్యాలన్ చొప్పున $8 కి టాంక్ నిండిపొయేది" అని


మరి రాబొయే కాలం చూస్తుంటే $80కి అయినా టాంకు నిండేనా....? 


ఇదో మిల్లియన్ డాల్లర్ల ప్రశ్నగా మారింది...    

Tuesday, February 8, 2011

నచ్చిన జోకు.....



నేను ఈ మధ్య చదివిన వాటిలో నాకు నచ్చిన జోకు...


కుర్రాడు : నాకు ఏ అమ్మాయిని చూసినా మల్లె, సన్నజాజి తీగల్లా కనిపిస్తున్నారు....
వివాహితుడు : ఆ... వాళ్ళే ఆఫ్టర్ మారేజ్ కందిరీగ, కరెంటు తీగల్లాగా కనిపిస్తారు.....



Thursday, January 13, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు.....

బ్లాగరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.....

సంక్రాంతి గురించి నేను ఇదివరకు వివరించిన పోస్ట్ ఇక్కడ జతపరుస్తున్నాను...

సంక్రాంతి

Monday, January 3, 2011

కొత్త సంవత్సరం...నూతనోత్సహం



కొత్త సంవత్సరం...


వస్తున్నది అని తెలియగానె ఏదో తెలియని ఉత్సాహం....
ఎన్నో ఆలొచనలు... ఏవేవో ఆశయాలు....


రాగానే ఎందుకో తెలియని ఆనందం.....
ఇది ఇలా చెద్దాం... అది చేయడం మానెద్దాం...
ఈ సారైనా కొన్ని తప్పక పాటిద్దాం...
మన జీవితంలొనే కొత్త మార్పులు తెద్దాం...
అని ఎన్నో ఎన్నెనో కలలు, ఎవో తెలియని ఆశలు....


కాని నిజానికి... అవి ఎప్పటికప్పుడు మారే భావాలే
అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యము....


ఇలా రోజులు దొర్లుకుంటూ పొయేసరికి....


"మనం అనుకున్నవి జరగవు.... జరిగేవి జరగక మానవు..."    అనే నిజాన్ని తెలుసుకుంటాం.....


అయినా మనము మనుషులం ..... ఆశావాదులం...


కొత్త సంవత్సరాన్ని చూడగానే...... ఏదొ తెలియని నూతనోత్సహంతో  మళ్ళీ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం....


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు


(కాస్త ఆలస్యంగానే.....)